Monday, May 30, 2011

రెక్కవిప్పిన రెవల్యూషన్..



ఇది రెక్క విప్పిన రెవల్యూషన్
గొంతుపై ఏ ఉక్కుపాదమూ లేని కమ్యూన్
నిజమైన స్వేచ్చా వాయువుల సువాసనలు
వెదజల్లిన పారిస్ కమ్యూన్

అవి డబ్బై రెండు రోజులే కావచ్చు
బతికినంతకాలం మనిషికి
ఇలా కూడా బతకొచ్చునని చూపిన కాలం...
ఎల్లలులేని తనం...
మొండి బతుకుల చివుళ్ళు విరిసిన కాలం...
మనిషికి మనిషికి మధ్య అంతరాలు చెరిపేసిన కాలం..

బతికి చూపిన బాట
ఆ దారి అందరి రహదారి కావాలి...

ఓ స్వేచ్చా ప్రపంచమా
నిన్ను మరల మరలా
ఆహ్వానిస్తున్నాం...

(పారిస్ కమ్యూన్ గా మానవ చరిత్రలో లిఖింపబడిన ఆ డెబ్బై రెండు రోజులు నిండి 140 సం.లు మే 29కి పూర్తైన సందర్భంగా)

Sunday, May 29, 2011

అలల కలల సవ్వడి..


అంతరంగ సాగరంలో
ఎగసిపడే కలల అలలు
అలా అలా ఒడ్డుకు
కొట్టుకొని నిరాసపు ఇసుక తిన్నెల మీద
పడి ఇంకి పోతూ...

అయినా అలా అలల
కలల సవ్వడి వీడదే మనసు...

మనఃఫలకంపై ఎన్నెన్ని
అడుగు జాడల ముద్రలు...
ఎన్నెన్ని కలల కదలికలు...
ఇంద్ర దనస్సులా మనసు నిండా
ఆ మూల నుండి ఈ చివరవరకూ
వంగి ముద్దాడుతూ...
మెరిసిన మెరుపుల విద్యుల్లతల
కాంతి పుంజాలు...

జీవితమే అంతులేని కలలా
అలా సాగిపోతూ తీరని ఆశల
అలలా ఈ ఒడ్డున...

Thursday, May 26, 2011

అమ్మా నీ చల్లని చూపు కోసం..

ఎందుకో ఇన్నాళ్ళు
ఆ కళ్ళలోంచి వర్షించిన ప్రేమామృత ధారలు
నాకు దూరమౌతాయన్న బెంగ ఆవరించి
హృదయమంతా పిండేసినట్టుండేది...

ఆమె కళ్ళలోకి సూదులు గుచ్చుతారని తెలిసి
గుండెల్లో గునపం దిగినట్లుండేది...

ఆ కంటినావరించిన మబ్బు తెర
తొలగిపోతే ఆ కళ్ళలోని మెరుపును
మరల చూడగలనన్న ఎరుక
మరో వైపు ధైర్యం చెప్తూనే వుంది...

అయినా ఆ కంటిని మూసిన
ప్లాస్టర్ తొలగేంత వరకు
నా యీ పెరిగిన గుండె లయ
తగ్గదింక...

అమ్మా నీ వెన్నెలంటి చల్లని
చూపుకోసం ఆర్తిగా...

(ఈ రోజు మా అమ్మకు జరిగిన కంటి ఆపరేషన్ గది బయట నా మనసు)

Tuesday, May 24, 2011

నీ ధ్యాసలో...


దాయకు
నీ కనుపాపలలో నను
కన్నీటిలో జారిపోతాను...

ఎదలో యింత చోటివ్వు!
నీ గుండె లయలో
నిరంతరమూ
ప్రతిధ్వనిస్తాను....

Saturday, May 21, 2011

హో స్ఫూర్తి..



గడ్డిపోచలన్నీ కలిస్తే మోకులవుతాయని
మదమెక్కిన మృగాన్ని సైతం కట్టిపడేస్తాయని
బలహీనత శారీరకమైనదేనని
గుండెనిబ్బరం ముందు
మదపుటేనుగైనా బలాదూర్ అని
ప్రపంచానికి చాటి చెప్పిన ధీశాలి
విప్లవ తేజోమూర్తి
వియత్నాం చాచా
మన హోచిమిన్...

హో విప్లవ స్ఫూర్తి
సదా ఆచరణీయం...
(మే 19న కా.హోచిమిన్ 122వ జయంతి)

Wednesday, May 18, 2011

పాదముద్రలు..




గుండె చెమ్మలోని
నీ పాదముద్రలు

కన్నీటి అలలలో
కరిగిపోకుండా
నిరంతరమూ
నీ ఆచరణ

వెన్ను తడుతూనే వుంది...


నేస్తమా!

