Monday, January 11, 2010
మరణం నా చివరి చరణం కాదు - అలిశెట్టి ప్రభాకర్
'అలిశెట్టి ప్రభాకర్' ఈ పేరు నిజాయితీగా తన జీవితాన్ని పోరాడే ప్రజల పక్షాన నిలిపిన ఓ కవి, ఫోటో చిత్రకారుడు, కవితా చిత్రశిల్పి అయిన ఒక మరపురాని వ్యక్తికీ సంబంధించిన సజీవ జ్ఞాపకాల తడి. ఆయన జననం 12-01-1954 అమరత్వం 12-01-1993. జన్మించిన తేదీనాడే ప్రభాకర్ మరణం జరగడం యాధృచ్చికమైనా మనల్ని ఒక రకమైన ఉద్వేగానికి గురిచేస్తుంది.
ఆయన గురించి విప్లవకవి వరవరరావుగారి కవితా నివాళిలో
మృత్యువు దాడిచేసిన రాత్రి అతడు
అక్షరాలకు జీవం పోస్తున్నాడు
రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయింది
రక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడని
గాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు
....
చాలామంది ఆరోగ్యవంతులకు
మనిషన్నాక చావు చెప్పకుండానైనా ఒకనాడు వస్తుందని
స్పృహ వుండదు
జూలియస్ ఫ్యూజిక్కు చెరబండరాజుకూ నీకు
నాజీ వ్యవస్థ అయితేనేమి
క్యాన్సర్ వ్యవస్థ అయితేనేమి
క్షయగ్రస్త వ్యవస్థ అయితేనేమి
అది మరణ శాసనం రాసిన మరుక్షణం నుంచీ
మీరు ఒక్క స్వప్నాన్ని నిదురపోనివ్వలేదు
ఒక్క క్షణాన్నీ వృథా కానివ్వలేదు
..
ఈ కవితలో ఆయన జీవితాన్ని వివి ఆవిష్కరించారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు తన కలంతో, లెన్స్ తో పోరాడిన ప్రభాకర్ క్షయ వ్యాధితో పోరాటంలో ఓడిపోయి మనకు దూరమయ్యాడు.
ఆయన రాసిన కవితా పాదాలు కొన్ని..
మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు
మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం
నా అశ్రుకణం కాదు
నిర్విరామంగా నిత్యనూతనంగా
కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను
కలల ఉపరితలమ్మీద కదలాడే కాంతి పుంజం నేను
కన్నీళ్ళకి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను
అగ్ని పద్యం నేను, దగ్ధగీతం నేను అక్షర క్షిపణి నేను
ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను
అడవి నేను - కడలి నేను
ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను
అజ్ఞాత౦గా అంతర్లీనంగా
మట్టి పొరల్లోంచి పరీవ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను...
2. సూర్యుడే నా ముఖ చిత్రం
ఎన్నెన్ని
గాయపడిన ఉదయాల్ని
సంకలనంగా కూర్చినా
ఎవరెవరి
బాధామయ గాధల్ని
ఈ కలంతో జాలువార్చినా
మిత్రుడా
నిరంతరం
సూర్యుడే నా ముఖ చిత్రం
3. విషాద సాక్షాత్కారం
కన్నీళ్ళని ఏ భాషలోకి అనువదించినా
విషాదం మూర్తీభవించిన స్త్రీయే
సాక్షాత్కరిస్తుంది
ఎక్కడ కన్నీటి తరంగాలుప్పొంగినా
అచేతనంగా
అలల చేతుల మీంచి రాలిపడిన
అభాగినే దర్శనమిస్తుంది
తన కవితలలో ఎక్కువగా రాజకీయ దళారీల గురించి, స్త్రీల బాధల గురించే రాస్తాడు ప్రభాకర్.
ఆయన ప్రతి అంశాన్ని ఉద్యమ స్ఫూర్తితో కలగలిపి నెత్తురు మండే అక్షరాలను సృజించినవాడు. తాను గీసిన బొమ్మలకు రాసిన కేప్షన్స్ చాలా భావ స్ఫోరకంగా ఆలోచనలను రగిలించేవిగా ఉండేవి.
ఆయన ఒక దశాబ్ధం పాటు విరసం సభ్యుడు. అంతకన్నా అంతిమ శ్వాస దాకా విప్లవోద్యమ అభిమాని, కవి, చిత్రకారుడూ. ఫోటోగ్రఫీ వృత్తిగా జీవించినా అది జీవిక చేసుకోలేకపోయిన వాడు. విప్లవోద్యమం ప్రతిమలుపులో తనపై ఎంత నిర్భంధమమలయినా ఉద్యమ పక్షపాతిగానే చివరంటా జీవించి తన కలాన్ని మరింత పదునెక్కించిన సాంస్కృతిక సైనికుడు.
చివరిగా కవి ఆశారాజు తన కవితలో...
