Thursday, January 31, 2013

'రెప్పల వంతెన' ఇప్పుడు కినిగెలో..



నా కవితా సంకలనం 'రెప్పల వంతెన' ఇప్పుడు కినిగె.కాం.లో లభ్యమవుతోంది.. అనిల్ అట్లూరి గారికి ధన్యవాదాలు.

 http://kinige.com/kbook.php?id=1450&name=Reppala+Vanthena

Friday, January 25, 2013

ఆకుపచ్చని ఆకాశం...

పారే సెలయేటి నవ్వునలా
మీరు దోసిట పట్టి
వెన్నెలలో తెలుపు నలుపుల
హోళీ ఆడుతూ…

వాడొక్కో అడుగూ
చదును చేస్తూ
ఆక్రమించుతూ
వ్యాపిస్తున్నాడు….

వింధ్య నుండి
నియాంగిరీ వరకూ
మహానది నుండి
బ్రహ్మపుత్ర వరకూ
కోటయ్య బాట వేసి పోయాడు…

ఆ మూల
నీవు చాపిన చేయి
అందుకుని ఈ చివురున
నేను ఓ జెండా పాతుతూ
సరిహద్దుల కీవల…

వాడు ఒక్కో నదినీ
పుక్కిట పట్టి
మెల్లగా వ్యాకోచిస్తున్నాడు…

అటూ ఇటూ
వాడికొక్కడే పచ్చగా
నవ్వుతూ తుళ్ళుతూ
చావు బంతిని విసురుగా
తంతూ ఆడుతూ కనిపిస్తున్నాడు…

బూడిద పూసుకొని
వాడు ఒక్కో భాగంగా
విడగొడుతూ సవాల్ జేయ వస్తున్నాడు…

రానీ!
ఇక్కడ క్లేమోర్లయి
గుండెనిండా నిబ్బరాన్ని శ్వాసించి
ఆకుపచ్చని ఆకాశాన్ని కప్పుకొని
నిలబడి చూస్తున్నాం….

(ఆపరేషన్ గ్రీన్ హంట్ దాడికి వ్యతిరేకంగా)
ఈ కవిత ఈరోజు విడుదలైన వాకిలి మేగజైన్లో వచ్చింది..

Sunday, January 20, 2013

కురవనీ...

 కురవనీ
ఈ దినమంతా నాపై దుఃఖపు వాన...

నీముందు మోకరిల్లినా కరగని
ఈ మంచు గడ్డ ఎదపై ఇలా కరిగి కురవనీ....

కురవనీ
కాలమంతా కరిగి ఓ అగ్ని పూల వానగా...

భగ భగ మండే ఎద తటాకంలో
కురిసీ నన్ను దహించనీ....

మనిషిగా మిగిల్చే నీ అమృతపు వాక్కు లేక
ఈ ఎడారి దారిలో దాహార్తితో మిగలనీ చివరి క్షణాలు....

నీ కంటి కొన జారిన నీటి బిందువే
నా గొంతున విషాద ధారగా కురవనీ...

బాధా తప్త నిప్పు కణికలు మరల మరల మండి
నీ చేతిలో బూడిదనై చెరిగిపోనీ....

నేనొక్కడిగా మిగల లేని అణువునై ఈ కాటి నేలపై
జ్వలించి దహించిపోయే ఆమ్లపాతం కురవనీ....

Friday, January 18, 2013

సుస్వాగతం...

నా మది తలపుల తలుపు తెరచి
స్వాగతిస్తున్నా...

కనురెప్పల వాకిలిలో
ముద్ద మందారమై విరబూయవా...

మంచు తెరలు కరిగి మల్లెల పరిమళమై
సన్నని విరజాజి తీగలా అల్లుకుపోవా...

నీ నడుము వంపున పారే
సెలయేరునై కరిగిపోనా,,,,

సఖీ
చెలీ
ప్రియా

నీ అలకల ఎర్ర గులాబీ రేకుపై
నా ఎద ఊసుల లేఖ రాయనా...

