Friday, March 30, 2012

జ్వరం...

ఏమైందో తనువుకు
నా అణువుకు
మనసుకు
ఆత్మకు
జ్వర జ్వలితమై
మండుతున్నది...

ఇది ఒట్టి దేహానికా
ఆత్మ కరవైన
మనసుకా...

నీవు లేని ఈ క్షణాలన్నీ
నన్ను నిప్పుల కొలిమిలో కాల్చుతున్నా...

ఏదో తెలియని
చేదుతనం నాలుకను అంటుతున్నా...

గుండె గది మూలల్లో దాగలేని
దాచలేని ఓ మూల్గు
తీ

గా...


Tuesday, March 27, 2012

వెలితినాన్న వున్నంత కాలం నా వయసు తెలీలేదు
ఇప్పుడు పెద్దవాణ్ణయ్యానన్నది జ్నప్తిలోకొచ్చింది...

తెల్లపంచె కట్టినప్పుడంతా
ఆయన నడకే గుర్తుకొస్తూ
ఆ వెలితి వెన్నాడుతూ
అద్దం ముందు నీడలా నేను...

ముంగిటిలో ఖాళీ అయిన
కుర్చీ నాన్నను గుర్తు చేస్తూ
వెనక్కూ ముందుకూ ఊగుతూ....

దీపం పెడుతూ అమ్మ నుదుటిన
విభూదిగా మిగిలిన బొట్టు
రంగు వెలిసి ముఖాన
వెలుతురు మాయం చేసింది...

అమ్మ ఇప్పుడు
ఒంటరి పక్షై రెక్కలు తెగినట్టు
కళ్ళలో కాంతి కోల్పోయి
మబ్బు పట్టిన ఆకాశమయ్యింది...

బాధ్యత కావిడిగా భుజానెక్కి
భారమైన వేళ...

Saturday, March 24, 2012

విముక్తి కోసం..నేనిక్కడ నవ్వుతూ నిలబడి వున్నానని
ఒకటే కంగారు వాడికి

కంచెను కూల్చి
దోచుకు పోదామన్నదే వాడి కల...

అబద్ధాన్ని పోస్టర్ జేసి
విరుచుకు పడుతున్నాడు....

నాకెదురుగా నిలబడిన
అధికార ప్రతిపక్షాల రంగు ఒకటే....

ఇప్పుడొకటే రాజకీయ ప్రకటన
విముక్తి కోసం...

Friday, March 23, 2012

ఇంక్విలాబ్ జిందాబాద్..మీరు వేలాడిన ఉరికొయ్యలు
నిజాన్ని మోయలేక విరిగిపడ్డాయి...

మీరిచ్చిన సంపూర్ణ స్వేచ్చా స్వాతంత్ర్యాల
పిలుపు యింకా బాకీ పడే వున్నాం...

మీ కలలన్నీ ఉరికొయ్యకు వేలాడగట్టి
వాడి కోటు చేతుల్లో దూరిన వీడి ద్రోహం సజీవంగానే వుంది...

సమాధుల దగ్గర నెత్తురంటిన చేతుల్తో
విసిరే పువ్వులు సగం కాలిన వాసనేస్తున్నాయి...

మీ పెదాలపై విరిసిన మీ చిర్నవ్వు
వాడి గొంతులో తూటా....

సంకెళ్ళతో ఒరిసిన మీ చేతి గాయం
యింకా సలపరమెడుతూనేవుంది...

ఒరిగిపోని మీ చేతిలోని
ఝెండా నేడు లక్షలాది చేతులు అందుకొన్నాయి...

కదం తొక్కుతూ మీరాలపించిన విముక్తి గీతం
పల్లవిస్తూనే వుంది...

భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్
అమరులైన మీ త్యాగం హిమాలయాల కంటే ఎత్తైనది...

ఇంక్విలాబ్ జిందాబాద్
ఒకే ఒక్క నినాదం...

Wednesday, March 21, 2012

ఆమెతో నేను...నీ భావాల పుష్పక విమానంలో పయనిస్తున్న
నేను ఈ లోకాన ఏకాకిగ యిలా ఒదిగివుండటాన్ని
నాకై నేను విధించుకున్న శిక్షకాక మరేమని
ప్రశ్నిస్తున్న అంతరంగం ఎదుట అపరాథిగా నిలబడి
నీ కోటి కాంతుల చూపుతో బంధ విముక్తిన్ని గావిస్తావని
ఈ శాపగ్రస్త శిలువపై నుండి విడివడని అరచేతులతో
ప్రార్థిస్తున్నానన్నది నీకు తెలిసినా
నీవున్న అచంచల స్థితినుండి గ్రహించినా
ఓ అందమైన అబద్ధంగా అద్దం ముందు
యిలా నన్ను నిలిపి వుంచావన్నది సత్యం కాదా...

