Thursday, June 30, 2011

అన్నపూర్ణా....


అన్నపూర్ణా అన్నపూర్ణా
ఏడ దాగినావమ్మా...


రైతై పుట్టిన
పుణ్యానికి
ఈ నేలమీద
మీసం మెలేయలేక పోయినా
కడుపు నిండా యింత వన్నం
తిందామన్న
ఆశతో వేసిన
పంట చేతికి రాక
అప్పుల ఊబిలోంచి ఎలా బయటకు దూకాలో
కాన రాక
కాలూ చేయీ ఆడక

పురుగుల మందే పరమాన్నమైనట్టు తిని

తాను మమ్మల్నిలా వొంటరి చేసి పోతే

ఇలా మిగిలిన పాపం వీరిదా?
నాదా?

Monday, June 27, 2011

కిటికీ..కిటికీ పక్కన కూచొని ఎన్నాళ్ళయిందో...


అలా తెరిచిన కిటికీ ఓ బుల్లితెరలా
మారి ఎన్నెన్ని దృశ్యాలతో నిండుకుంటూ
ఖాళీ అవుతూ ఓ ఆబ్ స్ట్రాక్ట్ పెయింట్ లా
గజిబిజిగా మారి మస్తిష్కంలో
అటు యిటూ తెలియని రంగుల పూతలా...

ఎక్కడో మాసిన నూనె గుడ్డ కాలిన వాసన...
మబ్బు కమ్మిన సగం కోసిన వెన్నెల క్రీనీడ
ఊచలలోంచి వచ్చి చినిగిన చేతి సంచిపై పడుతోంది...

అట్ట వూడిన పుస్తకం అంచులు
కొరుకుతూన్న పురుగు రెక్కలొచ్చి
పక్కకు ఒరిగి పోయింది....

కాలిన సిగరెట్టు వేలి చివర చురుక్కు మంటూ
కాగితంపై పడ్డ నుసి నల్లని మరకను పూసింది...

చివరి సిరా చుక్క రాయనంటూ
కాగితం అంచున ఒలికిపోయింది...

Wednesday, June 22, 2011

కర్తవ్యంకాలం యింత నిర్దయగా
తలారి పాత్ర వహిస్తుందా?

ఒక్కొక్కరినీ తన మట్టిపొరలలో
కప్పెట్టుతూ మనల్నిక్కడ
ఒంటరి పక్షులను చేయచూస్తోంది...

కానీ..
ఆ మట్టి పరిమళాన్ని
దేహమంతా పూసుకొని
ఎత్తిపట్టిన ఝెండా రెపరెపలలో
కాంతి యోధులమై
విజయ ఢంకా మోగించి
క్రాంతిని సాధిద్దాం
ఉదయరాగాన్ని
ఆలపిద్దాం....

ధిక్కారం

అతుకుల బొంతలా
ఒక్కో పొరా మాసిన గుడ్డతో
నెత్తురోడిన గాయాలను కప్పుతూ
మరకలను దాచలేని నీ నిస్సహాయత బయటపడుతూ
నీ మోసకారితనం బయల్పడుతూ
అసలు రంగు మాకెరుకవుతూ
నక్కిన నీ రూపు భళ్ళున తెల్లారుతూ
నగ్నంగా మాకెదురైన ఈ వేళ
నీ మాటకారితనం ఇంకెన్నాళ్ళు...

ఉరితాడుగా మారిన గడ్డిపోచ
నీ మెడకు చుట్టుకుంది
చూడు...

Saturday, June 18, 2011

నాన్నా నేనూ ఓ రాత్రి

కతలు నెమరువేసుకునే వేళ
కలలు కుప్పబోసుకుని ఏరుకునే వేళ
మీరు నేను
కూచున్న ఆ కొబ్బరాకుల చివుళ్ళ లేలేత
వెన్నెల చారలు కప్పుకున్న రాత్రి
మీ ఒడిలో తలపెట్టి నేను
నా తలలో మీ వేళ్ళు ఆప్యాయంగా నిమురుతుండగా
మీ కత వింటూ ఉంటే
ఆ రోజు అలెగ్జాండర్, నెపోలియన్ చిన్నబోయారనిపించింది...

