Thursday, October 31, 2013

నువ్వొక్కరివే...

 
ఇన్ని అపరిచిత ముఖాల మద్య నువ్వొక్కరివే

దోసిలిలోని నీళ్ళను అలా ముఖంపై చల్లుకొని దుఃఖాన్ని కడిగే ప్రయత్నం చేస్తూ

రాలిన పూలకు అంటిన నెత్తురిని తుడుస్తూ

తెగిన రెక్కను సవరిస్తూ

పలాస్త్రీలాంటి నవ్వుతో

నవ్వులాంటి వెలుగుతో

వెలుగులాంటి వెన్నెలతో

కాసింత పలకరింపు పసుపుదనంతో

ఈ సాయంత్రాన్ని ఆరామంగా మారుస్తూ

నువ్వొక్కరివే....

Tuesday, October 29, 2013

ఋతువు....

అప్పుడే శీత గాలి వీస్తోంది
పావురాయి గూట్లో కుర్ కుర్ మని కలియదిరుగుతూ

ఒక్కో ఆకూ నేలదారి పడుతూ
తురాయి కాయలు వంకీలుగా కత్తిలా వేలాడుతూ

చర్మం మొద్దుబారుతూ పెళుసు బారుతూ
క్రీముల అడ్వర్టైజమెంట్ల గోల మొదలవుతూ

రగ్గులన్నీ దులుపుతూ ఆవిడ మళ్ళీ ఒకసారి
అలమరా అరలు సర్దుకుంటూ

తలుపులేని ఇంటికి తడికయినా లేక
ఆ ముసలి అవ్వ అలా నులకమంచంలో గొణుగుతు

ఋతువేదైనా జీవితం నిండుగా ఇన్ని మడతల
మద్య చినిగిన దుప్పటిలో గాలి చొరబడుతూ వెక్కిరిస్తూంది కదా!!

Sunday, October 27, 2013

అయినా...

రాయివైతే మాత్రమేంటి
నీళ్ళు నీకో ఆకారాన్నిస్తున్నాయి కదా?

పూవువైతే మాత్రమేంటి
రాతి గుండెను కోస్తున్నావు కదా?

Thursday, October 24, 2013

నల్ల కుందేలు పిల్ల..


నీ చుట్టూ పొడారినతనం మద్య ఇక్కడో చెలమ వూట వుబికితే బాగుణ్ణని
ఎంతలా చేతులు చాచి ప్రార్థించావు...

అరిగిపోయి మొండిబారిన నీ వేళ్ళు గరకుగా నా మొఖంపై యింత తడితనాన్ని
రుద్దుతూ నువ్వు కళ్ళలోకి చూస్తుంటే తూనీగ రెక్కలపైనుండి మళ్ళీ బాల్యంలోకి గెంతువేసినట్టైంది...

నీ మాసిన మసిబారిన కొంగును వేళ్ళకు చుట్టుకుంటూ నీ చుట్టూ అటూ ఇటూ
కాళ్ళ మద్య తిరుగుతూ నువ్వు విసుక్కోకుండా ఆగరా అంటూ యింత ప్రేమని ఉండగా చుట్టి
జేబులో కుక్కిన మరుక్షణం మాయమయి పరుగులెట్టిన క్షణాలన్నీ అప్పుడే యింత తొందరగా ఓ తుఫానులా అలా గాలికి ఒడ్డుకు చేరినట్టు నెరిసి నెర్రెలు బారిపోవడం ఎండమావే కదా??

దుఃఖాన్నంతా ఆకుదోనెలో మడిచి మాయ చేసినట్టు నీ కన్రెప్పల నల్ల వలయాల సుడిగుండాలలో దాగి
యిన్నేళ్ళ తరువాత కూడా మాంత్రికత ఏదో మింగివేసినట్టు వెదురు పొదల మాటున దాగిన నల్ల కుందేలు పిల్లలా కనబడనీయక మాయం చేస్తావు!!

