Monday, July 21, 2014

నువ్వు - అల



సముద్రమంత మనసు నీది 
ఎన్ని అలలు వచ్చినా పోటెత్తని తీరం దాటని గంబీరత నీది

వెన్నెల అలా నీ గర్భంలో స్నానమాడి 
ఈదులాడి ఆకాశానికి అతుక్కుపోదామనుకోలేదిలా

నువు పిలవని అతిధిలా నీ గుమ్మం ముందు 
చిట్లిన పెదవినంటిన నెత్తుటి చిరునవ్వుతో

నీ కళ్ళలో నైరాశ్యం వలయంలా
నీ కరచాలనంలో విరిగిపడిన 
అసహజ మెలికల మెటికల శబ్దం గుచ్చుకుంటూ

తీరం చేరని అలలా ఒరుసుకుంటూ
వి
రి
గి 
డు
తూ
.
.
.

Sunday, July 13, 2014

కలల అంచున...


కనుదోయలో కరగని కలను 

నిశిలో కలవని కలను

ఎక్కడో జమ్మి చెట్టు కొమ్మల మద్య దాచి

కత్తిరింపులేని కలను

సంద్రపు అలల అంచుల చివర్ల

కాగితప్పడవల రెప్పల కొనల 

వేలాడదీస్తూ...

Monday, July 7, 2014

ఆదివారం వార్తలో నా కవిత 'ఒక సమయం'

ఒక సమయం

పక్షి రెక్కల టప టపల నుండి 
రాలిన చినుకుల రంగు 
దేహమంతా

సీతాకోక చిలుక రెక్కల నుండి
జారిపడిన పుప్పొడి 
కనురెప్పల మీద

వరి పైరు మీదుగా వీచిన
గాలి పచ్చగా 
పరిసరమంతా

తడిచిన మట్టి పరిమళం
కోనేటి మీదుగా 
అలలు అలలుగా

రంకె వేస్తున్న కోడెద్దు కాలి
గిట్టల నుండి ఎగిరిన
ధూళి ఎర్రగా

సుదూరంగా వెదురు వనాల 
నుండి గాయపడ్డ 
రాగమేదో కోస్తూ

పడమటి కొండ గొంతులో
భారంగా సూరీడు
ఆత్మహత్య

ముఖం చూపలేని వెన్నెల 
దు:ఖాన్ని దోసిలిలో 
ఒంపుతూ

Thursday, July 3, 2014

నిదురపో...


అక్షరానికింత పరిమళమెందుకొ 


నువ్వలా కాసిన్ని మాటలు మౌనంగా పోగు చేసి నీ మునివేళ్ళతో దారం కడుతున్నప్పుడు



తడి అంటిన పూల మధ్య ఏదో సంభాషణ మొదలయ్యి ఖాళీలను పూరిద్ద్దమనుకుంటూ



అలా గాలి వీస్తూ కొన్ని రేకులు విడివడి నీలి శంఖం పూల కాంతి నీ కనురెప్పలపై వాలి బరువుగా నిద్రనావహిస్తూ ఓ ఆవలింత



ఓ పక్కకు ఒరిగి ముంజేతి మలుపులో సేదదీరే వేళ కాసింత నిశ్శబ్దాన్నాహ్వానిస్తూ కిటికీ తెరచి వెన్నెల పరచుకుంది 



నిదురపోరా...
Related Posts Plugin for WordPress, Blogger...