Friday, June 29, 2012

కరకుదనం....

అలా కూచున్న చోటనే
చెదలు పడుతున్నా కదలనితనం...

నిప్పులు కురిపిస్తున్న ఎండ పట్టినా
దాటు దాటనితనం...

కుంభవృష్టిగా వాన కురిసినా
చెక్కు చెదరనితనం....

గడ్డ కట్టుతున్న చలిపులి వణికిస్తున్నా
కాలు కదపనితనం...

ఏదో వెంటాడుతూ
మనసంతా అలికిడిలేనితనం...

నన్ను నేను ఆవిష్కరించుకోలేక
మూగబట్టినతనం...

అవును ఇది
గుండె అంచుల కరకుదనం...

మైలు రాయి విరిగిన చోట
ఆగిన పయనం...

ఈ నాచు పట్టినదనం
విదిల్చే నీటి బిందువుపై
ఓ నీరెండ ప్రతిఫలిస్తే???

కలుపుకు పో!!!


అప్పుడే లాలించే తల్లిలా దగ్గరకు తీసుకుంటావు
అంతలోనే అలా విదిలించి వదిలేస్తావు....
అప్పటికప్పుడే కరిగిపోయె మనసుతో మరులొలికిస్తావు
ఇంతలోనే మునిలా ముడుచుకుపోతావు....

రా!!! రమ్మని రాగ దీపం వెలిగిస్తావు
వచ్చేలోపే మూడో కన్ను తెరుస్తావు....
అయినా పాలనురుగులాంటి నీ మనసు నాకు తెలీదా
ఆప్యాయతానురాగాల వెల్లువ కనబడనీయకుండా దాచే
నీ విఫలయత్నం నవ్వులు విరిసే నీ కన్నులు దాయలేవు కదా!!!

ప్రియా!!! నీవు మౌనమైన క్షణాలన్నీ నా మృత ఫలకాలే....
అవి నా సమాధి పై పేర్చబడుతున్న రాళ్ళే కదా!!!
గల గల పారే గోదావరి ఉరవడిలో నన్ను కలుపుకు పో
ఈ వరమొక్కటివ్వు చాలు నాకు....
ఆజన్మాంతం నీ పాదాక్రాంతుడినై వుంటా!!!

Tuesday, June 26, 2012

ఒంటరిగా......

అలా ఒంటరిగా చిగురున ఖాళీగా ఊసులూ వినబడనంత దూరంలో...

రిక్త హస్తాలతో గాలి అటూ ఇటూ గుండె ఐమూలలనుండి దూసుకుపోతూ ఒకటే గాలి ఊళ...

రంగూ రుచీ వాసనా అంటనితనమేదో కళ్ళముందు తెల్ల తెల్లగా రెప రెపలాడుతూ...

సర్రున పలుచని కత్తి ఏదో దూసుకుపోతున్నా ఏమీ కానట్టు మౌనంగా చేతులు బార్లా చాపి అలా ఒరిగి వుండి ఎన్నాళ్ళయిందో...

మనసంతా ఏదో సున్నం పూసినట్టు తెల్లగా మారిపోయి పెళుసులుగా ఊడి పడినా విరగనితనమేదో అద్దుకుని నిలబడినట్టు...

ఇలా ఈవల వచ్చి నిలబడు దేహమంతా ఏమీ పూసుకోకుండా ఎక్కుపెట్టిన బాణం దూసుకుపోయాక సర్ వెనక్కి వంగుతూ నిలబడ్డ విల్లులా ఒక్కమారు...

కాలం బిగ్ బెన్ లో కాలి కరగనీ ఒక్కో ముల్లూ పెళ్ళున విరిగి కలసిపోయి ఊడిబడ్డట్టు...

ప్రవాహాలన్నీ గడ్డ కట్టి కాలికింద చల్లగా మారి ఏవో సుదూర తీరాలకు గబగబా జారిపోతున్నట్టు...

పర్వతాలన్నీ తవ్విపోసి సొరంగ మార్గాలన్నీ తెరవబడ్డట్టు....