గుడ్డులోంచి చిరు పక్షి బయటపడే
ఆనందమయ సందర్భంలాంటి వేకువ కోసం
నేను నిరంతరం ధ్యానిస్తున్నానన్నది
నీ కను రెప్పలకావల దాగివున్న కలల
వెలుగులో దృగ్గోచరమవుతూ
నీ హృదయ తంతృలాలపిస్తున్న
ఉదయ రాగ సంగీత ఝరిలో
వింటూ తొలగించలేని ముసుగులో...

నేస్తమయిన శుభ వేళనుండీ
నా మాటలో వినబడలేదా
నా గుండె నిజాయితీ....

రహస్య తంత్రుల గుండా
మన సంభాషణల మధ్య విస్తరిస్తున్న
సమ భావ దీప కాంతులు
పూయిస్తున్న ప్రేమ పుష్పాల పరిమళం
నీ సిగలో తురుముతూ
శ్వాసిస్తున్నానీ పరిమళం....

అనుమానపు మబ్బు తెరలు తొలగి
పున్నమి వెన్నెల కాంతులు పూచే క్షణం కోసం
ఆర్తిగా ఓ కన్నీటి చుక్క రాలుతూ..

Tuesday, March 20, 2012

టక్ టక్...టక్ టక్...నువ్ టక్ టక్ మంటూ కిటికీ అద్దంపై
శబ్ధిస్తూ నిద్రలేపే ఉదయం మాయమై
నేడు నా కలత నిద్ర సాగుతున్నది
మిత్రమా....

నీవంటూ మాయమవుతున్న
సమయాన మా చెవులు
చిల్లులు పడుతూ మోగుతున్న
సెల్ శబ్ధ కాలుష్యం నిన్ను
మాయం చేస్తూ
మాకు ఎడారి బీడును వాగ్ధానం చేస్తున్నది మరిచిపోతూ
కాల్పనిక లోకంలో బతుకుతున్నాం...

బాంధవ్య రాహిత్యాన్ని
గుర్తు చేస్తున్న
నీ రాలిపోతున్న ఈక
నా మెదటి గూటిలో
ఓ సజీవ సాక్ష్యం....

నువ్వు లేని సంక్రాంతి ముగ్గు
వర్ణం కోల్పోయి పాలిపోయింది...

నువ్వు ఎంగిలి పడని వరి కంకులు
రుచిని కోల్పోయి గడ్డిగా మిగిలాయి...

రా నేస్తం...
అని పిలవాలని వున్నా
చేస్తున్న ద్రోహం గొంతులో
పలకని నిశ్శబ్ధ పిలుపై
మూల్గుగా...


(నేడు పిచ్చుకల దినోత్సవం సందర్భంగా)

Sunday, March 18, 2012

ఎప్పుడో ఒకప్పుడు...ఎప్పుడో ఒకప్పుడు

విరిగిపోవాల్సినవే అన్నీ...

ఎప్పుడో ఒకప్పుడు
కూలిపోవాల్సినవే అన్నీ....

ఎప్పుడో ఒకప్పుడు
కరిగిపోవల్సినవే అన్నీ...

ఎప్పుడో ఒకప్పుడు
నలిగిపోవాల్సినవే అన్నీ...

ఎప్పుడో ఒకప్పుడు
బద్ధలు కావాల్సినవే అన్నీ...

ఎప్పుడో ఒకప్పుడు
రాలిపోవాల్సినవే అన్నీ....

ఎప్పుడో ఒకప్పుడు
బూడిదైపోవాల్సినవే అన్నీ...

ఎప్పుడో ఒకప్పుడు
ఐక్యం కావాల్సినవే అన్నీ...

Tuesday, March 13, 2012

ఎదను ప్రమిదను చేసి...ఔనంటే కాదంటావు...
ఏమన్నా తప్పంటావు!

ఇంకేం చెప్పను??
ఎలా చెప్పను??

చీకటి నీడలో ఒంటరిని చేసిన
నెలవంక వెనకాల నడకనై..

కనురెప్పల వంతెనకింద
నల్ల రేఖనై కరిగిపోయా...

ప్రమిద క్రింద దాగిన నీడనై
నీ వెలుగు కొరకై....

ఉబికే కన్నీళ్ళను ఉగ్గబెట్టి
నెత్తురు చిమ్మిన ఎదను
ప్రమిదగా చేసి ఇలా మిగిలా....

నీ కంటి వెలుగుతో
వెలిగిస్తావో శపిస్తావో...

ఏమనను?
ఏమైపోను??

