Friday, April 26, 2013

మెలకువను మింగిన రాత్రి..

కనురెప్పల కావల దాగిన ప్రతిబింబాలను
నలుపు తెలుపు రేఖా చిత్రాలుగా మార్చుకొని...

గాలిపటాన తోక చివర అతికించి
నల్లని ఆకాశాన ఎగురవేద్దామని...

తోకను కత్తిరిస్తూ ఓ తోక చుక్క తన దేహ
కాంతిని ఓ క్షణమిచ్చి మాయమయింది...

ధడాలున నేలనంటుతూ కల చెరిగిపోని
వర్ణ చిత్రంగా ఆ పచ్చ గడ్డి కొసలపై మెరుస్తూ....

రాతిరంతా కురిసిన వాన
తడి ఆరని బురద మట్టిలో ఇంకిపోతూ...

రెక్క తెగిన పక్షి ఒకటి ఈ కాగితాన్ని
ముక్కున కరచి కుంటుకుంటూ...

చిరిగిన జెండా గుడ్డనే ఎగురవేస్తూ తూటా
దిగబడ్డ కాలితో ఓ యువకుడు పరుగులెడుతూ...

నెత్తురంటిన ముఖంతో ఖిన్నుడై
ముఖం చాటేసిన చందమామ ఆకు చాటున దాగుతూ...


ఈ  రోజు వాకిలి ఈ-పత్రికలో ప్రచురితమయింది..


Wednesday, April 24, 2013

రాత్రి...

 
 
 
 
 
 
 
 
 
రాత్రి...

నిద్రను
వెన్నెల
కొక్కేనికి
వేలాడ
దీసి
నలుపు
తెలుపుల
మిశ్రమాన్ని
కలలకు
పూత
పూస్తూ...
జ్ఞాపకాల
పుటలకు
గుండె
తడిని
జిగురుగా
అతికిస్తూ...

గాయాన్ని
రేపే
గానమేదో
నిశ్శబ్దంగా
దేహమంతా
ప్రసరిస్తూ...

రాజుతున్న
మది
నిప్పు
వేలి
చివుళ్ళ
మండుతూ...

ఒంటరిగా
ఖాళీ
కూజాలో
గ్లాసు
నింపని
దాహంతో...

తెలవారని
ఆకాశంలో
నెత్తురోడుతూ
రాలుతున్న
నక్షత్రం
బూడిదౌతూ...

Sunday, April 21, 2013

చైత్రపు చినుకు...

మంచి గంధం వాసన కన్నా
ఈ ఎండిన నేలపై పడ్డ చినుకు పరిమళం
అంతరాత్మను తట్టి లేపుతుంది...

ఆకాశం నుండి జారుతున్న ఒక్కో చినుకు
నాలిక అంచు చివర ఒడిసి పడ్తూంటే
లోలోపలి తడితనాన్ని తడిమి చూపుతుంది...

గడపలో పడ్డ ఆకాశపు మంచు గడ్డలను
అరచేతిలో కరగబెడ్తూంటె మనసు
మూలల దాగిన రాతి నిప్పు ఆవిరవుతుంది...

ఒక్కో చిగురుగుండా మొక్క దేహమంతా
పాకుతూన్న చినుకు తడి మట్టి
అంతర్భాగంలోంచి జీవస్సునందిస్తుంది...

ఎర్రగా కాలుతున్న పెనంపై పడ్డ నీటి జల్లులా
మండుతున్న నేలపై జాలువారిన వాన చినుకు
నీలో దాగిన రహస్య సంగీతాన్నాలపిస్తుంది...

నిండుగా ఆకాశం వైపు కను రెప్పలు విప్పార్చి
చూస్తూ చేతులు చాచి దేహమంతా నగ్నంగా
ఈ చైత్రపు తొలి చినుకులలో తడిసి సేదదీరనీ...

Friday, April 19, 2013

ఫార్టీ ప్లస్...


అద్దం భయపెడుతోందిప్పుడు!
రోజు రోజుకి తరుగుతున్న చర్మం నునుపుదనంతోపాటు
కళ్ళకింది చారలు వెనక దోబూచులాడుతున్న
లోలోపలి విషాదమేదో ఉబకని కన్నీటి చుక్కను
ఆకు ఈనె చివర ఒడిసి పడ్తూ...

అక్కడక్కడా పొడుచుకొచ్చిన ఎండు గడ్డిలాంటి
తెల్ల వెంట్రుకలతో రాని పెద్దరికమేదో మీదపడి
భుజాలపై మోయరాని భారమేదో కావడి కర్ర
జవ జవలాడుతూ కిందకు గుంజుతున్నట్టు...