పెనవేసుకున్న వృక్షాలన్నీ పట పట విరిగి పోతూ వేళ్ళన్నీ పెకళించి తలకిందులుగా మారి నేల పురుడు పోసుకున్నట్టు...

ఆకాశంలో చుక్కలన్నీ ఆత్మహత్య చేసుకొని కింద నుండి పైకి వేలాడుతున్నట్టు...

అంతా అయోమయమైన వేళ ఒక్కడ్నే ఇలా గాలి ఈల వేస్తూ...

ఎదురుగా వున్న బండరాయిని ఒక్క కాలితోపుతో తోసి హాయిగా రెక్కలు మొలిచిన సీతాకోక చిలుకలా ఎగురుకుంటూ...

నదిలో స్నానమాడుతూ నూలుపోగులతో జెండా ఎగరేస్తూ....

పొలికేక పెడుతూ....

కలల ప్రమిదలో....

ఆరిపోతున్న దీపాన్ని
ఆశల చమురు పోసి
కలల ప్రమిదలో వెలిగించిన
నీకు కృతజ్ఞతలు
చెప్పి చిన్నబుచ్చలేను కదా!

ఎడారిలా మారిన నా హృదయాన్ని
అందమైన జీవనయానం
వైపు మళ్ళించి ఎన్నడో
తెగిపోయిన
నా కలల గాలిపటాన్ని
చేతికి అందించిన నీకెలా చెప్పను
నాకు నీ పేరే మంత్ర పుష్పమైందని....

ప్రియా..... నీ రూపం
నా కనుల దీపం కదా..

Friday, June 22, 2012

తలపుల టపా..

నీ కనురెప్పల వాకిట వాలిన
నా తలపుల టపా....
ఒక్కసారి తలపుల తలుపులు
తెరిచి చూడవా ప్రియా....

నీ ఊపిరి వేడి సోకని వేళ
నా దేహమంతా లావా పొంగి పొర్లినా
హిమాలయాలమల్లే చల్లబడుతుంది కదా....

మత్తుజల్లీ మరులొలికే
మమతానురాగాల జాజిమాల్లి తీగలా
అల్లుకు పోయే నీవు
దూరమైన వేళ
స్వర్గారోహణమైనా
నరకప్రాయమే కదా....

నీ అధరాల ఎరుపుదనమద్దిన
పడమటి సంధ్య....
వెన్నెల రాకతో మరులు గొలుపుతూ
ఆహ్వానం పలుకుతూ....
బిగి కౌగిట బందీ చేసి
ఏదో మిగిలి వున్న ఋణాన్నితీర్చుకుంటూ
సిగ్గు దొంతరైంది ఆకాశం.....

Thursday, June 21, 2012

కరచాలనం...


రెండు అరచేతుల కలయికేనా
కాదిది
రెండు హృదయాల చేరువ...

ఒకరికొకరి స్పందనను
ఎదలోతుల్లోకి కొనిపోయి
కళ్ళలో కాంతులు పూన్చి
చిరునవ్వుల వెన్నెలలు విరిసే
ఆ క్షణాలు
మరపురాని హృదయాలింగనాలు...

అలా రెండు చేతులు తాకగానే
జర జరా రక్త నాళాలగుండా
ఓ విద్యుత్తు ప్రసారమై
ఏనాటివో తీపి గురుతులను
మేల్కొలిపి కనుల ముందు
వెండి తెరపై చిత్రంలా పరచుకుంటాయి...

గట్టిగా వత్తిన స్పర్శతో
అంతరాళంలో అలముకున్న
అనుమానాపు పొరలు తొలగి
ఒక్కసారిగా అలాయి బలాయి
చెప్పుకుంటాయి....

అంధునికైనా కరచాలనం
నీ రూపును
నీ మనసును
చూపుతుంది కదా....

మిత్రమా!
తొడుగులన్నీ తొలగించి
ఎదనిండా స్నేహాన్ని ఊపిరి చేసుకొని
తొలకరి చినుకులా నవ్వుతూ
ఒక్కసారి చేయికలుపుమా...
(నేడు కరచాలనా దినోత్సవం సందర్భంగా)

Tuesday, June 19, 2012

ఎవరికి వారే...


