Wednesday, March 26, 2014

ఖాళీలను పూరింపుము - 3

.............................
........................................
..............................................

ఖాళీలను పూరింపుము

మాటకు మౌనానికి మధ్య

ఖాళీలను పూరింపుము

.............

గుండెకు గొంతుకు మధ్య

ఖాళీలను పూరింపుము

..............

అడుగుకు అడుగుకు మధ్య

ఖాళీలను పూరింపుము

...............

కొన్ని కన్నీటి చుక్కలను
దోసిలిలో పట్టి
ఈ దారిలో విడిచి పోయావు కదా

..............

ఖాళీలను పూరింపుము

హత్తుకున్న క్షణాలను
శ్వాసించిన నిదురను
దూరంగా నెట్టి పోయావు కదా

................

ఖాళీలను పూరింపుము

...........................
........................
................

ఏమీ మిగల్చని కాలాన్ని
కల్లోల పరచి అలల నురుగుల మధ్య
బుడగలను ఆర్పి
ఖాళీలను పూరింపగలవా?

.......................
..................................

లేవిక్కడ

.....................

ఈ శూన్య హస్తాల మధ్య

నివురినింత పోగు చేసి

......................

ఖాళీలను పూరింపుము!!


Saturday, March 22, 2014

కలల తూనీగ..

రాతిరంతా రెప్పలపై కలల తూనీగ
తెలవారగానే రెక్కలు విరిగి నేల రాలింది


రంగు వెలసిన గోడపై నీ చేతి గోళ్ళ గీతలే
నెత్తుటి మరకల మద్య వేలాడుతూ

తూటా దిగిన గుండె గొంతులో పాట
చివరి మూలుగుగా మారింది

గాయపడ్డ పక్షి రెక్క తెగి పడి
శపిస్తోంది మూతపడ్డ రెప్పలమద్య!!

Friday, March 21, 2014

'పాత చొక్కా' కవితపై సారంగలో అఫ్సర్ సార్ సమీక్ష..

మంచి కవిత్వం ఎలా వుంటుందో యింతవరకూ యెవరూ చెప్పలేదు. చెప్పడానికి కావాల్సిన పదాలు లేవని మాత్రం అంటూనే వున్నాం. మంచి కవిత ఎందుకు మంచిదైందో చెప్పడానికి మళ్ళీ కవిత్వ వాక్యాలనే తిరగదోడుతూ వుంటాం. ఎందుకంటే, కవిత్వాన్ని కవిత్వంతో మాత్రమే కొలవగలమనీ, వచనంతో తూయలేమనీ అనుకుంటాం కనుక!

చాలా వరకు ఇది నిజమే! పరిమితమైన  నా అనుభవంలో నాకు తెలిసివచ్చింది కూడా ఇదే! .. అఫ్సర్ సార్..


ఈ దిగువ లింక్ లో చదవండి..
'పాత చొక్కా' కవితపై సారంగలో అఫ్సర్ సార్ సమీక్ష..

Tuesday, March 18, 2014

వాడో నవ్వుల దీపం

వాడెప్పుడూ అలా నవ్వుతూనే వున్నాడు
బాల్యం నుండి ఈ రోజు వరకు
వాడెప్పుడూ అలా వెన్నెలలా తెల్లగా నవ్వుతూనే వున్నాడు

దేహమంతా నరాలుదేరి కొవ్వన్నదే పట్టని పక్కటెముకలతో
నల్లగా నిగ నిగ లాడుతూ
వాడెప్పుడూ అలా ఇరిడి బొమ్మలా నవ్వుతూనే వుంటాడు

మట్టిని పిసికి మట్టిని పీల్చి మట్టిని తిని మట్టితోనే
బతుకంతా పెనవేసుకుంటూ
వాడెప్పుడూ అలా మట్టి దీపంలా నవ్వుతూనే వుంటాడు

నాతో పాటుగా వాడి వయసూ పెరుగుతూనే 
దూరంగా పోతున్న నన్ను చూసి
వాడు అలా నిటారుగా ఆకుపచ్చ చందమామలా నవ్వుతూనే వున్నాడు

వాడలా నవ్వుతూ వున్న సమయమే
నాకెప్పుడూ మరో వసంతాన్ని హామీ యిస్తూ
వాడితో పాటు నేనూ నవ్విన క్షణం నాలో వేయి దీపాలను వెలిగిస్తాడు
(తే 18/03/2014 దీ 10.20 PM)

Monday, March 17, 2014

మట్టి రంగు..


రంగులేవీ పూసుకోని మొఖం
వుందా యిక్కడ?

ఒక్కో రంగు ఒక్కో సమయానికి
వేసుకున్నవే కదా!

నలుపు తెలుపులే శాశ్వతమైన
వర్ణాలని తెలిసినా

ఎవరో పూసిన రంగుతో నా మొఖం
నీకు భయంకరమైన వేళ

మట్టి రంగునింత పులుముకొని
ఈ చివరాఖరి వంతెనపై నిరీక్షణ!!

(హోళీ శుభాకాంక్షలతో)

Thursday, March 13, 2014

పాత చొక్కా


అవును ఆ పాత చొక్కా ఎప్పుడూ అలా
నా మనసు కొక్కేనికి వేలాడుతూనే వుంది

బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ కళ్ళు చిట్లిస్తూ
సూది బెజ్జంలో ప్రేమ దారాన్ని చేర్చి కుడుతున్నట్టు

బస్సెక్కేటప్పుడు తోపులాటలో చినిగి వస్తే నాతో పాటు
తననూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న అతుకు వేస్తున్నట్టు

మాసి పోయినప్పుడల్లా నెమ్మదిగా పులుముతుంటే
రంగు వెలసిన జ్నాపకమేదో మసకగా కంటి నీటి పొర వెనక కదులుతున్నట్టు

యింకా వదలని పిట్ట రెట్ట మరక చెవిలో
ఆ కువ కువ వేకువనింకా పల్లవిగా ఆలపిస్తున్నట్టు

వీచే చల్లగాలిని ఆప్యాయంగా ఒడిసిపట్టి అలసిన
దేహానికి తన బిగువులో  కాసింత సేద దీరుస్తున్నట్టు

ఆ జేబులో దాచుకున్న గులాబీ రేకు
తననింకా ఆ మలుపుకు గురుతుగా దాచి వుంచినట్టు

ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!

(తే 13/03/2014 దీ 08.09 PM )
Related Posts Plugin for WordPress, Blogger...