Saturday, November 30, 2013

నీలం....

ఒక్కో సమయం అలా మూగగా వెదురు చుట్టూ తిరిగే గాలి సమీరంలా ఝుమ్మంటూ ఓ ఆవృతంలో తిరిగినా దరి చేరనితనంతో ఒంటరిగా ఈ గుబురులో దాగి పోతుంది

నువ్వప్పుడు కనుబొమలెగరేస్తూ కళ్ళతో ఓ పాటనలా ఆలపిస్తూన్న వేళ నది నీలంగా మారి ఓ పాయ అలా నీ పాదాల చుట్టూ నీలపు నురుగునద్దుతూ సాగిపోతుంది

అప్పుడలా నువ్వు ఆలవోకగా నీ చేయినలా నీ నల్లని ముంగురులను వెనక్కి నెడుతూ
ఆకాశంలోని కరి మబ్బులను నీ మునివేళ్ళపై ఆహ్వానిస్తూ మెరుపుల విల్లునలా వంచి వాన జల్లుని చివ్వున విసిరి మెలకువను యింత పసరికను పసుపుగా అద్ది పోతుంది

అడవి దారుల ఇప్పవనాల వెంట మత్తుగా నీ మెడ చుట్టూ చేతులు వేసినట్టు ఫక్కున నవ్వుతూ చందమామను ఆ ఇరిడి తోపులోకి నెట్టి నల్లని ఈ మట్టి చెమ్మలో దేహాన్ని ఆరబెడుతూ నగ్నంగా సేదదీరే వేళ ఆకులన్నీ రాలి పసరు వాసన వేస్తూంది.

యుగాలుగా మర్చిపోయిన జ్నానమేదో మేల్కొని భూమిలోకి పాకిన ఈ చిగురు వేళ్ళ గుండా ఓ సుగంధాన్ని వెదజల్లుతూ అనంతమైన ఆవృతాన్ని సృష్టిస్తూ చుట్టూ నీ చుట్టూ యిన్ని దీపపు కాంతులను వత్తులుగా వెలిగిస్తూ మట్టి పాత్రలోకి తోడ్కొని పోతుంది

అప్పుడు ఈ ఇసుకమన్ను కలిపిన దారులలో వేకువ ఝామున ఊదారంగు మబ్బు చినుకునలా దోసిటపట్టి వీడ్కోలు పలుకుతూ కొన్ని పూల రెమ్మలను అలంకరిస్తూంది..

(30-11-13 రా 11.30)

Friday, November 29, 2013

పయనించు...ఒక్కోసారి
సాదాగా పారే నదీపాయలా

ఒక్కోసారి
ఉధృతమైన జలపాతంలా

ఒక్కోసారి
హాయిగా తాకే సమీరంలా

ఒక్కోసారి
పెకలించే విసురుతనంతో

ఒక్కోసారి
వెచ్చగా కరచాలనంలా

ఒక్కోసారి
భగ భగమండే పర్వతంలా

ఒక్కోసారి
సుతారంగా తాకే పూరేకులా

ఒక్కోసారి
కస్సున దిగబడే ముళ్ళులా

ఒక్కోసారి
కాగితం పడవలా తేలియాడు

ఒక్కోసారి
రివ్వున దూసుకుపోయే తారాజువ్వలా

ఒక్కోసారి
పైకెగిరే గాలిపటంలా

ఒక్కోసారి
నిప్పులు విరజిమ్మే రాకెట్ లా

కానీ
ఎల్లప్పుడూ
మనిషితనంతో పయనించు..

Wednesday, November 27, 2013

అతడొక్కడే...


విసురుగా వీచే గాలిని అలా
ఒంటి చేత్తో పక్కకు తొలగిస్తూ పర్వతపు అంచున అతడొక్కడే

ప్రళయంలా ముంచెత్తుకొస్తున్న తుఫానును అలా
ఒక్క తోపుతో తొలగిస్తూ అతడొక్కడే

ఉత్త చేతులతో గోచీ పాతతో నేలనలా తన్నిపెట్టి
పగలబారుతున్న భూమినలా కలిపి వుంచింది అతడొక్కడే

చుట్టూరా కమ్ముకొస్తున్న ఇనుప పాదాల
డేగ రెక్కలను ఒక్క వేటుతో ఆపే అతడొక్కడే

ఈ నేలపై యింత పచ్చని పసరిక తివాచీని
తన తడి కాళ్ళతో పరిచిందీ అతడొక్కడే

అవును
అతడొక్కడే
మూలవాసీ
ఆదివాసీ
నీ
పూర్వవాసి

Thursday, November 21, 2013

ఊదారంగు దుప్పటి..


ఒలికిన
రాతిరి
జ్నాపకాలు
సిరా మరకలా
మిగిలి

లోలోపల

ఒంటరి
దీపాన్ని
వెలిగించి

నిశ్శబ్ధాన్ని
బాహువుల
మద్య
మిగిల్చి

రాలుతున్న
ఆకుల
మద్య
దూరాన్ని
కొలుస్తూ

రాతిరి
కప్పిన
ఊదారంగు
దుప్పటి

Monday, November 18, 2013

అనామధేయం..

