Tuesday, October 27, 2015

సిద్దార్ధ మిస్ యూ!!

నీ ఊరు నుండి 
నీ వార్డు నుండి
ఒక్కో ఇటుకా పంపించు 
కాసింత పుట్ట మన్ను
రాగి కలశంలో నీళ్ళు 
తీసుకొని గుంపుగా 
డప్పులు మోగిస్తూ 
నీ కోవెలలోనో నీ మసీదులోనో నీ చర్చిలోనో
సామూహిక ప్రార్థనలు చేసి పంపించు 
మీ అందరికీ ఇక్కడ కాంక్రీటు దిమ్మలతో
నువ్వూ నీ పిల్లలూ అబ్బురపడే
వీడియో గేంలలో తప్ప చూడని 
మాయా మందిరాలను నిర్మిస్తాం
కురచ ముక్కు ఉబ్బుకళ్ళ ఇంజనీర్లు 
పోటీ పడి సర్రున జారే రోడ్లతోను 
రయ్యిన ఎగిరే ఇమానాల రొదతోను
నిండిపోయే నగరాన్ని నీకోసం
హాంఫట్ అంటూ మరికొద్ది రోజుల్లో 
ముప్పై వేల ఎకరాల పంట భూములను
మింగేస్తూ నువ్ కలలో కూడా 
ఊహించని మాయాలోకాన్ని సృష్టిస్తారు 
నువ్వూ నీ పాపలూ కలసి దూరంగా గుడిసెలో 
టీవీలో అక్కడ తిరిగే ఓడలాంటి కార్లనూ 
సూటూ బూట్లతో తిరుగాడే పెద్ద మనుషులనూ 
హాశ్చర్యంగా చూస్తూ సల్ది బువ్వను రాతిరికి 
ఎండు మిరపకాయతో మింగుతూ గుటకేయొచ్చు
వానలూ కురవనక్కర్లేదు కోతలూ కోయనక్కర్లేదు
ఆధార్లో నీ వేలి ముద్రలు మాయం
నీ కార్డుకు బియ్యం కోత
నీ బొడ్డు తాడుకు పేగు కోత తప్పదు 
సెల్ ఫోన్లో మాత్రం చార్జింగ్ అవ్వకుండా చూసుకో
బాబు గారో బాబు గారి సుపుత్రుడో 
పైనున్న పెదాన మంత్రిగారో 
తమ కెందుకు ఓటేయ్యాలో మెసేజిస్తారు
ట్విట్టర్లో ట్వీట్లకు కోట్ల స్పందనలు 
నాగార్జున సాగర్ గేట్లెత్తిన ఉచ్చ కూడా బోయట్లేదంట
అమరావతిలో సిద్దార్థుడు పారిపోయాడంట 
నీ పాడికి నువ్వే ఎదురు కర్రలు ఏరుకోవాలింక 
నీకోసం ఏడ్చే తీరికెలేదిక్కడెవ్వడికీ 

నిన్ను పాతడానికి ఆరడుగుల నేలా లేదిక్కడ!! 

(ఈ వారం సారంగ వెబ్ పత్రికలో ప్రచురితం)

Thursday, October 8, 2015

దారులు వేద్దాం...

ఇప్పుడు మూసుకుపోతున్న దారులను
తెరచే పని చేయాలి

ఒక్కో నదినీ ముక్కలు చేస్తూ ఎక్కడికక్కడ
గోడలు కడుతున్నాడు వాడు

ఇప్పుడు నదీ ద్వారాలను స్వేచ్చగా
తెరచుకోనివ్వాలి

ఒక్కో పర్వతాన్నీ పిండి చేస్తూ వాడు
గుండెల్ని తవ్వి ఎత్తుకు పోతున్నాడు

పర్వత పాదాలతో పాటు శిఖరాన్ని
నిబ్బరంగా ఎదగనివ్వాలి

నిటారుగా దారు వృక్షాలతో కలకలలాడుతున్న
పచ్చని అడవిని నరుక్కుపోతున్నాడు వాడు

నేల లోతుల్లోకి వేళ్ళని జొనుపుతూ ఆకాశాన్ని
అందుకునేలా పాతుకోనివ్వాలి

సాగర తీరాన ఇసుక లోతుల్లోకి చొరబడి
అలలనే మింగేయడానికి వస్తున్నాడు వాడు

గర్భంలోంచి ఎగసిపడే అలల కెరటాలను
తీరందాకా చేరనివ్వాలి

నిన్నూ నన్నూ మాంత్రిక పాచికలతో జూదరులను చేస్తూ
వాడు ఉనికినే తుంచుకుపోతున్నాడు

నేలను ఆనిన పాదాలతో వాడి గుండెలపై
ఎగిరి తన్ని తరిమేయాలి


Related Posts Plugin for WordPress, Blogger...