కను గీటున నీ మెడ వంపున చేరి
మరుజన్మ లేని వరమీయవా...


Wednesday, January 16, 2013

నిర్దయ ఏల??


నువ్వెప్పుడూ అలలా ఎగసి
ఎద తీరాన్ని తాకి అంతలోనే
మాయమౌతావు...

అక్కడక్కడా పూసుకున్న
పాల నురుగు వెచ్చదనం
నన్నిలా బతికిస్తూంది...

నీ చూపుల మెరుపు తాకిడి
మనసు మూలల దాగిన
నాలోలోపలి జ్వాలను రగిలించె...

నీ పెదవి చివరంటిన తడి
యుగాల దాహార్తిని
తీర్చే ఒయాసిస్సు కాదా...

తాకీ తాకేంతలోనే
ఓ గాలి తిమ్మెరలా
హృదయాన్ని మేల్కొలిపి
కనురెప్ప తెరచేంతలోనే
మరలిపోతావు...

ఇంత నిర్దయ ఏల??
ఈ మంచు దుప్పటి
ముసుగు కరగనీయవా
ప్రి


ఖీ...

Monday, January 14, 2013

రెప్పల వంతెన గూర్చి 'వాకిలి' పత్రికలో..


మూడేళ్లుగా ఎదురుచూస్తున్న కెక్యూబ్ వర్మ కవిత్వం మొత్తానికి ఇప్పుడు పుస్తక రూపం దాల్చింది. ఎప్పటినించో రాస్తున్న కవే అయినా, ఈ మూడేళ్లలో వర్మ తనదయిన గొంతు విప్పి, తన కవిత్వ వాక్యాల కింద వర్మ అని సంతకం అక్కర్లేకుండానే ‘ఇది వర్మ రాసిన వాక్యం’ అనే గుర్తింపు సాధించుకున్నాడు. వర్మ కవిత్వం చదువుతున్నప్పుడు వొక ఫైజ్ అహ్మద్ ఫైజ్ గుర్తొస్తాడు. వొక దార్విష్ గుర్తొస్తాడు. వొక నెరూడా మన మధ్యలోంచి నడిచి వెళ్తున్నాడనిపిస్తుంది. సున్నితమయిన ప్రేమనీ, కర్కశమయిన యుద్ధాన్ని రెండీటినీ గానం చేస్తున్న కవి వర్మ. అతని కవిత్వ సంపుటి ‘రెప్పల వంతెన’ కవిత్వ ప్రేమికులకు వొక ఈవెంట్! ఈ పుస్తకం కబుర్లు ఇవిగో!....

నా కవితా సంకలనం 'రెప్పల వంతెన' గురించి వెబ్ మేగజైన్ 'వాకిలి' లో ....

"రెప్పల వంతెన" ఆవిష్కరణ..

Saturday, January 5, 2013

మౌన శిల్పంగా

 ఋజువంటూ ఏం చూపగలను
నువ్వలా విసిరి కొడితే ఉబకని కన్నీటి సింధువుతప్ప..

ఒరిపిడికి గురయిన ఎద రక్త చారికలను
జేబు వెనకాల దాచలేని నిస్సహాయత...

పిలిచినా పలకని వేళ నా మది కుంగిన తీరు
ఆ కురవని మబ్బును తాకి చూడు ఒలికిపోతుంది నీ అరచేతిలో....

గాలి చుట్టూ పరచుకున్న నీ పరిమళం ఉక్కిరిబిక్కిరి చేస్తూ
నా చుట్టూ ఓ అగ్ని వలయాన్ని సృష్టిస్తూ
దహిస్తూ దాహమేస్తుంది ప్రియా...

నువు నవ్వని ఈ రాత్రి కునుకు రాని రెప్పల చివర కురుస్తున్న ధార
నీ ఎద చెంత చేరి నిను మేల్కొలపదా సఖీ...

కరిగిపోనీకు ఈ రేయి వెన్నెలను
నీ మౌన శిల్పంగా....
Related Posts Plugin for WordPress, Blogger...