అమ్మా నాకింత బాల్యాన్ని ప్రసాదించవూ మళ్ళీ మళ్ళీ పుట్టాలనుంది ఆ బాలింతరపు పరిమళం ఒక్కటే మరల మరల మనిషిని చేస్తుంది కదా??

Tuesday, October 22, 2013

నదిలో పాదాలు..

 ఒక్కో గీతా చెరిపేస్తూ సున్నా చుట్టేస్తూ
నీ వంక అలా బేలగా

ఒక్కో రేకూ తుంచుతూ ఖాళీగా
నీ వంక అలా వొట్టిగా

ఏమౖందో నదిలో పాదాలు తుళ్ళిపడి
మునివేళ్ళనుండి బిందువులుగా

వాన వెలసి రంగులన్నీ విల్లుగా మారి
నీ వైపు తొంగి చూస్తూ

నువ్వలా కాలం రెక్కల మాటున
పావురాయిలా నిశ్చింతగా

నేనిలా ఈ చివర లేని వంతెన
మీదుగా ఆఖరుగా...

Monday, October 21, 2013

పూల రెక్కల పాట..


నువ్ పాడిన తత్వమేదో
ఈ గాలి వీస్తూ
వెలుగు దారుల గుండా
అడుగు జాడలౌతూ...

జీవన తాత్వికత యేదో
మార్మికమౌతూ
పరిమళాన్నద్దిన 

పూల రెక్కల పాట వాకిలి ముందు...

కనుమరుగవుతున్న
కాల్పనికత ఒక్కోటీ
కనులముందు
ఆవిష్కారమవుతూ...

Thursday, October 17, 2013

విరిగిన పాళీ...

చీలికలైన ముఖంలోంచి
సున్నితమైన భాగాన్ని తీసుకోగలవా?

గాయాన్నింత కారం పొడి చల్లి
కళ్ళలోకి చూస్తూ ఆరిపోగలవా?

కాగల కార్యాన్నెవడో చేస్తాడులే
అని విరిగిన పాదంతో నక్కి పారిపోతావా?

సగం కాలిన గుడిసెలో
విరిగిపడుతున్న వెన్ను వానకారుతూ

అచ్చంగా అలాగే అదే తీరులో
విరిగిన పాళీతో మళ్ళీ మళ్ళీ రాసే విఫలయత్నం..

Sunday, October 13, 2013

వస్తున్నా.......


ఒకరికొకరం ఎదురుపడనంత కాలం
ఇద్దరమూ నిజాయితీపరులమే

మామూలుగా మాటలల్లికల్లేని
పదాలతో మాటాడుకున్నామా?

ప్రశ్నగా కొడవలి ముందు
తలవంచాలా మనం

నువ్వూ నేనూ కవలలమా కాదే!
నీవో వైపూ నేనో వైపూ నిలబడ్డామే

బరిగీతల వెనకాల ఒక అడుగు
వెనక్కే నీ నా పాదాలు

మరి ఈ పెదాలకంటిన ప్లాస్టర్ని
ఊడబెరికే వేరే చేయికోసం ఎదురు చూస్తావెందుకు?

నీకు చేతి దూరంలోనే పేర్చిన
ముళ్ళ కంచెను దాటి రాలేవా?

పాదాల కింద అదనపు చర్మపు
పొర తగిలించుకున్న స్పృహ లేదా?

గాజు పాత్రనిలా భళ్ళున పగిలిన
శబ్ధం నీ చెవిటి చెవికి చేరి వుండదులే!

అందుకున్న మధుపాత్రను నీ
పెదవి చివర ఎంగిలి కానీయక అందించగలవా?

రాలేనన్న తుఫానును ఆహ్వానిస్తూ
ఒడ్డున కూచున్న నీ జపం దేనికోసం?

దేహమంతా పాకిన రాచకురుపు బాధ
ఇంకా నీ కన్నులకి పాకలేదనా?