జీవితపు సుడిగుండాలను దాటుకొని
సంసార సాగరాన్ని ఈదిన మీ బాహువుల బలం
వరమివ్వమని వేడుకుంటున్నా...

ఎందుకో మీరంటే భయం వేసేది చిన్నప్పుడు
కానీ పెరుగుతున్న తనంలో దాని వెనక
దాగిన మీ ప్రేమ అవగతమై
మీ కళ్ళలో ఎరుపు జీరల వెనక దాగిన
కన్నీటి పొర ఇప్పుడు సుస్పష్టంగా గోచరమై
నా కళ్ళనిండుగా కన్నీటి సుడులు....

ఏటికెదురీదడం
తలవంచక బతకడమే నేర్పిన
మీ బాట ఎప్పటికీ శిరోధార్యం.....

Wednesday, June 15, 2011

వెన్నెల ఖడ్గం..పున్నమి వెన్నెల చుట్టూ
కమ్ముకుంటున్న నల్లని మబ్బుల చాటున
మాసిపోయిన చందమామ
ఈ రేయి అమవాస కానీయకు...

గుండెలలో నింపుకున్న ప్రేమ
వెండి వెన్నెలలా తన కళ్ళలో చూడాలన్న
ఆతురతను కాల మేఘం చాటుకు పోనీయకు...

రా... ఈ రాహువును సంహరించి
తిమిరాన్ని జయించి
వెన్నెల ఖడ్గాన్ని బహూకరిద్దాం...

Tuesday, June 14, 2011

ప్రవహించే ఉత్తేజం చే..


నువ్వందించిన స్ఫూర్తి
నేటికీ మా నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...

ఆచరణలో నీవు చూపిన తెగువ
నేడు వినీలాకాశంలో అరుణతారై మెరుస్తోంది...
...
నీవభ్యసించిన వైద్య విద్య సామాజిక శస్త్ర చికిత్సగా
మార్చి విజయాన్ని ప్రోది చేసి చూపించిన
ధీరుడువి నీవు...

నువ్వొక ప్రవహించే నిరంతర ఉత్తేజానివి...

గలగల పారే సెలయేరు లాంటి నీ నవ్వు
మా హృదయాలలో పదిలం...

నీ వొరిగిపోతూ అందించిన జెండా
శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...

చే నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరాన్ని నిరంతరం
మేల్కొలిపే రణన్నినాదం....

(నేడు చేగువేరా 84 వ జయంతి)

Sunday, June 12, 2011

ఉల్కలా...పులి మీద స్వారీ చేస్తే
ఎప్పుడో ఒకప్పుడు నిన్నే తినేస్తుంది..
గుఱమో, ఒంటో, గాడిదే నయం...

అయినా స్వారీలెందుకు
నడిచిన తాబేలే గమ్యాన్ని చేరుతుందన్నది కదా నీతి...

నేల మీదున్నవాడ్ని ఎవ్వడూ తోసేయజాలడు..
ఎదుటి వాడి మాడు పగలగొట్టి తిని బలిసే వాడు
చలి చీమల చేత చిక్కక మానడు...

అధికారం కోసం ఆత్మను బలి చేసే వాడి
నవ్వులో ప్రేత కళే...

తన మంది కోసం పని చేసే వాడు
ఉన్నా ఒకటే లేక పోయినా ఒకటే...

పది మంది కోసం చచ్చేవాడే
నాకాదర్శం...

ఉపగ్రహంలా తిరుగుతూ
కుళ్ళి కృశించి నశించే కంటే
ఉల్కాపాతంలా
ఒక్కసారి మెరిసి నేలను
చేరడమే నా దృక్పథం...

Saturday, June 11, 2011

తొలకరి వేళ...