నీ చేతిలో ఓ శిరస్సు మొలకలేస్తోంది
దాని పెదవులపై కత్తిరించబడ్డ చిర్నవ్వు
కనులలో ఒలికి గడ్డకట్టిన నీటి చారిక
గాయపడ్డ గొంతులోంచి పాట నెత్తుటి జీరలా
ఈ నదీ పాయ గుండా ప్రవహిస్తూ
నీలోంచి నవ నాడుల దారులలో
ఉబికి వస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తూ
నువ్విదిల్చినా వదలని ఆ
అముఖం నీలోకి ఇంకుతూ ఇగురుతూ
నిన్ను అనామధేయుణ్ణి చేస్తూ
తొలి దారుల ఆదిమ పూల
బాలింతరపు వాసనతో
నీ చుట్టూ పరివ్యాప్తమవుతూ
కార్యోన్ముఖుణ్ణి చేస్తూ...

Tuesday, November 12, 2013

అక్షర వృత్తాలు

తలతిప్పగ చుట్టూ చీకటి అరల మద్య
నువ్వో సుక్కలా మెరిసేవు

ఎక్కడో దాగున్న ఆ జ్నాపకాల నీటి పొరలను
చీల్చుకు వచ్చేవు

ఎన్నెల ఎలుగులు ఎక్కడో మాసి పోయినట్టు
ఈ మూల ఒట్టిపోయిన నీటి కుండ

దాహమేయని గొంతులో నువ్వొక చినుకులా
పుష్పిస్తావు ఈ కటకటాల వెనక

మసిరాతల గోడల నిండా అతకని
అక్షరాల వృత్తాల మద్య

బంధించబడ్డ హృదయం నెత్తుటి జాడల గుండా
ప్రవహిస్తున్న జీవ కళిక

ఎక్కడో నూనె మాసిన మల్లెల వాసన
ముక్కుపుటాలను తాకుతూ

మరపు రాని మాటల ముసురులా
ఈ చలి నెగడు చుట్టూ

పాకురు పట్టిన గోడ మీదుగా పాకిన
సన్నని పూల తీగ పసుప్పచ్చగా

నిద్ర మరచిన ఒంటరి కనురెప్పల మద్య
కరిగిపోని కల ఓ రక్త చారికలా!!

(12-11-13 2.49 PM)

Monday, November 11, 2013

రాదారి ఆవల..

వాక్యమేదీ కూర్చబడక
చర్మపు రహదారి గుండా ఓ నెత్తుటి దారమేదో అల్లబడుతూ

ఒకింత బాధ సున్నితంగా గాయమ్మీద మైనపు పూతలా
పూయబడుతూ రాలుతున్న పూరెక్కలను కూర్చుకుంటూ

ఒడిలోకి తీసుకున్న తల్లి తన నెత్తుటి స్తన్యాన్ని అందిస్తూ
బాధ ఉబకని కనులు మూతపడుతూ జీవమౌతూ

చిద్రమైన దేహాన్ని సందిట్లో ఒడిసి పడుతూ మురిగిన
నెత్తుటి వాసన వేస్తున్న పెదాలను ముద్దాడుతూ ప్రాణమౌతూ

చితికిన వేళ్ళ మద్య ఎముకల పెళపెళలతో కరచాలనమిస్తూ
కాసింత దప్పిక తీరా గొంతులో పాటలా జారుతూ

ఏదో మూయబడ్డ రహదారిగుండా ఒక్కో రాయీ రప్పా
తొలగిస్తూ తొలుస్తూ వెలుతురినింత దోసిలిలో వెలిగిస్తూ

సామూహిక గాయాల మద్య ఎక్కడో అతికీ అతకని
రాతి జిగురు కర కరమని శబ్దిస్తూ కలుపుతూ

ఈ ఇసుక నేలగుండా పాయలుగా ప్రవహించిన జీవధార
ఇంకిన జాడలను వేళ్ళ మద్య తడిని వెతుకుతూ

దీపం కాలిన వాసనేదో దారి చూపుతూ ఒకింత
ఆశపు వత్తిని ఎగదోస్తూ చమురు ఇరిగిన రాదారిలో పయనమౌతూ

గమ్యం అగోచరమయ్యే వేళ ఓ తీతువేదో గొంతు పగిలిన
రాగదీపమౌతూ రెక్క తెగి నేలకు జారుతూ

ఈ నెత్తుటి చిత్రాన్ని ఆవిష్కరించే సమయం
యింకా ఫ్రేం కాలేక రాతిరి ముడుచుకుంటూ ఆకు దోనెలో దాగుతూ


(20/10/2013 - 8.29PM)

Saturday, November 2, 2013

దుఃఖ దీపం..

 
నీ చుట్టూ కొన్ని ప్రమిదలు వెలుగుతు
గాలి నిన్ను కూచోనివ్వదు

నీ అరచేతులు చాలనప్పుడు లోలోన
దిగాలు ఒక్కసారిగా అసహనంగా

ఈ ప్రమిదలలోని నూనె ఒలకనీయక
దీపపు నీడ దాపెట్టే విఫలయత్నం

నీ చుట్టూ ఇన్నిన్ని క్రీనీడల సయ్యాటల
భయ దృశ్యం అల్లుకుంటూ

నీ చుట్టూ ఓ దీప తీరం వలయంలా
అల్లుకుంటూ అచేతనంగా

ఈ కాంతి రేఖల రాక పోకల
వ్యవధి మధ్యలో ఎన్ని మిణుగురుల ఆశలు

చిక్కనవుతున్న చీకటి పాట
గాలి అలలనలా కోస్తూ

అచేతనంగా అభావమౌతున్న
రూపం ధూప కలికమవుతూ

నీ ఒక్కడివే ఈ గదిలో
ఒంటరిగా ప్రమిదలో దు:ఖ దీపమౌతూ…

Related Posts Plugin for WordPress, Blogger...