Tuesday, July 31, 2012

గోడ మీది పూలు...

ఈ నాచు పట్టిన గోడ పక్కగా
తడిచిన పూలను కోసి గుత్తుగా
నీ చేతిలో వుంచి
కళ్ళలో వెలుగు చూసిన గురుతు...

ఆ తడి ఇంకా ఆరనే లేదు
ఈ గోడపై ఎండిన నాచు పెళ్ళలు పెళ్ళలుగా
రాలి ఏవో అస్పష్ట ఆకారాలు
నలుపు తెలుపుల రంగు మాధ్యమంలో...

ఆ వెలుగు జిలుగు
ఈ కంటి రెప్పలు దాటి బయట మెరియనే లేదు
సంధ్య కాంతిని పులుముకుంటూ
కొండ వాలులోకి జారిపోతూ....

ఆ చేతి మృధుత్వం
అలా నరనరాన ప్రవహిస్తూ వానలో కరిగిపోనూ లేదు
గోధూళిని దోసిలిలో నింపుతూ
మస్తిష్కంలో రంగుటద్దంపై అలికినట్టూ...

ఆ అడుగుల సవ్వడి
అలా అలల వెల్లువలా ఒడ్డుకు చేరనూ లేదు
రాళ్ళ గవ్వల ఒరిపిడిని రాగంజేస్తూ
మనసులో అసంపూర్ణ గేయమైనట్టూ...

ఆ గాయపు గురుతులేవో
కలల దేహంపై ఎర్రగా చారలుదేరుతూ
స్వేదమింకిన నేల బీటలు వారుతూ
కణకణ మండే ఉచ్వాశ నిశ్వాశలైనట్టూ....

చివరిగా ఆ గోడపై ఓ చిగురు తొడిగిన
మొక్క పచ్చగా పైకెగబాకుతూ
వేకువ వెలుగు రేఖల వెచ్చదనమౌతూ
గుండె అలికిడికి గురుతుగా పూస్తున్నట్టూ...

Monday, July 30, 2012

ముఖమల్ మూట...

నువ్వొస్తావని
ఆశగా కళ్ళలో వత్తులేసుకొని ఎదురు చూసా.....

మాటాడాలనుకున్నవన్నీ
గుండె గదిలో ముఖమల్ మూట కట్టి దాచుకున్నా....

నీతో కలిపి తిందామని
అటుకుల మిక్చర్ దాచి వుంచా...

ఇంతలోనే వచ్చావన్న
కబురుతో గాలి పరిమళించింది....

నువ్వు వత్తిగిలి అలా రాస్తూన్న
అక్షరాల తడి స్పర్శిస్తూనే వున్నా....

ఎదురెదురుగా నవ్వుతున్న నీ కళ్ళలోకి చూస్తూ
ఏళ్ళుగా వేళ్ళూనుకున్న కబుర్ల బాకీ తీర్చుకుందామనుకున్నా..

మళ్ళీ మనం కలుస్తున్నామని
అమ్మ నీకోసం దాచిన నాన్న యిచ్చిన విభూది పొట్లం అలానే మిగిలిపోయింది...

నువ్వు మళ్ళీ నీ రెక్కల గుర్రమెక్కి
మంత్రనగరికి మాయమవుతావని తెలిసి మూగబోయా...

మళ్ళీ నువ్వొచ్చేసరికి ఈ ఎండిన నదీపాయ వెంబడి
నేనిలా మిగిలి వుంటానా??


(మా ఊరు రాకుండానే మరలి పోతున్నానని అఫ్సర్ సార్ అన్నప్పుడు ఇలా మనసెందుకో బాధ పడింది. ఎవరి పనులలో వారు కరిగిపోతున్నామన్న ఆవేదన. సరే అనుకుంటూ ఓ దీర్ఘ శ్వాశ మిగిల్చినతనం నుండి యిలా తన ముందు)

Saturday, July 28, 2012

దోసిలిలో...

నువ్వేం చేస్తున్నావ్?
ఏం లేదు అలా నడుస్తూన్నా...

ఊరికే నడుస్తున్నావా?
అవును...

నీ దోసిలిలో గులాబీ రేకులు?
దారంతా జ్ఞాపకాలను ఏరుకుంటు వెళుతున్నా...

Thursday, July 26, 2012

గాయం..

అలా విసురుగా ఓ గాలి కెరటం
ముఖంపై చరిచి
కాసింత సేదదీరమంది...

వేల అడుగుల ప్రయాణంలో
ఈ మజిలీ మరల
ఊపిరి తీసుకోనిస్తుంది...

పొద్దంతా తిరిగిన సూరీడు అలసి
పడమటింట యింత ఎరుపు
రంగు పులమగా ఆకాశం సిగ్గుపడ్డది...

పారే సెలయేటి ఒరిపిడి
రాతి పాలభాగంపై
యింత నునుపుదనం అద్దింది...

రాలిన పూలతో రహదారంతా
రక్తమోడుతూ
ఆర్తనాదమౌతోంది...

