Tuesday, August 30, 2011

సూరీడుపై నల్లని గుడ్డ...


నా కళ్ళలోని ప్రశ్నల సూరీడుని
నల్లని గుడ్డతో కప్పి
నా గొంతు పాడే విముక్తి గీతాన్ని వినబడకుండా
నువ్వు నా మెడ చుట్టూ తాడు బిగించి
నా మెడ ఎముకను విరిచి
పిడికిలెత్తిన నా చేతులను
వెనక్కి విరిచికట్టి
నా కాలి బొటన వేళ్ళను తాడుతో బంధించి
నన్ను గోతిలో పడేసి నీ అహంకారాన్ని
శాంతింపజేసుకొనవచ్చు....

కానీ ఇప్పటికే ఆలశ్యమైపోయింది........
నా పాటల పల్లవులు
కోటి గొంతులలో ఉప్పెనలా
నినదించుకుంటూ
నీ ఖైదు గోడలను బద్ధలు చేస్తూ
వెలుతురు పిట్టల
సమూహమొకటి నిన్ను
తరుముకుంటూ ముంచుకు వస్తుంది....

ఇంక నిన్నే రక్షణ మాళిగలూ
కాపాడలేవు....

(జార్ఖండ్ సాంస్కృతిక కళాకారులు జితేన్ మరాండీ మరి ముగ్గురి ఉరిశిక్షలకు వ్యతిరేకంగా)Wednesday, August 24, 2011

పాప నా కంట్లో కరగని ఓ కన్నీటి కల..
మనో వినీలాకాశంలో

నీ బోసి నవ్వు
ఓ జాబిలి సంతకం..


నీవు వదలి వెల్లిన
జ్ఞాపకాలు

గుండె గదిలో ఎన్నటికీ పదిలం...


నీకో పేరు పెట్టి పిలుచుకొని మురిసిపోక ముందే

తెంచుకున్న పేగుబంధం

ఎప్పటికీ తరగని విషాదం...


నీ లేలేత పాదాలు
నా గుండెలపై
నాట్యమాడకుండానే మాయమయ్యాయన్న గురుతు
వెంటాడుతూనే వుంది కన్నా...


నీ గుండెలపై వాలిన
ఆ నీలి రాక్షసి
ఎవ్వరో
నన్ను మిగిల్చి ఎంత తప్పు చేసిందో....

పాపా
!

నీవు
నా కంటి రెప్పల
మాటున
దాగిన కరగని ఓ కన్నీటి కలవు...


(ఈ దినం మమ్మల్ని విడిచి వెళ్ళిన చిన్నారి జన్మదినం)

Sunday, August 21, 2011

చాలదా నేస్తం...ఇంత మౌనం అవసరమా??
కాస్తా వీడరాదూ..

మబ్బుల మాటున దాగిన వెన్నెల
అలా పైపైకి చేరి విచ్చుకుంటున్న వేళ
ఎంత హాయిగా వుందోకదా!

అలా కాదు
ఇలా రేయమ్మ ఒడిలో
దాగిన పూవులా నిదురోయి వుంటే ఎలా?

చిరునవ్వుల విరిజల్లులో అలా ఒక్కమారు
కలల తేరుపై విహరిద్దామా?

మాటల మూటలు విప్పి మనసు లోలోపల దాగిన
కతలన్నీ కలబోసుకొని తేటపడ్డ ఎదలో ఓ అమూర్త అజరామరమైన భావం
చాలదా నేస్తం....

Tuesday, August 9, 2011

తడి ఆరని జ్ఞాపకం...


నిన్న మొన్నటి జ్ఞాపకం
నా కంటి తెరచాపల మాటున కదలాడుతోంది...

ఉబికిన కన్నీళ్ళు ఉగ్గబట్టుకున్న దు:ఖం
సుడులు తిరుగుతుండగా యిప్పటికీ
మీ కరచాలనపు స్పర్శ వెచ్చగా
గుండెల్లో దాగి వుంది..

పండు వెన్నెలలాంటి మీ నవ్వు
వాన వెలిసిన రాత్రి మబ్బులు వీడిన
చంద్రుని మోములో ప్రతిఫలిస్తుంది...

గలగల పారే సెలయేళ్ళు
మీ మాటల ఊసులు విన్పిస్తున్నాయి...

వడివడిగా పారే వాగులు
మీ నడకలోని వేగాన్ని గుర్తుకు తెస్తున్నాయి...