Sunday, March 11, 2012

ఆర్తి...
ఇప్పుడో చినుకు రాలితే బాగుండు!

ఎర్రగా కాలిన పెనంలాంటి
దేహంపై జిల్లుమంటూ...

ఇప్పుడో గాలి తిమ్మెర వీస్తే బాగుండు!
ఆరిపోతున్న
ప్రాణం లేచి వచ్చేట్టు....

ఇప్పుడో కోయిల కూస్తే బాగుండు!
రొద పెడుతున్న చెవులలో
తీయని గొంతులా...

ఇప్పుడో కరచాలనం కోసం ఆర్తిగా!
దేహమంత చేతులతో
ఎదురుచూపు...

ఇప్పుడో పలుకరింపు కోసం వెర్రిగా!
మనసున మంచుపూలు
పూచేలా...

Saturday, March 10, 2012

ట్రిగ్గర్వాడు
అడవిలోలోపల చొరబడ్తున్నాడు...
అడవితల్లిని చెరబట్టజూస్తున్నాడు...

పుట్టకొకరిని చేసి ఏరివేయాలని
ముందుకు దూసుకు వస్తున్నాడు....

యుగాలుగా దాగిన మూలుగులను
పీల్చి పిప్పిచేయడానికి
వేగంగా వేగ వేగంగా జొరబడుతున్నాడు...

వడి వడిగా మరఫిరంగులు గురిపెడుతూ
ఆబగా ఆకాశంనుండి చూస్తూ
ఆకుపచ్చ చందమామను వేటాడచూస్తున్నాడు

చేతిలో శిలకోలకు పదును పెడుతూ
నేనిక్కడ ఆంబుష్ లో కూచున్నా...

కర కరమని ఆకు సవ్వడి చేస్తూ...
కిచ కిచమని కోతిపిల్ల వాడి రాకను చూపుతోంది....

ఇప్పుడు అమ్మ గురించి ఆలోచిస్తే
వాడు అమ్మ స్తన్యాన్నే అమ్మజూస్తున్న వాడు....

ట్రిగ్గర్ పై వేలుబిగుసుకుంది..........

Wednesday, March 7, 2012

ఆకుపచ్చ చందమామవాడి కిరాయి తుపాకీకెప్పుడూ
ఒకటే ధ్యాస
త్వరగా చంపి కళ్ళపై బియ్యం ఏరుకుందామని...

మాదొకటే ఆశ!
ఈ లేలేత పసి ప్రాణం
పచ్చగా ఎదగాలని
పచ్చదనం నిండుగా పరచుకోవాలని
నవ్వుల వెన్నెలలు విరబూయాలని...

Monday, March 5, 2012

తెల్లవారిపోయింది...ఈ రాతిరి సందమామను
చంకనేసుకు తిరిగొద్దామని
లేచా....

అందినట్టే అంది
మబ్బుల గొంగళిలోంచి జారి
ఆమె మోములో చేరిపోయాడు...

తెల్లవారిపోయింది....

Sunday, March 4, 2012

ఊహల అలలపైనీ ఊహల అలలపై పాలనురుగునై
నేను తేలియాడుతున్నా...

నీ మాటల వారధిగా కన్నీటి కడలిని
ఒంటి చేత్తో ఈదేస్తూన్నా...

నీ స్నేహ పరిమళంతో
నిండిన నా జగత్తును
అపురూపంగా సృష్టించుకున్నా...

నీ పలకరింపు కరవైన వేళ
పాతాళంలోకి నెట్టి వేయబడ్డట్టు
ఓ నిరామయ స్థితికి లోనవుతూ...

పో...రా అంటూ
నువ్వు ఆప్యాయంగా పలికిన
మాట నా తలపై అమ్మ చేయివేసి
నిమిరినట్టు కళ్ళలో సన్నని పొర...

మాటల యుద్ధం మద్యలో
ఓ అమృతపు జల్లులా
ఒరేయ్!
భద్రంరా.. అన్న మాట
నన్ను నిలబెడుతోంది నేస్తం...

పరాయితనం లేని మన మధ్య
ఏ అనుమానపు సుడిగాలీ సోకకూడదని
నా నిరంతర తృష్ణ....

Saturday, March 3, 2012

తలపుల తేరులలో...


నీ ఆలోచనల దారాలలో ఒక్కో పోగుకూ
మన జ్ఞాపకాల పరిమళాన్ని అద్దుతూ..

ఓ చిత్రాన్ని ఆవిష్కరిస్తూ ఒంటరితనాన్ని కోల్పోతూ
భారమౌతూ.... తేలికౌతూ...

నీ తలపుల తేరులలో
తేలియాడుతూ...
Related Posts Plugin for WordPress, Blogger...