Thursday, July 26, 2012

గాయం..

అలా విసురుగా ఓ గాలి కెరటం
ముఖంపై చరిచి
కాసింత సేదదీరమంది...

వేల అడుగుల ప్రయాణంలో
ఈ మజిలీ మరల
ఊపిరి తీసుకోనిస్తుంది...

పొద్దంతా తిరిగిన సూరీడు అలసి
పడమటింట యింత ఎరుపు
రంగు పులమగా ఆకాశం సిగ్గుపడ్డది...

పారే సెలయేటి ఒరిపిడి
రాతి పాలభాగంపై
యింత నునుపుదనం అద్దింది...

రాలిన పూలతో రహదారంతా
రక్తమోడుతూ
ఆర్తనాదమౌతోంది...

ఒకదానికొకటి అతకని అక్షరాలతో
అసంపూర్ణంగా విరిగిపోతూ
భావం దుఃఖ రాగమయింది...

రాయలేనితనంతో కవి గుండె
ఎండి పోయిన
కట్టెల వంతెనయ్యింది......

కాసింత ఈ గాయానికి
నీ వేదో మంత్రమూది
నెమలీకతో పలాస్త్రీ పూయవా?

14 comments:

  1. రాయలేనితనంతో కవి గుండె
    ఎండి పోయిన
    కట్టెల వంతెనయ్యింది......

    ఎంత చక్కగా రాస్తారండి, మీరు, గొప్ప ఫీలింగ్.

    ReplyDelete
    Replies
    1. మీ కవితాత్మీయతకు ధన్యవాదాలు భాస్కర్జీ...

      Delete
  2. super varma gaaru...touching

    ReplyDelete
  3. బాగుంది వర్మగారు..గ్రేట్ ఫీలింగ్..సూపర్..

    ReplyDelete
  4. మీ కవితలకి కమెంట్స్ నేను వ్రాయలేను
    బాగుందని రాసి ఒక్క పదంతో సరిపెట్టలేను
    కొత్తప్రసంశా పదాలు ఎక్కడని నేను వెదకను
    మీ ప్రతి కవితలోని భావాన్ని ఆస్వాధిస్తాను!!

    ReplyDelete
    Replies
    1. మీ ఈ ప్రశంసాత్మీయ పదాలు నాలో స్ఫూర్తిని రగిలించేవి కదా పద్మార్పితగారూ...మీ సహృదయ స్పందనకు నమఃస్సుమాంజలులు ఘటిస్తున్నా...

      Delete
  5. పద్మార్పిత గారి మాటే నాదంటాను. ముందుగా ఎప్పుడు కవితల పుస్తకం అచ్చు వేయిస్తారో చెప్పండి? చాలా బాగుంది కవిత

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ..
      ఈ సంవత్సరాంతంలోపు తెద్దామని అనుకుంటున్నా..మీ సాహిత్యాభిమానానికి థాంక్సండీ...

      Delete
  6. వర్మాజీ, కవిత రాయలేనంటూనే బాగా రాసారు. బాగుంది పారే సెలయేరులా.

    ReplyDelete
  7. భలే బాగుందండి

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...