Sunday, September 5, 2010

కాస్తంత ఎండను ఆహ్వానిద్దాం..
ఎప్పుడూ చలువరాతి గదుల్లోనేనా!
కాస్తంతా ఎండను కూడా ఆహ్వానించండి

ఎండ మీ గుండె గదిమూలల్లో
తగిలేలా బార్లా తలుపులు తెరిచి వుంచండి..

గాభరాగా బయటకు వచ్చి
తుఱున మరల లోపలికి ముడుచుకుపోయే
స్ప్రింగ్ డొర్ లను అడ్డుపెట్టి ఆపండి
లేదా బద్దలుకొట్టి బయటపడండి..

ఎండ జీవితంలో సుఖ దుఃఖాలకు సంకేతం..
దాని రూపు తెలీకపోతే
మీతో పాటుగా మీ మెదడు కూడా
నాచు పట్టిపోగలదు..

కాస్తంత ఎండను ఆహ్వానించండి
గట్టిగా నేలను తన్నిపెట్టి
శక్తినంతా పాదాలలోకినెట్టి
పైకెగరండి..
ఆకాశపుటంచులతాకే చేతులకు
అంటిన మబ్బుల చల్లదనం
ఎరుకౌతుంది...

కాస్తంత ఎండను ఆహ్వానించండి
ఎదను హత్తుకున్న మీ
మిత్రుని గుండెలయ మీ
గుండెపొరల ద్వారానే తెలుసుకోండి..
మీలోకి పాకిన తన రక్తచలన
సంగీతాన్ని చెవులారా విని
గొంతులో స్వేచ్చా గీతాన్ని
జుగల్బందీగా గానం చేయండి..

ఎల్లలు చెరిగిన నిర్వాణక్రమాన్ని
అనుభూతిచెందండి..

కాస్తంత ఎండను ఆహ్వానిద్దామా?

12 comments:

 1. meekosam eduruchustu endalo waitchestunnanu ,mimmulanu hatthukundaamani-inkaa enthasepu?

  ReplyDelete
 2. రా మిత్రమా బార్లా చాపిన నా చేతుల మద్య ఒదిగిపోయి గట్టిగా హత్తుకొని మన పురాజ్నాపకాలన్నీ కలబోసుకుందాం..

  ReplyDelete
 3. వర్మ గారూ,
  చాలా రోజులైంది మాట్లాడి...కవిత చాలా బావుంది
  ఎండని సింబలైజ్ చేసారు కదూ....అందరూ వెన్నెల గురించి కవిత్వాలు
  చెపుతుంటే ఎందుకో ఎండ గురించి రాయాలనిపించేది.మీరు ఏ అర్ధం లో రాసినా
  కవిత్వంలో ఎవరికి కావాల్సింది వారు వెతుక్కుంటారు కదా..నేనూ అంతే...
  మల్లిక్ గారూ,
  ఇంతేసి మంచి వాక్యాలు రాస్తున్నారు కదా తెలుగు లిపి ఏం పాపం చేసిందండీ
  మీ భావాలను పొదగలేకపోతోంది....(చూసారా...నేనే వేరే బ్లాగ్ కి వచ్చి మరీ పొగిడాను)

  ReplyDelete
 4. chaala bagunai mee kavitalu

  -sandya

  ReplyDelete
 5. మళ్ళీశ్వరి గారూ ధన్యవాదాలు. కాస్తంత తీరిక చేసుకొని నా రాతల పట్ల మీ అభిమానానికి కృతజ్నతలు. మనలో మనం బ్లాగ్ చూసాను. అందులో సంస్థ కార్యక్రమాలు రాస్తే బాగుంటుంది. మన సైద్దాంతిక అవగాహను రాయండి.

  ReplyDelete
 6. సంధ్యగారూ నా కవితలపట్ల మీ అభిమానానికి కృతజ్నతలు.

  ReplyDelete
 7. అవును, అసూర్యంపశ్యలకి ఇదొక చేర్నాకోల! బాగుంది. మరిన్ని ఎండ కవితలు రాయండి.

  ReplyDelete
 8. అఫ్సర్ సార్, మీ కామెంట్ పొందినందుకు చాలా ఆనందంగా వుంది. ఈ ప్రోత్సాహంతో రాయడానికి ప్రయత్నిస్తా.. ధన్యవాదాలు..

  ReplyDelete
 9. కెక్యూబ్ గారూ...,మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చతుర్థి పర్వదిన శుభాభినందనలు

  హారం

  ReplyDelete
 10. ధన్యవాదాలు భాస్కర రామిరెడ్డిగారూ..

  ReplyDelete
 11. కవిత చాలాబావుందండీ.....మాకు ప్రతి ఉదయం సూర్యకిరణాలు ఇంట్లోకే వచ్చి పలకరిస్తాయి.తూర్పువైపు స్థలం శుభ్రపరుస్తున్నారు.ఏదైనా మరో అపార్ట్ మెంట్ వెలుస్తుందేమో...మీ కవిత చదివాక మరింత దిగులు అనిపిస్తుంది.

  ReplyDelete
 12. కేక్యూబ్ గారికి, నమస్కారములు.

  కవితను చదివిన తరువాత, మీరు చెప్పదలుచుకున్న భావాలను స్పష్టంగా చెప్పలేదని నాకు అనిపించింది. ``కాస్తంత ఎండను ఆహ్వానించండి...ఎదను హత్తుకున్న '' అనే ఈ పెరాలో, ఎండకూ మిగిలిన విషయాలకూ గల సంబంధం ఏమిటో నాకు అర్ధం కాలేదు. ఇంకొన్ని కవితలపై నా స్పందనలను చూడగలరు.
  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...