తొలివేకువ కిరణంలోని మెరుపును నేనే
తొలి మొగ్గ తొడిమను నేనే
తొలి పుష్పం రేకులోని మృధుత్వాన్ని నేనే
తొలకరి చినుకులోని చల్లదనాన్ని నేనే
తొలి చినుకు పడిన మట్టి పరిమళాన్ని నేనే
తొలి సాగుబడిలోని సాలును నేనే
తొలి విచ్చుకున్న విత్తన మొలకను నేనే
తొలి సారి విరగ కాచిన వరి వెన్నును నేనే
తొలిసారిగా ఆకుపచ్చ చందమామ మోముపై విరిసిన చిరునగవును నేనే...


Friday, June 10, 2011

అల్విదా మక్బుల్ ఫిదా హుస్సేన్నీ గీతలు సృష్టించిన
సునామీలో సుడిగుండాలలో
మతోన్మాదులు కొట్టుకు చచ్చారు..

దేవతల అంగాంగ వర్ణనలతో సుప్రభాతాలు
దేవాలయాల గోడలనిండా
బూతుబొమ్మలతో
రోజూ ప్రార్థించే మూర్ఖులకు
నీ బొమ్మలలో బూతు కనిపించడం విడ్డూరం..

ఏమైనా ఈ దేశ పద్మ విభూషణుడివి....
అల్విదా
మక్బూల్ ఫిదా హుస్సేన్...
కళను కళగా చూడలేని
అంధులకు దూరంగా
జరిగి పోయి చింతించిన
మాతృ దేశాభిమానివి...

నీ కుంచె కలకాలం సజీవం..

(M.F.హుస్సేన్ కు)

Thursday, June 9, 2011

మెలకువ కావాలి నాకు...కంటిపాప కసిరితే
కాసిన్ని కన్నీళ్ళు ఒలికి
చెదిరిన కల
...మరలా కంటి రెప్పల
తలుపు తడుతూ
ఇలా...

ఎదలో దాగిన ఇన్ని
కలల దొంతరల మధ్య
చోటు కోరుతూ...

నిరంతర కలల ప్రవాహ
సవ్వడినుండి
కాసింత మెలకువ
కావాలి నాకు...

Tuesday, June 7, 2011

నిస్సహాయంగా...
కోల్పోతున్నదేదీ తిరిగి రానిదన్న
నిజం ఎప్పటికప్పుడు
ఎరుకలో వున్నా
గుండె గది మూలల దాగి వున్న
బాధా తంత్రుల విషాద రాగం
మౌనంగా రోదిస్తూనే వుంటోంది...

ఖాళీలను పూరింపలేనితనం
వెక్కిరిస్తూనే వుంది...

Monday, June 6, 2011

బ్లాగ్మిత్రులకు విన్నపంమిత్రులారా...


నా సహవాసి బ్లాగు పేరును (లింక్ ను కూడా) 'వెన్నెలదారి' గా మార్చాను.. ఇంతకు మునుపటి లానే నా రాతలను పరికించి, పరిశీలించి తమ అభిప్రాయాలను, భావనలను పంచుకొనగలరని ఆశిస్తున్నాను...

మీ శ్రేయోభిలాషి,


కెక్యూబ్ వర్మ...

Thursday, June 2, 2011

కాసింత చోటును వదలండి...కాసింత చోటును వదలండి...

మాకింక కాలు మోపడానికి

ఇంత జాగా

మిగలనివ్వండి...

మూడు ఇటికలు పేర్చుకొని

ఇంత బువ్వ వండుకొనే

చోటు కూడా మిగలకపోతే ఎలా?

నెత్తిన చుట్టిన తుండు గుడ్డ

తీసి తలకింద వుంచుకొని

మోచేయిపై ఆన్చి చిన్న

కునుకు తీసే స్థలమైనా లేకపోతే ఎలా?

చుట్టూ కంచెవేసుకుంటూ

పోతుంటే చివరకు

కాటికి కూడా మిగలక

మీ గుండెలపై కాల్చాల్సి వస్తుంది...

Related Posts Plugin for WordPress, Blogger...