పులిమిన నల్ల రంగు వెలసి పోయినప్పుడంతా
రంగు కరిగిన నక్కలా బయటపడుతూ
మూతి మీద మీసంపై మునివేళ్ళతో దాగని సత్యాన్ని దాచిపెడ్తూ...

అటూ ఇటూ చేతులందని పిల్లలు
సందెట్లో ఇమడక చేతులు దాటిపోతూ
కనుపాప వెనక ఉగ్గబట్టి కడుపులో మెలిపెడుతున్న
పేగు బంధాన్ని అత్మీయంగా తడుముకుంటూ....

చిరాకు ప్రతి క్షణం పెదవిపై తప్పని అతిధై
గుండె కింది నరాన్ని పట్టుకుంటూ
కడుపులో HCL స్రావాలు అధికమై
రోకటి పోటులా పొడుస్తూ నుదుట చిట్లిన మడతల
వెనక దోబూచులాడుతూ దూరమవుతున్న
కరచాలనాలతో రాని నవ్వును పులుముకుంటూ...

ఏమైనా నలభైల హర్డిల్ దాటినప్పుడంతా
ఈ ఎగసోప తప్పదేమో కదా నేస్తం!!

Tuesday, April 16, 2013

బతుకుటెండ..


రోడ్లన్నీ ఎండకు కాగుతు తారు మెరుస్తూ
అక్కడక్కడా గతుకుల మధ్య పైకెగసిన రాళ్ళతో...

దప్పికగొన్న కాకి నీటి చుక్క ఒంపని
నల్లాకు అడ్డంగా వేలాడుతూ...

ఆకురాలిన తురాయి చెట్టుకు కాయల
కత్తులు వేలాడుతూ...

ఆవిర్లు రాని టీ గ్లాసు నిండా పోసుకున్న
గొంతు దాటి ఆకలిని చంపుతూ...

మూగ బట్టిన గాలి ముక్కు పుటాలను
మండిస్తూ ఎగశ్వాసపోతూ...

నెత్తురు చెమటగా రాలుతూ రిక్షా
టైరు పంక్చరై పేగులంటిన డొక్కతో...

మురుగు కుంటలో దొర్లుతూ
బురదంటిన కుక్క మూలుగుతూ...

అప్రకటిత కర్ఫ్యూలా రోడ్లన్నీ
నిర్మానుష్యమై నిశ్శబ్ధంగా రొప్పుతూ...

ఎండపట్టిన బతుకు నిండా
                                                ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతూ...   
       
                                       

Saturday, April 6, 2013

నువ్వలా.....


నువ్వలా మాటాడుతుంటే తడి గంధపు
పరిమళం కమ్ముకుంటుంది...

నువ్వలా నవ్వుతుంటే బొండు మల్లెలు
విరబూస్తున్నట్టుంది...

నువ్వలా పక్కన నడుస్తుంటే దీపపు కాంతి
దేహమంతా పరచుకున్నట్టుంది...

నువ్వలా చెంతనుంటే సముద్రమంత
నిబ్బరాన్నిచ్చి భుజం చుట్టు అల్లుకున్నట్టుంది...

నువ్వలా ఈ రాతిరి మాటాడుతూ నవ్వుతూ వుంటే
దీపం ఇంక కొండెక్కనని ఎద గూటిలో దాగుంది...

Thursday, April 4, 2013

యుద్ధము - ప్రేమనుబాల కుతి తీరని బాల్యం
వెంటాడుతూ
కలల ఇసుక పుల్లాటల మధ్య
దొరకనితనంతో
అలసి సోలిన కన్రెప్పల
మధ్య ఇన్ని విరిగిపడిన కాంతి రేఖలు...

కాలం మండుతూన్న కొలిమి అంచున
అరిపాదం మంట
నషాళానికి తాకుతూ
దప్పిక తీర్చని అక్షర దాహం
వెన్నాడుతూ
విరిగిపడ్డ అల మధ్యన నురుగు బుడగ...

పరచుకున్న చీకటి తెరల మాటున
మాగన్నుగా పట్టిన నిద్రలో
వులిక్కిపడ్డ మెలకువతో చల్లగా
తాకిన కార్బన్
బెదురును అణచి పెడ్తూ
ట్రిగ్గర్ పై బిగిసిన చూపుడు వేలుతో....

ఆకు చాటున
మబ్బుల గొంగడి భుజాన వేసుకున్న
సందమామ వెనక్కి తిరిగి
ఎటో చూస్తున్నట్టు
తప్పుకుంటుండగా ఇరు వైపులా
కురుస్తున్న నెత్తుటి చినుకులో
యుద్ధాన్ని ముద్దాడుతూ ప్రేమగా...
Related Posts Plugin for WordPress, Blogger...