Monday, December 31, 2012

వీడ్కోలు...

ప్రతి నిత్యం పొడిచే పొద్దుకి
తారీఖునద్దలేను..

ప్రతి రోజూ కుంగే పొద్దుకి
సమయమద్దలేను...

అనునిత్యం కుంగిపోయే
నెలవంకకు క్షణాలనర్పించలేను...

దిన దినమూ ప్రజ్వరిల్లే
వెన్నెలకు కాలాన్నందివ్వలేను...

నిస్సహాయతను
నెగ్గలేని నన్ను ముద్దిడే
నిన్ను వదులుకోనూలేను...

ప్రియసఖీ
వీడి వంక చూడకు...


(సారీ Nanda Kishore)

Sunday, December 30, 2012

పరవశం..

ఒక్క సారిగా యింత కాంతి
కళ్ళు రెండూ చీకట్లు కమ్మినట్టు...

ఓ అల ఏదో ముఖంపై చరిచి
అలసట మాయం చేసినట్టు...

దేహమంతా గులాబీ రేకుల
పరిమళం పూసినట్టు...

ఏదో మత్తు మెదడంతా
ఆవరించి నడకమరిచినట్టు...

ఎక్కడివక్కడ శిలలా
ఆగి పోయి నేనొక్కడినే మిగిలినట్టు...

నీ వేలి చివర మండుతున్న మర్మం
ఏదో లోలోపలకి దూసుకుపోయినట్టు...

నువ్వొచ్చావన్న స్పృహ లోకి
యిప్పుడిప్పుడే వస్తున్నా....

Saturday, December 29, 2012

కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మా...నీవు చనిపోయావన్న వార్త నాలో బాధ కలిగించలేదు...

బతికుండీ నిత్యం చచ్చే కన్నా ఇదే నయం...

నీ చావు నాలో దుఃఖాగ్రహాన్ని రగిలించింది...

నిత్యం జరుగుతున్న ఈ రాక్షస క్రీడ నీ చావుతో అంతం కాలేదు...

వార్త కాని నట్టింట్లో జరుగుతున్న మానభంగాలెన్నో...

ఎదుగుతున్న బాల్యంపై జరుగుతున్న దాడులెన్నో...

అది గృహమో, స్కూలో, కార్ఖానో, కార్యాలయమో ఏదైనా...

ఓట్ల తాబేదార్లు నీ అత్యాచారాన్ని కూడా మొసలి కన్నీరుతో సరుకుగా మాయజేస్తున్నారు...

స్త్రీత్వాన్ని సరుకు చేసిన్నాడే నడి రోడ్డుపై వీళ్ళ నిర్లజ్జతనం బయల్పడింది...

కాట్ వాక్ ల వెంట చొంగ కార్చే వారంతా ఈరోజు కన్నీరొలకబోస్తున్నారు...

ఈ గ్లిజరిన్ కన్నీళ్ళు మాకొద్దు....

కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మా...

కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మా...

Wednesday, December 26, 2012

కళ్ళే...

ఇప్పుడు కళ్ళే శిశ్నాలుగా
తిరుగుతున్నాడు వీడు..

మృగాడు అని రాయొద్దు..
పాపం అమాయక జంతువులేం చేసాయి..

యుగాలైనా మారని వీడు
తల్లిని కూడా వాంచతో ఎక్స్ రే తీస్తాడు..

మాంసం ముద్దలుంటే చాలు వీడి కళ్ళకి
చొచ్చుకు పోతాడు...

కడుపునిండా కోరిక నిండిన వీడికి
ఆ కళ్ళను పెరికేయడమొక్కటే సరైనది...

Tuesday, December 18, 2012

పాత వాసన..

 
ఇప్పుడంతా ఏదో పాత వాసన వెంటాడుతోంది..

చీకటి మిగిలిన గదిలోకి తొంగిచూసే ఓ లేలేత చిగురుతావి...

పైన పూసిన వెండి రేకలాంటి వెలుగు కోసం ఆత్రంగా...

వసివాడని పసితనపు స్పర్శకోసం వెదుకులాట...

పక్షి ఈక ఒకటి ఎగురుతూ వచ్చి తాకిన అనుభూతి...

చనుబాల ధార ఏదో లోలోపల ఇంకినట్టు...

Sunday, December 16, 2012

దేహాకాశం

 ఒక్కో రాతిరి మంచుతనంతో
శిల్పమౌతూ కరిగిపోతూ...

గుండె లోపల గని ఏదో
తవ్వుకుపోయినట్టు వెలితిగా...

దూరం దూరంగా వెలుగుతు
ఆరుతున్న వీధి దీపంలా...

మసక బారిన వెన్నెలతో
దేహాకాశం చిన్నబోతూ...

సంధ్యవేళ గుంపునుండి వేరై
ఒంటరైన పక్షిలా ఎగురుతూ...

బాట పక్కనే పెళ పెళమంటూ
ఎగసిపడుతున్న చితి మంటలా...

సొరంగమేదో తవ్వబడని
జైలు గదిలా...

నీరెండిన దిగులు బావిలా
దాహ తీరంలో...

భుజంపై ఒంటరితనం
చిరుగుల దుప్పటిలా వేలాడుతూ...

Friday, December 7, 2012

దేహ పర్వతం..


 
దేహమంతా కప్పుకున్న తోలు దుప్పటి తెలుపో నలుపో
లోలోన కాగుతున్న నెత్తురు ఎరుపుదనం ఉడుకుతూ...

కాసింత విశ్రమించే క్షణం లేక కనురెప్పల కత్తిరింపుతో
ఆగిన కాలానికి యింక సెలవిస్తూ...

పరచుకున్న అక్షరాలు అగ్ని శిఖల చివర వెలుగుతూ
కాగితం కమురుదనాన్ని పరచుకుంటూ మాయమౌతున్న ముఖం...

ఓ అబ్ స్ట్రాక్ట్ రేఖా చిత్రంలా కలవని వలయాల మధ్య
నుదుట మీది గీతలు ఏకమవుతూ సుషుప్తిలోకి జారుకుంటూ...

సగం మెలకువలో కదలని దేహ పర్వతం
శ్వాశ కోతకు గురవుతూ తరుగుతూ...

Related Posts Plugin for WordPress, Blogger...