ఇది ఆది నుండి
అందరి గొంతులో దిగబడుతున్న
కర్కశ శూలం
తట్టుకోలేనితనంతో
అంతా దానిని పాతరేయజూస్తుంటే
మరల మరల అది
నిటారుగా మొలుస్తూ
జూలు విదిలించి
తన కొక్కేనికి నీ పీక
తగిలిస్తోంది...
ఎంత ఓర్చుకోలేనితనం
ఒక్కమారుగా గుంపుగా మందలా
పడి దాన్ని నలిపేయ నమిలేయ
జూస్తే పళ్ళమధ్య ఇరుక్కొని
కుక్క ఎముకను
కొరుకుతూ తన పళ్ళసందుల
కారే నెత్తురు రుచికి ఆహా అనుకున్నట్లు
తన్మయత్వంలో వున్నావా?
ఆగాగు
యుగాలుగా దానిని ఉరితీసిఊపిరి పీల్చుకుందామనుకుంటే
అది నీ మెడ చుట్టూ
బిగుసుకుంది చూడు...
(ఆదివాసీ హక్కుల కార్యకర్త డా.బినాయక్ సేన్ పై మోపబడ్డ దేశద్రోహ నేరమూ-శిక్షకు వ్యతిరేకంగా)