ఒకదానికొకటి అతకని అక్షరాలతో
అసంపూర్ణంగా విరిగిపోతూ
భావం దుఃఖ రాగమయింది...

రాయలేనితనంతో కవి గుండె
ఎండి పోయిన
కట్టెల వంతెనయ్యింది......

కాసింత ఈ గాయానికి
నీ వేదో మంత్రమూది
నెమలీకతో పలాస్త్రీ పూయవా?

Tuesday, July 24, 2012

కాలమంతా...

http://img183.imageshack.us/img183/4695/waterdrop1.jpg
ఇప్పుడంతా రాలిపోవడమే
కాలమంతా...

కంటినీరింకిపోవడమే
కనులకింత ఓదార్పుకదా...

ఆకు నుండి జారిపడుతున్న
చివరి బొట్టు దోసిలిలో...

కళ్ళకద్దుకోనూ లేక
తడి ఇంకిపోతూ...

చివరిగా తిరిగిన ఆ మలుపు
వంతెన విడిపోయిన చోట...

కాసేపలా సంధ్య ఎరుపు
పూసుకుంటూ తెల్లబడ్డ వెన్నెల...

ఈ చల్లదనం
మృత్యు స్పర్శలా తాకుతూ....

వదలిన కాగిత్తప్పడవల్నిండా
ఇన్నిన్ని జ్నాపకాలు మునుగుతూ...

కాలమిక్కడ ఓ కాలమిస్టులా
పెన్సిల్తో ఆకాశంపై నలుపు చేస్తూ...

నేలపై ఇన్నిన్ని
బలి పీఠాలను నిర్మిస్తూ....

గోరీలన్నీ ఒకే పేరుతో చెక్కి
ఓ గడ్డి పూవుతో అలంకరిస్తూ...

Saturday, July 21, 2012

నీవైన నేను...

ఇంతకు ముందులా లేను కదా!!

నాకై నేను ఓ వ్యాపకంగా వున్నవాడిని
నేడు నేనన్నదే మరిచి నీవయ్యానని...

నింగినంటిన నేల బాసలు
కురిపించే వాన మబ్బునై తొలకరి వేళ
నీ ముంగిట ముత్యపు చినుకునై నేల రాలనా...

చిగురాకుల తొడిమనంటిన నీటి బిందువు
నీ చేతి వేలి స్పర్శతో కాంతివంతమై
నీ కనులలో ప్రతిఫలించి
నా గుండె గూటిలో దివ్వెవుకావా...

సఖీ
ప్రియతమా
యిలా ఏమని పిలిచినా
యింకా ఏదో మరో వేణు నాదమేదో
స్వరమై నీ చెవిలో మ్రోగాలని
అది నా గొంతులో పల్లవించాలని...

Friday, July 20, 2012

ఫీనిక్స్ లా...


ఇక్కడే
ఆగిపోయానుకదా?
నువ్వు చూసిన
ఈ మలుపు దగ్గరే...

స్మృతులన్నీ
ఒక్కోటీ ప్రతిసారీ
లోపలంతా
కోస్తూనే వున్నాయి...

నెత్తురంటిన
అక్షరాలన్నీ
పాట కట్టకుండానే
పారబోసావు కదా?

ఏదీ వదిలేయనూ లేక
ఏదీ అందుకోనూ లేక
ఓ చెట్టు మొదలులా
అటూ ఇటూ ఊగుతూ పాతబడి...

రాపిడవుతున్న
క్షణాలన్నీ లోలోన
దహిస్తూ అణువణువూ
బూడిదలా రాలుతోంది...

రాకపోతుందా
ఓ వాన మబ్బు!!
చినుకు పడి
మళ్ళీ ఫీనిక్స్ లా లేస్తా??

నువ్వొస్తావని...

అప్పుడప్పుడూ...

అలా ఓ అలలా
కను రెప్పల చుట్టూ
ఓ కాంతి వలయంలా
చుట్టేస్తుంటావు...

దాచుకుందామని
కనురెప్పల వెనక
క్లిక్ మనిపిద్దామని
ఆశగా తెరుస్తాను...

హ్మ్!!
మాయమైపోతావు...

వస్తావన్న
ఆశతో
నే
రెప్పవేయడం
మరిచా...

Tuesday, July 17, 2012

రాతి జ్ఞాపకం..


ఎత్తుగా ఓ పర్వతపు సానువులా
నిలువెత్తుగా...

శిలల ఆకృతులలో తమ ముఖాలను
వెతుక్కుంటు...

ఎవరో ఓ పక్క గాలి కోతకు తెగిపడిన తలతో
ఆడుకుంటూ...

చేయేదో ఆలవోకగా ఇలా ఎత్తిపట్టినట్టు
తేలియాడుతూ...

ముఖంపై పడుతున్న ముడతల మధ్య
దాగిపోతూ...

ఏదో సజీవత్వం అలా ఆ రాతి కళ్ళలో
గోచరిస్తూ...

యుగాల మలుపులన్నీ ఆ కాలి వేళ్ళగుండా
మరలిపోతూ...

ఈ రాతి జ్ఞాపకాలన్నీ ఒక్కోటీ
దొర్లుకుంటూ....

