Saturday, September 10, 2011

ఇక్కడో...




ఇక్కడో గులకరాయి వుండాలి!
ఎవరో విసిరేసినట్టున్నారు...

ఇక్కడో ఏటి పాయ ఒరుసుకొని పారుతూ వుండాలి!
ఎవరో మింగేసినట్టున్నారు...

ఇక్కడో వట వృక్షం పిట్టల గుంపుతో కిలకిల మంటూండేది!
ఎవరో నరికేసినట్టున్నారు...

ఇక్కడో తీగ చుట్టుకొని విరగ కాస్తూ పరిమళిస్తుండాలి!
ఎవరో తుంచేసినట్టున్నారు...

ఇక్కడో పాక కడుపునిండా యింత అన్నం పెట్టేది!
ఎవరో పీకి పారేసినట్టున్నారు...

ఇక్కడో బడ్డీ కొట్టుండేది
నోటినిండా తాంబూలం ఇచ్చి వాసన పండిచ్చేది!
ఎవరో ఎత్తుకుపోయినట్టున్నారు....

ఇక్కడో ఆసుపత్రి గాయాలకు పలాస్త్రీ రాస్తూ వుండేది!
ఎవరో దొంగిలించినట్టున్నారు....

ఇక్కడో బడిగంట మోగుతూ వుండేది
అక్షరాభ్యాసం చేయిస్తూ నాలుగు పద్యాలు పాడేది!
ఎవరో జేబులో పెట్టుకు పోయినట్టున్నారు...

ఇక్కడో గుడి గోపురం ఠీవిగా నిలబడి వుండేది
గంట మోగుతూ నేనున్నానని పిలిచేది!
నేల మాళిగలో కలిసినట్టుంది...

ఇక్కడో పావురాల గుంపు ఎగురుతు వుండేది
పచ్చని ఆకు ఈనెలపై నెల వంకను పూసేది!
ఎవరో తవ్వి పారేసినట్టున్నారు....

ఇక్కడో కుర్రాడు సైకిల్ చక్రం తిప్పుతూ
పరిగెడుతుండేవాడు...
ఎవరో బొమ్మగీసి ఎత్తుకు పోయినట్టున్నారు...

10 comments:

  1. sorry idi sv epppudo rasesadu padalu kuda ive.....bhaavam bagunna kavitha chadivindilane anipinchadam sahajam...love j

    ReplyDelete
  2. నేను ఆ ఎస్వీ రాసినది చదవలేదు....నామట్టుకు నాకు ఈ కవిత మీమనసులోంచి వచ్చిన మరో అద్భుతంగానే భావిస్తున్నా...టిపికల్ వర్మ సాహిత్యం ఇది....మీదంటూ ఓ ప్రత్యేకరకమైన సాహిత్యాన్ని సాధించినట్టే."ఇక్కడొ బడిగంట మోగుతూ ఉండేది...." నాకు నచ్చిన భాగం...

    ReplyDelete
  3. ధాత్రి మేడం నేను ఆయన రాసినది చదవలేదు.....ఇది నా మట్టుకు నా స్వంతం...

    ReplyDelete
  4. వాసుదేవ్ గారు ధన్యవాదాలు...నేను మేడం అన్నట్టుగా ఆ కవిత చదవలేదు...మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు....

    ReplyDelete
  5. నెను ఎస్వీ రాసినది చదవలేదు..నాకు కాపీ కొట్టే అలవాటులేదు...నిన్నంతా వెంటాడిన భావాన్ని, ఏదో దాడి జరిగినప్పుడు ఎవరివో బొమ్మలు గీసి పోలికలున్న కుఱాల్లని ఎత్తుకుపోతుండటాన్ని చెప్పడానికి ప్రయత్నించా......మీకు కలిగిన అసౌకర్యానికి మన్నించండి...రాసేముందు ముందుగా ఎవరో రాసారేమోనని వెతికి రాయలేమ్ కదా....

    ReplyDelete
  6. వర్మ గారూ మీ కవిత చదివాను
    మొదటిది ఒక నడకగానీ, ఒక వ్యక్తీకరణ గానీ మనకు తెలియకుండానే మన చేతనంలోకి ప్రవేశించడం మామూలు విషయమే. ఒకోసారి ఆ కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఎత్తుగడతోనూ, నడకతోనూ, మరలా, మరలా అవే విషయాలు కవిత్వంలోకి కూడా చొరబడే అవకాశం కూడా ఉంటుంది.
    ఇది నడక, వ్యక్తీకరణల గురించి నాకు తెలిసిన విషయాలు.దీనితో పాటూగా నేను చెప్పదలుచుకున్న విషయం- ఎవరైనా ఇది ఎక్కడైనా చదివినట్టుగా ఉందని అన్నప్పుడు మనం కూడా ఈ విషయాలను తరచి చూచుకోవలి. అప్పుడే చాలా విషయాలు అర్ఠం అవుతాయి.
    రెండవది- చివరగా కవితలో మీరు చెప్పదలుచుకున్న విషయం వాచ్యంగా వివరిస్తే తప్ప నాకు అర్థం కాలేదు.-------నాగరాజు

    ReplyDelete
  7. ధన్యవాదాలు నాగరాజు గారు...మీ సూచనలు ఎరుకలో వుంచుకొంటాను....

    ReplyDelete
  8. యస్...ఇది ఖచ్చితంగా వర్మగారి ముద్రే

    ReplyDelete
  9. ఇక్కడో కుర్రాడు సైకిల్ చక్రం తిప్పుతూ
    పరిగెడుతుండేవాడు...
    ఎవరో బొమ్మగీసి ఎత్తుకు పోయినట్టున్నారు...

    చాలా బావుంది.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...