పచ్చటి వరిచేలు యూనిఫాంగా మారి
మిమ్మల్ని గుండె గదిలో దాచుకుంటాం రారమ్మని
పిలుస్తున్నట్టుగా వున్నాయి...

ఎత్తైన శిఖరాలు మీ నిబ్బరానికి
శిరసు వంచి నమస్కరిస్తున్నాయి...

మీ అమరత్వపు అరుణిమను అద్దుకొని
నెత్తుటిముద్దైనాడు సూరీడు...

మిత్రులారా
నా గుండెల్లో దాగిన చెమ్మ ఎప్పటికీ మీ
త్యాగాన్ని మరువనివ్వదు

మీరెత్తిపట్టిన ఝెండాను
ఒరగనివ్వదు....


(1998 ఆగస్ట్ 09 న జరిగిన కోపర్ డంగ్ ఎన్ కౌంటర్ అమరుల స్మృతిలో- ప్రచురణ ఏప్రిల్ 2002-అరుణతార)

Saturday, August 6, 2011

స్నేహాభిషేకం...


అవసరాలకాదుకునేదే స్నేహమా?

రెండు హృదయ సంభాషణల మధ్య చిగురించిన వసంతాన్ని
ఇంతలా కుదించగలమా?

తనువులు వేరైనా మనసులు ఒకటిగా మసలే
రెండు జీవుల సహవాసం స్నేహంగా గుర్తించలేమా?

పారే ఏటి నీటిలోని తెల్లదనంలా
స్నేహం ప్రతిబింబించాలి..

అద్దం ముందు అబద్ధమాడలేనితనం
కళ్ళలో ప్రతిఫలించాలి.....

పసిబిడ్డ బోసినవ్వులోని స్వచ్చత
ప్రస్ఫుటించాలి....

స్నేహమా ఏ షరాబు నిన్ను వెలకట్టలేడు....

ఆ స్నేహానికి దేహమంతా చేతులై
అలాయి బలాయి చెబుతున్నా...

మిత్రులారా స్నేహాభిషేకంకు ఆహ్వానం....Thursday, August 4, 2011

కాసింత విశ్రమించనివ్వండి


కాసింత విశ్రమించనివ్వండి..

సెల్ మోతల ట్రింగ్ ట్రింగ్ లనుండి
అనవసరపు సందేశాల దాడులనుండి
కాసింత విశ్రమించనివ్వండి...

నవనాడులూ కుంగదీసినట్లు
వినిపించే రణగొణ ధ్వనుల మధ్యనుండి
కాసింత విశ్రమించనివ్వండి...

కనులముందు కదలాడుతున్న
రక్త సిక్త గాయాల నుండి
కాసింత విశ్రమించనివ్వండి...

ముప్పిరిగొన్న మానసిక స్థితి నుండి
కాసింత విశ్రమించనివ్వండి...

కనులలోయలో కరిగిపోని కలలనుండి
కాసిన్ని కలవరింతలనేరుకొని కతలు గుచ్చ
కాసింత విశ్రమించనివ్వండి...

నరాలనన్నీ కూడదీసుకొని
వింటినారిలా సంధించి మరలా గురిచూసి
కొట్టడానికి కాసింత విశ్రమించనివ్వండి...

Wednesday, August 3, 2011

విషాద సమయం..
యిప్పుడింక
మట్టి తన గురించి తనే మాటాడుకోవాలి!
నీరు తానే పల్లవై పదిమందికి పంచుకోవాలి!
అడవి తానే పాటై నలుగురికి వినపడాలి...

ఎవరికి వారే గొంతు విప్పాల్సిన సమయమిది
గోడు వినిపించాల్సిన సమయమిది
కతలు కలబోసుకోవాల్సిన కాలమిది

రాజ్యంతో పాటు కాలం కూడా తలారి పాత్ర
యింత నిర్దయగా నిర్వహిస్తున్న సమయంలో
ఇంకెవరికోసమో వేచి వుండాల్సిన
కాలం కాదిది...

రా నేస్తం
మన దారి మనమే వెతుక్కుంటు
జీవన పోరాటాన్ని సాగిద్దాం...

(’మో’ అస్తమించారన్న వార్తతో విశాఖలోని రమక్కతో పంచుకున్న విషాదం)


Related Posts Plugin for WordPress, Blogger...