నెలవంకలో
దాగిన
నీ చిర్నవ్వు
నా మదిలో
వెలుగుతూనే వుంది...

Saturday, May 14, 2011

నీకూ నాకూ మధ్య..



కంటికి రెప్పలా

గుండెకు పంజరంలా

నీకూ నాకూ మధ్య

ఈ సన్నని తెర ఏదో
మన మధ్య
అతికీ అతకని
బంధాన్నేదో
అలా
దాస్తూ ఏమారుస్తూ
యుగాలుగా
నీ మమతానురాగాల్ని
అలా మల్లెతీగలా
చిగురింప జేస్తూ
పూస్తూ
వెన్నెల జాజిలా

వసంతమంతా విస్తరిస్తూ

నిన్నూ నన్నూ
ఇలా
చెరో వైపు నిలుపుతూ....

Thursday, May 12, 2011

అన్నపూర్ణకు చావొచ్చింది...


ఇప్పుడంతా రాబందుల రెక్కల చప్పుడే
ఏ మూల చూసినా కాసింత జాగాను కూడా
మింగేసే అనకొండలా వస్తున్న భూబకాసురులు...

భూమి ఇప్పుడు చెరబట్టబడుతోంది...
అన్నపూర్ణకు చావొచ్చింది!

అంతా కాసులమయం కాబడి కాలికింద నేలను
కబలిస్తూ జీవితం మెడపై కాడి కాబడుతోంది...

ఇదేమని అడిగితే తూటాలతో కడుపునింపుతున్నారు...
నయా సామంతుల పాలనలో నిన్ను పాతడానికి
మూడడుగుల జాగా కూడా కరవైపోతోంది!

అయ్యా !
కాల్లు రెండూ డొక్కలో పెట్టుకొని
కాసింత కునుకు తీయడానికింత జాగా వుంచుతారా???

మేమేమీ మేడలు మిద్దెలు అడగలేదు...
రేప్పొద్దున్న మీ కళ్ళలో బియ్యం పొయ్యడానికి
కాసింత మెరక వదిలితే రెండు వరి దుబ్బులు పండిస్తాం!!
(దేశ వ్యాప్తంగా రైతులపై జరుగుతున్న కాల్పులను నిరసిస్తూ)

Tuesday, May 10, 2011

మౌనం ఆయుధమైన వేళ..



అవుననిపిస్తోందిప్పుడు

మౌనమూ ఓ పదునైన ఆయుధమని...

మౌనం ఓ పెద్ద అగాధమని....

మౌనం ఓ పేలని అణు బాంబని....

అలా రెండు పెదవులు మూసి వుంచి

ఏమైనా సాధించవచ్చని...

అవుననిపిస్తోందిప్పుడు

మౌనం సకల మాటల కలయికని...

వేలాది ప్రశ్నల అక్షయ తూణీరమని....

కోట్లాది సమాధానాల సమాహారమని....

మౌనాన్ని భరించే శక్తి

ఈ పిడికెడు గుండెకు లేదని

ఎలా చెప్పను...

నేనూ మునిగా మారడం తప్ప....

Sunday, May 8, 2011

మన్నెం సూరీడు



నువ్వెక్కుపెట్టిన విల్లు
సంధించిన మిరప టపాకాయ్
వాడికి ఊపిరాడనివ్వలేదు...

మన్యం పజల పోరాట శక్తిని
ప్రపంచానికి చాటి చెప్పి
మడమ తిప్పని,
వెన్ను చూపని ధీరత్వం నీవని
నీ సేన ముందు వాడి మరఫిరంగులు
తుస్సుమన్నాయన్న మాట
మాకెప్పటికీ ఉత్తేజాన్నిచ్చే పోరుపాట...

శత్రువు గుండెల్లో నిదురించిన నీ రూపం
మాకు ఆరాధ్యం...

నేటికీ మన్యాన్ని దోచుకునే నల్లదొరల పాలిట
నీ స్ఫూర్తి ఓ మందుపాతర...

నీ వారసత్వం అందుకున్న యువత
ఈ దేశ భవిత....

ప్రతి ఉదయంలో తూరుపున
నీ రూపం ఉదయిస్తూనే వుంది...
(మన్నెం విప్లవ వీరుడు అల్లూరి 87వ వర్థంతి)

Wednesday, May 4, 2011

సౌందర్యం



సౌందర్యమే సత్యం
మిగిలినదంతా భ్రమే!
మనసున నిలిచేదీ
నిలిపేదీ సౌందర్యమే
అదే నిత్యం...

వికసించుతూనే
విరజిల్లే మహాద్భుతం...

బాహ్యాంతరాలలో
శోభిల్లేదే
సౌందర్య
సత్యం....
Related Posts Plugin for WordPress, Blogger...