Tuesday, August 24, 2010

పాప జ్ఞాపకాలలోనీ జ్ఞాపకం నన్ను
నిరంతరం వెన్నాడుతూనే వుంది
నీ కేరింతలతో ఇల్లంతా
పున్నమి వెలుగులు నింపిన
నీ బోసి నవ్వును
మరువలేకున్నా..

నీ అర్థనిమీలిత నేత్రాలతో
సుషుప్తావస్తలో వున్న
నిన్ను చూసి ఎంతలా
మురిసిపోయామో కదా!

నీ లేలేత దేహ కాంతి పుంజం
తాకి నా వొడలంతా పులకరించిన
క్షణాన్ని ఎలా మరిచిపోగలను..

కానీ..
ఆకశాన మెరిసిన విద్యుల్లతలా
భువిని తాకిన నీ పాదాలు
వెన్వెంటనే మాయమయ్యాయన్న
నిజం నేటికీ మింగుడుపడలేదీ
గుండెకి..

నింగిని మెరిసిన మెరుపును
చూసినప్పుడంతా నువ్వు మరలా
నాన్నా అంటూ గుండెలపై
వాలతావని ఆశగా..
ఆర్తిగా..

(ఈ రోజు మా మొదటి ప్రేమఫలం 'పాప' పుట్టిన రోజు. తను పుట్టినప్పుడు ఆరోగ్యంగా కనిపించి ఆ తరువాత blueish గా మారి ఎనిమిదో రోజున మమ్మల్ని విడిచిపోయింది. నిరుద్యోగం, ప్రేమ పెళ్ళి ఇబ్బందులతో తనను కాపాడుకోలేకపోయనన్న guiltiness ఇప్పటికీ వెంటాడుతూ వుంది..)

Friday, August 20, 2010

అమ్మ ఒడిలో..అమ్మ ఒడిలో
తల వాల్చితే
కళ్ళనుండి ధారాపాతంగా
కారిన కన్నీటితో
సేద దీరిన మనసుతో
ఒక్కసారిగా ఏదో విద్యుత్ప్రవాహ తాకిడితో
మళ్ళీ ఉమ్మనీరులో ఈదినట్లుగా
మరో జన్మెత్తినట్లుగా
శిశువువలె
కేరింతలాడుతూన్నట్లు
అనుభూతి కలిగిన క్షణం
ఓ మహా యుద్ధ విజయానంతరం
వీరుని పెదవిపై ధరహాస చంద్రిక మెరిసిన క్షణం
కోల్పోయినదేదో గురుతెరిగిన మరుక్షణం
అమ్మ పాదాల చెంత
నా శిరశాభివందనం..

Friday, August 13, 2010

అరుణతార ఏప్రిల్ - జూన్ సంచికవిరసం అధికార పత్రిక అరుణతార ఏప్రిల్-జూన్ సంచిక నలభైఏళ్ళ విరసం, నూరేళ్ళ శ్రీశ్రీ ప్రత్యేక సంచికగా వెలువరించారు. విరసం సభలలో ప్రసంగించిన హరగోపాల్, కె.శివారెడ్డి, వరవరరావు, కళ్యాణరావుల ప్రసంగపాఠాలు, విరసం తీర్మాణాలు, వ్యాసాలు, కథలు, కవితలు, సభల ఫోటోలు ఇందులో వున్నాయి. ఈ సంచిక నుండి వర్కింగ్ ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టిన మా రాంకీ దీనిని pdf format లో అందించగా ఇలా online లో పెడుతున్నా. ఇందులో అరుణతారకు చందాలు, విరాళాలు పంపించే చిరునామా వుంది. దయచేసి సాహితీ మిత్రులు అరుణతార ఆర్థికంగా కోలుకునేందుకు సహకరిస్తారని ఆశిస్తూ ఈ రూపంలో మీముందుంచుతున్నా..

apr_jun 2010

Friday, August 6, 2010

మట్టి వేదం..ఇప్పుడంతా కుబేరుల కాలం
అమ్మతనాన్ని కూడా సరుకునుజేసే మాయాజాలం
రంగుల పూతతో అమ్మజూపే టెక్నిక్ తప్ప
చనుబాల తీపినెరుగని వారి ఇంద్రజాలం..

ఈ మట్టి పూల పరిమళాన్ని
ఈ మట్టి సారవంతాన్ని
ఈ మట్టి తేజాన్ని
ఈ మట్టి జీవత్వాన్ని
ఈ మట్టి నాగరికతను
మండించి బూడిద చేసే కుట్ర

ఎవరి ఇంట కాంతుల కోసం
మా ఇంటి దీపాన్ని కొండెక్కిస్తావు?

తీరమంతా పరచుకున్న జీవజాలాన్ని
జీవజలాన్ని నీ విషపు
మలంతో నింపి
భవిష్యత్ తరానికి అవిటితనాన్ని
వారసత్వంగా ఇవ్వజూపే కుళ్ళుతనం కాదా?

ఈ మట్టి వేదం
అమ్మతనం..

ఈ మట్టి వేదం
మడమతిప్పని
గున్నమ్మ వారసత్వం..

ఈ మట్టి వేదం
పంచాది నిర్మల పోరాట వారసత్వం..

ఈ మట్టి వేదం
శ్రీకాకుళ రక్తతర్పణం..

ఈ మట్టి వేదం
కుట్రలకెదురొడ్డి జబ్బచరచడం...
Related Posts Plugin for WordPress, Blogger...