ఒక్కసారిగా గుండెలపై కూలబడ్డ
బరువుతనంతో....

Monday, July 16, 2012

విరామం..



ఇలా ఒక్కోటీ గురి చూస్తూ
వస్తూ పోతూన్న
రంగు రంగుల రెక్కల
పిట్టల గుండె సవ్వడిని వింటూ...

నారి బిగించని విల్లుతో
అలసటగా యిలా ఈ దోసెడు
చలమ నీటిని గొంతులో
ఒంపుకుంటూ...

గురి తప్పని నా అమ్ము
ఏ గుండెని చీల్చకూడదని
ఈ విరామాన్ని పాటిస్తూ...

సేద దీరనీ
ఈ వేళ...

Sunday, July 15, 2012

అద్దం పెంకు..

ఇంత చిన్ని అద్దం పెంకు
గూటిలో...

చుట్టూ అలికి తెలుపు నలుపుల
ముగ్గు పెట్టిన మట్టి గోడ

చూరు పై తాటాకు
రెమ్మల రిబ్బను వేలాడుతూ...

వెదురు బద్దల తడిక హుందాగా
గోడకు చేరగిలబడి...

రెండు నెమలీకలు
అలా ముంజూరుకు గుచ్చి...

నుదుటిన ఇంత సింధూరం
ఎర్రగా సూరీడు బిళ్ళంత..

చిన్ని
అద్దం పెంకులో నా గుండె చిత్రం....

మసిబారనీకు
దీపపు సెమ్మెలా...

Thursday, July 12, 2012

దగ్గరై దూరంగా...


ప్రతి క్షణం నీ తలుపు తడుతూనే వుంటా ఆర్తిగా...
కానీ నీవు తెరుచుకోవెందుకో??

రానన్న వారిని వెంట బర బరా ఈడ్చుకు పోతావు...
వస్తానన్న నన్ను గుమ్మానికీవలే వదిలేస్తావు...

ఎన్నాళ్ళిలా నిరీక్షించను??
ఎడారి తోవలో యింకిపోయిన నీటి చెలమలా...
కారడవిలో వెన్నెల కాంతి చొరబడని దారిలా...
చివరి నూనె బొట్టు కాలి కరిగిపోయిన వత్తిలా...

నీ గాఢ పరిష్వంగంలో హాయిగా శాశ్వతంగా నిదురపోవాలని ప్రార్థిస్తున్న నన్ను
యింత నిర్దయగా నీరవ
నిశీధిలో వదిలేయడం భావ్యమా??

మృత్యు స్పర్శలోని హిమత్వాన్ని నా నుదుటిపై ముద్రించరావా...

Saturday, July 7, 2012

ఇప్పపూవులా....


నిజానికి
నిన్నెప్పుడూ కలగనలేదు...

ఎందుకో
నువ్వు దూరంగా వున్నావనుకోలేదు...

రాత్రికి వెన్నెల దూరమైనా
పగటికి సూరీడు ముఖం చాటేసినా
నువ్వెప్పుడూ నాకు దూరం కాలేదు...

అయినా
నువ్వెప్పుడూ కలగానో దూరంగానో
జరుగుతూనే వుంటావు...

ఇప్ప పూవులా
మత్తుగా
పరిమళిస్తూనే వుంటావు...

Wednesday, July 4, 2012

ఒక్కోసారి..

ఆకు కూడా అలికిడి లేనితనంతో
అల్లాడుతూ...

నీటి పాయ అలా గడ్డకట్టినతనంతో
ఉరకలేక పోతూ...

గాలి అలా స్తంభించిన వేదనతో
ఉగ్గబట్టుతూ...

వెన్నెలంతా మబ్బుపట్టినతనంతో
చీకటిని రాలుస్తూ...

ఇంత ఉక్కపోతను భరిస్తూ దేహం
ఆత్మను దహిస్తూ సేదదీరుతోంది...

Sunday, July 1, 2012

రెండు ప్రపంచాలు...

ఎప్పుడూ
నీదో ప్రపంచం
నాదో ప్రపంచం...

ఒకే గాలి పీలుస్తున్నా
చెరొకరి వాసనలు వేరు...

ఒకే నీటిలో ఈదులాడుతున్నా
చెరొకరి పాయలు వేరు...

ఒకే గదిలో ఎదురెదురుగా వున్నా
యిద్దరి మధ్యలో గోడ...

ఒకే దిండుపై రెండు దేహాలు వున్నా
అతకని తలపులు...

ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగిపోయినా
మనసులు చెరో్వైపు...

ఈ కలవని కలల కలవరింపు
అలుపెరుగని ఈ పయనం ఎటువైపు?

ఎప్పుడూ నిట్టూర్పుల అలసటతో
విరామమెరుగని ఈ ప్రస్థానం ఎందాక??

ఎగురుతున్న గాలి పటాలను
కలపలేని దారాల విఫలయత్నం కదా?

సాగనీ ఈ ముసుగు యుద్ధం
యింక విరమణ మరణయాతన కాదా??
Related Posts Plugin for WordPress, Blogger...