Wednesday, December 30, 2009

అంత:సాగరం
ఎందుకో చెప్పలేను..

సముద్రానికెదురుగా వుంటే
తనలోకి అలా నడిచి వెళ్ళి
అంతర్థానమవ్వాలని ఒకటే ఆతృత!

ఏదో నా స్వంత ఆత్మలోకి
ప్రవేశిస్తున్న భావన వెంటాడుతుంది
నన్నెవరో తనలోకి లోలోకి ఆహ్వానిస్తున్న అంతఃప్రేరణ!

నా ఆదిమమూలాలను తట్టిలేపే అవిరామ ఘోష
గుండె గదిమూలలలో..

నా కాళ్ళు అలా అలా తనలోకి లోలోకి...
మరింత దగ్గరితనం!!

నా కనుల ముందు మరే దృశ్యానికి చోటులేనితనం!

నా సంఘర్షణలకు ఒక స్వాంతననిచ్చే ఒక
మహా విశ్వరూపం సముద్రం

తల్లో తండ్రో లేక ఓ విశాల బాహువుల స్నేహితుడో
నన్ను మనసారా ఆలింగనం చేసుకుంటున్న అనుభూతి
వెనక్కిరానివ్వని ప్రియురాలి బిగి కౌగిలా?

నా చివరి ఊపిరి తనలో కలవాలని
ఒకటే తృష్ణ
..........

Tuesday, December 22, 2009

మునిముని.... మనమడా


శతాబ్ధాలుగా ఈ నేలలో వేళ్ళూనికుని వున్న
నాపై కరకు ఱంపాలతో నిర్దయగా కోస్తూ
నన్ను నా తల్లి గర్భంలోంచి పెకిలించి
నువ్వు పాదుకున్నదేమిటి బిడ్డా?

నీ మునుపటి తరమేదో నీ కన్నులలో మసకబారి పోయిన
మీ తరానికి శాపమౌతున్న నా మరణ వాంగ్మూలమిది బిడ్డా...

కానీ ఈ నేల నాలుగు చెరగులా పరచుకున్న
నా చిగురు కనుల చూపు మేరా
నా జ్నాపకాలు పరుచుకున్నాయి...

చరిత్ర పుటల మధ్య నలిగిన జీవన చిత్రాలను
నా ఎదలోలోపల పొరల్లో దాచుకున్నాను...

ఎన్నెన్నో సంతోషకర ఘటనల
సమాహారం నా బెరడుచుట్టూ పొదువుకున్నాను....

ప్రకృతి మాత పురిటినొప్పులను
నా వేళ్ళ చుట్టూ భరిస్తూ వచ్చాను...

ఎన్నెన్నో రథచక్రాల పదఘట్టనలను
కనుల ఈనెల మాటున కథ చిత్రాలుగా పాదుకున్నాను...

నీ యంత్ర భూతముల కోరలతో నన్ను
పెకలించి నా చావును ఆహ్వానించిన
నీ తరం భవిష్యత్ ఏమిటోనన్నదే నా బెంగ
ముని ముని మనమడా...

Friday, December 18, 2009

శరత్కాలపు వెన్నెలఅలా డాబా మీదకు వెళ్ళగానే
మొహంపై చల్లగాలి తిమ్మెర
చలికి చల్ల బడుతున్న అరచేతులపై
తన వెచ్చని బుగ్గల స్పర్శతో
తనువంతా ఒక్కసారి వెచ్చబడింది

వేళ్ళమద్య జొనిపిన తన పొడుగాటి
సన్నని వేళ్ళ బిగువు నరాల వెంట
విద్యుత్ ను ప్రవహింపచేసింది

ఆకాశంలో శరత్కాలపు వెన్నెల
లేత పసిడి రంగులో మెరుస్తుండగా
తన కళ్ళలో జ్వాల నన్నావహించింది...

Saturday, December 12, 2009

గిరితనయ


నీ పాదం అంచున నిలబడి
తలపైకి ఎత్తి నిన్నుగాంచ
నాలో ఉవ్వెత్తున ఎగసిపడిన ఆలోచనా తరంగాలు


నీ నవ్వుల విరులమాటున దాగిన
సూరీడు నీ పచ్చని చీర కొంగు పట్టుకొని
దోబూచులాడుతున్నాడు

నీ తీగల ఊయలలూగుతూ ఇటువైపు
వెన్నెల రేడు నీ మూలికా సుగంధ
పరిమళాలను వెదజల్లుతున్నాడు

నీ గర్భం మాటున దాగిన సంపదను
కొల్లగొట్టజూస్తున్నాడు ఈ
దిగువన పల్లపు మానవుడు..

Sunday, December 6, 2009

మహానటికి కన్నీటి నీరాజనంఆ కళ్ళలోకి సూటిగా చూడగలమా
ఆ ముగ్ధ మనోహర రూపాన్ని
చూడగానే పరిపూర్ణ స్త్రీ రూపం
సాక్షాత్కరిస్తుంది
ఎందుకో అమ్మా నిన్ను చూడగానె
చేతులు కట్టుకోవాలనిపిస్తుంది

వెండితెరపై ఓ మెరుపులా మెరిసి
మాయమయ్యావా?
లేదు ఇప్పటికీ నీ కళారూపాలుకు
సాటిలేదు రాదు కూడా

దేశం కోసం నిలువుదోపిడీ
ఇచ్చిన నీ ఋణం
తీర్చలేనిది

ఓ మహానటీ కావ్య నాయికా
నీకు వేల వేల వందనాలు

Friday, December 4, 2009

వెచ్చని చలి కౌగిలిచుట్టూ పొగమంచు తెరల మద్య

ఈ పూరిగుడిసెలో

అనాచ్చాదంగా నేను నా చలి

చెలి కౌగిలిలో

వెచ్చగా

(హూ..(హూ.. అంటూ

తన గుండెలలో దాక్కుంటూ

చెవితమ్మి కింద వెచ్చని పెదాలతో

ముద్దాడిన తన్మయత్వంలో నేను…

Related Posts Plugin for WordPress, Blogger...