ఎవరొస్తారులే అడగడానికి అన్న నీ
ధీమా నీ పెదవి చివరి నవ్వు వెక్కిరిస్తోంది

నాలోంచి నిన్ను పెకళించి
ఓ అక్షరం చేయగల శక్తి ఇంఅా నిద్రపోలేదులే

ఈ బరిగీత దాటి కత్తి దూసి కూత మరవని
పట్టు ఇంకా గొంతు పెగలి వస్తోంది

ఏ చిహ్నమూ లేని నదీ పరిష్వంగంలో
కాసింత వెన్నెలనిలా దోసిలిలో పట్టి

వస్తున్నా.....

Friday, October 11, 2013

నీడలో దాగిన ముఖం...



విసిరేసినతనమేదో
ఒంటరిగా దెయ్యంపట్టులా
మదిగుబురులో వేలాడుతూ

అందిన చేయి
పొడిగా గరకుగా
అరచేయి చాళ్ళగుండా
ఏదీ ప్రవహించలేనితనంతో

మాట కూర్చలేని దారంగుండా
జీవితపు సూది బెజ్జంలోంచి
కన్ను మూగగా రోదిస్తూ

ఒక్కసారిగా మీదపడ్డ
నల్ల దుప్పటి నేలమాళిగలో
నన్ను ఓదారుస్తూ
పాడుతున్న లాలి పాటలా

అసంతృప్తిగా అరాచకంగా
అబ్సర్డ్ గా గోడపై బొగ్గుతో
రాస్తున్న నినాదం ఊచల
నీడలో దాగిన ముఖం పై నువ్
చేసిన నెత్తుటి గాటు

అతకని పదాల మధ్య జిగురుగా
కాసింత ఉమ్మనీటినలా ఒలకనీ...


(తేదీ: 11/10/2013 - 7.30PM)

Wednesday, October 9, 2013

చినుకునలా...



చినుకునలా
రాలనివ్వండి

నేల

ఒడిలో
సేదదీరి
ఇంకి
ఇరిగి
తిరిగి
తన
మాతృ
గర్భంలో
చేరనివ్వండి

కొన్ని
పూవులనలా
పుష్పించనివ్వండి

రెక్కలు
రంగులు
తొడిగి
ఇంద్రధనస్సును
వంచి
నేలకు
దిగనివ్వండి


గాలినలా
వీయనీయండి

వెదుళ్ళ
వనంగుండా

సున్నిత
రాగాన్నలా
గొంతులో
పల్లవిస్తూ
దిక్కులన్నీ
విననివ్వండి


పాదాలనిలా
నడవనివ్వండి

అలుపెరుగని
పయనంలో
ఆరేడు
ఋతువులగుండా
వెలుగు
నీడల
మెరుపుల
మద్య
ఇన్ని
కన్నీళ్ళను
తుడవనీయండి

(తే 09-10-2013 దీ 7.57PM )

Sunday, October 6, 2013

కర్ఫ్యూ......

ఇప్పటికిక తెరలు అవనతం చేద్దాం రండి ఇన్ని రాళ్ళ గాయాల మద్య స్రవించని నెత్తుటి బొట్లను చిదుముకుంటూ విరిగిన కొమ్మలను అతుక్కుంటూ రేగిన జుత్తును సవరించుకుంటూ రంగును కడుక్కుందాం

మరో మారు ఉదయాస్తమయాల సంధి సమయంలో ఊదారంగు సూర్యున్ని రక్త వర్ణ చంద్రున్ని దూలానికి వేలాడగట్టి ఒకింత పసుపు ముద్దను గుమ్మానికి పూసి అందరినీ ఆహ్వానిద్దాం

ఎవరో తెగ్గోసిన నాలుక చేతపట్టిన యువకుడు పళ్ళ మద్య బాధను బిగుతుగా కరచిపట్టి పాదాలను మెట్లకానకుండా ఎక్కుతూ వస్తూ పాట పాడుతున్నాడు

