Showing posts with label కవిత-జ్నాపకాలు. Show all posts
Showing posts with label కవిత-జ్నాపకాలు. Show all posts

Saturday, December 31, 2011

వీడ్కోలు..



2011

వీడ్కోలు నీకు

నా జీవితంలో ఇంత విషాదాన్ని
మిగిల్చిన నీకు వీడ్కోలు...

నన్ను నాన్ననుండి దూరం చేసిన
నీకు కన్నీటి వీడ్కోలు...

నీవు వహించిన తలారి పాత్రకు
నిన్ను నిందించలేను
అలా అని మౌనంగా వుండిపోలేను...

పోరాట పతాకమైన వారిని
పొట్టనపెట్టుకు పోతున్న నీకు
సంతాప వీడ్కోలు...

జ్నాపకాల దొంతరలలో
ఇంత విషాదపు చీకటిని
మిగిల్చిన నీకు
తుది

వీ
డ్కో
లు...

Monday, October 24, 2011

ఆమెకు వందనం



ఆమెను చూసినప్పుడల్లా
లోలోన గుండెనరం
ఒక్కసారిగా బాధగానో సంతోషంతోనో
మెలికపెడుతూంది....

పురిటి వాసనేస్తూ పురా జ్ఞాపకాల్నీ
ఒక్కసారి పేగు బంధంలా చుట్టుముడుతు
ఉక్కిరిబిక్కిరి చేస్తాయి...

నాకై నేను అప్పుడే చంటి పిల్లాడిలా మారి
అల్లరి చేసి చీవాట్లు తినాలనిపిస్తుంది!
విసుగు రాదే తనకి....

అల్లంతలోనే ఎప్పుడో నాకు దూరమైన
దేవత నా కనులముందు ప్రత్యక్షమై
నాలోలోపలి అలజడినంతా
తన వెచ్చని చేతిలోకి తీసుకొని
హ్యారీ పోటర్ లా విశ్వాంతరాల అంచులలోకి
తోడ్కొని పోయి
వెన్నెల లోని చల్లదనమంతా
తన చూపులలో వర్షించి
నన్ను కాంతిమంతం చేస్తూ
పరిమళభరితం చేయిస్తుంది....

ఆ స్త్రీ మూర్తికి వందనం....

Friday, September 30, 2011

పోస్ట్ కార్డ్..




ఓ చిన్న చిట్టీ నిండా
ఇన్ని కబుర్లు నింపి
నీ అంతరంగాన్నంతా
మధించి కాసిన్ని
అమృతపు చుక్కలు జల్లి
రాసిన ఆ నాలుగు
మాటలు
ఓ స్నేహితుడా క్షేమమా!
అన్న నీ పలకరింపు
ఎంత పులకరింతగా వుండేది...
ఆ ఎదురు చూపుల
తీయదనం తిరిగి రాదేమి?
మడత పెట్టి జేబులో
గుండెకు దగ్గరగా వుంచుకొని
మధ్యలో తడుముకుంటూ
నీ వెచ్చని స్పర్శను
అనుభూతిస్తూ నడిచే వేళ
ఆ మమకారం కళ్ళలో
వెలుగును నింపేది...
ఎక్కడ దాగిపోయాయివన్నీ??

బాబూ పోస్ట్
అన్న పిలుపే కరువై
పసుపురాయని గుమ్మంలా
వెల వెల బోయింది....

Friday, September 23, 2011

నీవా? నేనా??


కుప్ప బోసిన కలల్లోంచి
ఏరుకుంటున్న జ్ఞాపకాలు....

తడిగా నెత్తురంటిన శిశువు దేహంవలె
పురిటి వాసనేస్తూ
తల్లి పేగులా మెడ చుట్టూ...

తెగిపడని ఆలోచనల సంకెలలోంచి
ఒక్కో మెలిక గట్టిగా ఒరుసుకుంటూ...
గురుతుల చేద వేస్తున్నా అందని నీళ్ళ బావిలా
లోతుగా....

నల్ల మబ్బుల లోంచి సగం కోసిన వెన్నలలా
తొంగి చూస్తూ...

కాగితంపై ఒలికిపోయిన రంగుల లోంచి
గాడంగా ఓ చెరిగిపోని చిత్రం....

నీవా? నేనా?


Saturday, September 10, 2011

ఇక్కడో...




ఇక్కడో గులకరాయి వుండాలి!
ఎవరో విసిరేసినట్టున్నారు...

ఇక్కడో ఏటి పాయ ఒరుసుకొని పారుతూ వుండాలి!
ఎవరో మింగేసినట్టున్నారు...

ఇక్కడో వట వృక్షం పిట్టల గుంపుతో కిలకిల మంటూండేది!
ఎవరో నరికేసినట్టున్నారు...

ఇక్కడో తీగ చుట్టుకొని విరగ కాస్తూ పరిమళిస్తుండాలి!
ఎవరో తుంచేసినట్టున్నారు...

ఇక్కడో పాక కడుపునిండా యింత అన్నం పెట్టేది!
ఎవరో పీకి పారేసినట్టున్నారు...

ఇక్కడో బడ్డీ కొట్టుండేది
నోటినిండా తాంబూలం ఇచ్చి వాసన పండిచ్చేది!
ఎవరో ఎత్తుకుపోయినట్టున్నారు....

ఇక్కడో ఆసుపత్రి గాయాలకు పలాస్త్రీ రాస్తూ వుండేది!
ఎవరో దొంగిలించినట్టున్నారు....

ఇక్కడో బడిగంట మోగుతూ వుండేది
అక్షరాభ్యాసం చేయిస్తూ నాలుగు పద్యాలు పాడేది!
ఎవరో జేబులో పెట్టుకు పోయినట్టున్నారు...

ఇక్కడో గుడి గోపురం ఠీవిగా నిలబడి వుండేది
గంట మోగుతూ నేనున్నానని పిలిచేది!
నేల మాళిగలో కలిసినట్టుంది...

ఇక్కడో పావురాల గుంపు ఎగురుతు వుండేది
పచ్చని ఆకు ఈనెలపై నెల వంకను పూసేది!
ఎవరో తవ్వి పారేసినట్టున్నారు....

ఇక్కడో కుర్రాడు సైకిల్ చక్రం తిప్పుతూ
పరిగెడుతుండేవాడు...
ఎవరో బొమ్మగీసి ఎత్తుకు పోయినట్టున్నారు...

Wednesday, August 24, 2011

పాప నా కంట్లో కరగని ఓ కన్నీటి కల..




మనో వినీలాకాశంలో

నీ బోసి నవ్వు
ఓ జాబిలి సంతకం..


నీవు వదలి వెల్లిన
జ్ఞాపకాలు

గుండె గదిలో ఎన్నటికీ పదిలం...


నీకో పేరు పెట్టి పిలుచుకొని మురిసిపోక ముందే

తెంచుకున్న పేగుబంధం

ఎప్పటికీ తరగని విషాదం...


నీ లేలేత పాదాలు
నా గుండెలపై
నాట్యమాడకుండానే మాయమయ్యాయన్న గురుతు
వెంటాడుతూనే వుంది కన్నా...


నీ గుండెలపై వాలిన
ఆ నీలి రాక్షసి
ఎవ్వరో
నన్ను మిగిల్చి ఎంత తప్పు చేసిందో....

పాపా
!

నీవు
నా కంటి రెప్పల
మాటున
దాగిన కరగని ఓ కన్నీటి కలవు...


(ఈ దినం మమ్మల్ని విడిచి వెళ్ళిన చిన్నారి జన్మదినం)
Related Posts Plugin for WordPress, Blogger...