అంతమంది చేరిన గుంపులో
ఎవ్వరూ మాట్లాడ్డంలేదు
అంతటి గంభీర నిశ్శబ్ధంలో
అందరితో శవమొక్కటే బతుకుని గురించి మాట్లాడుతుంది
తలదగ్గ వెలుగుతున్న దీపమొక్కటే మాట్లాడుతుంది
బహుశా మరణించిన తర్వాతే
కవి బతకడం మొదలు పెడతాడనుకుంటాను...
-o0o-
జోహార్ అలిశెట్టి ప్రభాకర్...
Subscribe to:
Post Comments (Atom)
one of my favourate writers, died very young.
ReplyDeletei cried on the day of his departure.
Had he lived few more years, he'd have pushed Sri Sri behind clouds.
సిటీ లైట్స్ రాసిన ప్రభాకర్ గారే కదండీ ఈ ప్రభాకర్ గారు?
ReplyDeleteఎంత అద్భుతంగా ఉంది ఈ కవిత్వం! జీవితపు వ్యధలోంచి పుట్టిన కవిత్వం ఇది.
"మరణం నా చివరి చరణం కాదు"...కొంతమంది కవులు ఇలా ఎందుకు రాస్తారు? రాశాక ఎందుకు మరణిస్తారు? మరణించి మళ్ళీ జీవించడానికేనేమో!
"ఒకరికి పండై తాను పుండై..."అంటూ వేశ్యా జీవితాన్ని గుండె తొలిచేలా చిత్రీకరించింది కూడా ఈయనే అనుకుంటాను కదూ!
ఇంతకీ ఈయన సాహిత్యం ఎక్కడ దొరుకుతుంది?
నిజమే
Deleteఅజ్నాత గారూ మీరన్నది నిజం. పదునైన పిడిబాకుల్లాంటి పదాలతో ఆయన రాసిన కవిత్వం చదువుతుంటే రక్తం సలసల కాగుతుంది.
ReplyDeleteసుజాత గారూ సిటీ లైట్స్ రాసిన ప్రభాకరే. వేశ్యా జీవితాలపై బాధాతప్త హృదయంతో చాలా కవితలు రాసారు. రాజకీయాలపై రాసిన వాటితో సమానంగానే స్త్రీల బాధలపై కూడా ఎక్కువగా రాసారు. విరసం 1994 లో ఈ పోస్ట్ శీర్షికతోనే కవితా సంకలనం వేసారు. కాచిగూడలోని నవోదయా లో దొరకవచ్చు.మీ స్పందనకు కృతజ్నతలు.
ReplyDelete"మరణం నా చివరి చరణం కాదు
ReplyDeleteమౌనం నా చితాభస్మం కాదు
మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం
నా అశ్రుకణం కాదు"
ఇది నాకు బాగా నచ్చింది... చాలా బాగా వ్రాసారు.
నాకు ఈ విషయంలో అంతగా జ్ఞానం లేదు. ఈయన పేరు వినటం ఇదే మొదటిసారి.
కానీ మీరు ఉదాహరించిన ఆయన కవిత్వం చదివాక... ఆయన రాసిన మిగిలిన కవితలు / రచనలు కూడా చదవాలనిపిస్తుంది.
వర్మ గారూ !
ReplyDeleteఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి
అందించాలి అందరి జీవితాలకు నవ్య క్రాంతి
*** మీకు, మీ కుటుంబానికి, మీ మిత్రులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ***
SRRao
శిరాకదంబం
http://sirakadambam.blogspot.com/2010/01/blog-post_13.html
ఒకసారి మనసుని మరో ఆలోచనలోకి కుదించేలా చేసారు, వర్మ. ధన్యవాదాలు. జననం, మరణం ఒకటే, ఆ నడుమ ఈ పయనం తో మరణం వెనుకా జీవించే జనులు వీరు.
ReplyDeleteచైతన్యగారూ తప్పక చదవాల్సిన కవిత్వం ఈయనది. మిత్రుల దగ్గర పాత పుస్తకాలలోనయినా వుంటుంది. ప్రయత్నించండి.
ReplyDeleteఉషగారు నిజంగా అమరులైనారు వీరు తమ కవిత్వంద్వారా, ఆచరణ ద్వారా. కానీ సమాజమే, సహచరులే తన కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని అప్పట్లో అనేవారు. ఇప్పుడెలా వున్నారో తెలియదు. పిల్లలు పెద్దయివుంటారు. ఆయన అక్షరంకోసం తనను బలిదానమిచ్చినవాడు.
ReplyDeletechaalaa rojulaiyimdamdee alisetti gurimchi naalu maatalu vini. thaanks varma gaaru. kareemnagar lo alisetti perita rachayatalu avard pettaru. adi afsar gaariki amdachesinappudu alisetti kavitvam gurimchi vaktalu maatladite kalla neellu okkate takkuva vinevaaLlaku. nijam gaa kadilimche kavitvam aayanadi. johar alisetti.
ReplyDeleteKalpana Rentala