మీకింక వినబడదులే ఎందుకంటే అతని కనులనెవరో పెకలించి వెనకకు విసిరేసారు రాతిరింత చిక్కగా ఓ గాజుముక్కను అతుక్కుంటూ రొప్పుతూ తన చివరి డైలాగు నెవరో చెప్పకముందే చెప్పాలని ఆత్రంగా వస్తున్నాడు

ఆగండి మరో మారు నరకబడ్డ విదూషకుని చేతులలోని అతుకుల కఱ పటక్ పటక్ మంటూ మీ పిరుదులపై చరుస్తూ మీ చేతుల నిశ్శబ్ధ చప్పట్లను గాల్లోనే ఒడిసి పడ్తూ వేదిక నిండా నవ్వులు పరుస్తున్నాడు

ఈ కర్ఫ్యూ వాసనింకా వేస్తూనే వుంది బాలింతరాలి నెత్తురి స్రావంలా ఆగకుండా అన్ని వీధుల్లోనూ కురిసిన రాళ్ళ వాన మద్య కు(య్ కు(య్ మంటూ నెత్తురోడుతున్న కుక్కపిల్ల దైన్యపు చూపులా ఆ వీధి లాంతరు వెలుగుతూ

ఊరి చివర ఎత్తు కానాల బ్రిడ్జి వెనక చింత చెట్టు కొమ్మకో వేలాడుతున్న యువకుని దేహం మిమ్మల్ని ప్రశ్నిస్తూ వుండడాన్ని సహించలేని తనంతో చెప్పులొదిలి మీరంతా పగిలిన గాజు పెంకులపై పరుగు పెడుతూ

ఆగండి ఈ తెరనింక చించేద్దాం ఈ రాత్రికి మీరు నాలుగు వాలియం .5 మాత్రలు మింగి ప్రశాంతంగా నిద్దరోయి విరిగిన మంచంపై నుండి శుభోదయం కోసం పడమర తిరిగి ఆర్ఘ్యం వదులుదురు...

Thursday, October 3, 2013

ఒకసారి....

మాటాడుకోవాలి మనం
కాలాన్ని కారు మేఘమేదో
కమ్మేయకముందే

నగ్నంగా
దేహాంతర్భాగంలోని
ఆత్మో నిశ్శరీరమో
యిరువైపులా
మోకరిల్లి
గుహాంతర్భాగంలోని
పులి చంపిన
నెత్తుటి తడినింత
పూసుకొని
చావు వాసనేదో
కమ్ముకుంటున్న
క్షణాల మధ్యనుండి
చిట పట చిట పటమని
ఎగసిపడుతున్న
జ్వాలా రేఖల చివుళ్ళ
మధ్యనుండి
రాలిపడుతున్న
బూడిదనింత
పూసుకొని
ఎదురెదురుగా
కూచుని
మాటాడుకోవాలి

కరవాలాలన్నీ
ఒరలో సర్రున
జారుతూ
పక్కటెముకలను
తెగ్గోస్తున్నా
నవ్వుతూ
మాటాడుకోవాలి

అనంత
సాగర ఘోషనెవరో
పుక్కిట బంధించి
ఒక్కసారిగా
కొమ్ము బూరలోంచి
యుద్దారావం
చేయకముందే
ఒకసారి
మాటాడుకోవాలి


(తే 1-10-13దీ రా.11.11)

Tuesday, October 1, 2013

ఖాళీగా........

 
...........
ఖాళీగా
మరింత
ఖాళీగా
..........

కరచాలనమూ
కరవై
...........

పెళుసుగా
మారుతూ
..........

చెరోవైపు
చీలిక
మద్య
పేడులా
..........

ఖాళీగా
అవరోహణా
క్రమంలో
........

మొలక 
రాని
విత్తులా
.........

గాలి 
చొరవని
గదిలా
.........

గుండెనుండి
వెలి అయి
ఖాళీగా
........

నువ్వొక
దాహపు
గొంతువలె
..........

నేనీ
గది
బయట
..........

వెదుళ్ళ
వనంలో
రొప్పుతూ
ఖాళీగా
..........
Related Posts Plugin for WordPress, Blogger...