ఇప్పుడెందుకో నడుస్తున్న ప్రతివాడూ
ఒక్కో జెండాలా కనబడుతున్నాడు...

ఎవరికి వారే ఓ సమూహంలో
చిక్కుకుపోయినట్టు...

ఎవరికి వారే చేతులూపుతూ
పగ్గాలు బిగించి పరుగెడుతున్నట్టు...

ఎవరికి వారే తమలో తామే
ఏదో దీర్ఘ ఉపన్యాసమిస్తున్నట్టు....

ఎవరికి వారే ఒక్కొక్కరుగా
ఆయుధమై నీడతో యుద్ధం చేస్తున్నట్టు...

ఎవరికి వారే గుంపుగా పోగై
ఒక్కొక్కరుగా కుప్పబడినట్టు...

ఎవరికి వారే రెక్కలు పూన్చి
గోడలు పగులగొట్టి ఎగురుతున్నట్టు...

ఎవరికి వారే తమలోలోపల్లోకి
తుపాకీ పేల్చుకొని హత్యగావింపబడ్డట్టు....

Monday, June 18, 2012

ముసురు...


ముసురు పట్టిన మేఘం
ఒకటే ధారగా కురుస్తోంది
అదే పనిగా...

ఎక్కడా పూర్తిగా కప్పలేనితనంతో
వెన్నుపైనుండి ధారగా
నడి సంద్రంలోలా
కురుస్తూనే వుంది లోలోపల...

యింట్లో పొయ్యిలో
మూడు రోజులుగా బూడిద
తియ్యక పాలిపోయిన గోడలు...

ఎటూ తడవకుండా మిగలని
కట్టెలను చూస్తూ కన్నీరుతో
మరింతగా తడుస్తూ...

ఉట్టిలో మిగిలిన చద్దన్నం
చివరి ముద్ద చిన్నది తిని
మరొకటి కోసం గోరపిట్టలా
నోరు తెరవగా గుండె వరదైంది...

గూటిలోని దీపం అడుగంటిన నూనె
చినుకుతో ఆరిపోతూ
చీకటిని కప్పుకుంటూ...

జ్వరం వచ్చిన అవ్వ
మూలుగుతూ మెరుస్తున్న
మెరుపులో తెల్లగా చినికిన
గుడ్డ పీలికలా మంచంలో...

నుదుటిపై చెరిగిపోతున్న
బొట్టును దిద్దుకుంటూ మూలన
ముసురుపట్టిన దేహంతో గుమ్మానికి
వంకీలా అతుక్కుపోయిన ఆమె...

చిల్లిగవ్వలేనితనం వెక్కిరిస్తూ
మెలితిప్పుతున్న పేగులను
మోకాలితో ముడుచుకుంటూ
తొక్కిపట్టి బిగబట్టిన గొంతు...

ఆకాశమంతా హరివిల్లు పరచుకుంటూ!
నా నెత్తిపై ఒక్కో చినుకు
టిక్ టిక్ మని పడుతూ శబ్ధలాస్యంతో వెక్కిరిస్తూ...

Sunday, June 17, 2012

నాన్న...


నాన్నా!
ఆ పిలుపులోనే
ఓ ఆలంబన దాగుంది కదా...

జీవితపుటెడారిలో
ఎప్పుడూ
తను ఓ ఒయాసిస్సు...

నీ గెలుపువోటములను
గుండెల్లో
పదిలపరచుకునే
ఓ జీవన మాధుర్య భాండాగారం...

ఆతని చేయెప్పుడూ
నిరంతరమూ
ఆశీర్వచనం కాదా...

రెక్కలు వచ్చిన పిల్లను
వదిలి పక్షి వుండగలదేమో
కానీ
తనంత ఎదిగిన పిల్లలను కూడా
యింకా తన బాహువులలో
బంధించాలన్న తన తహతహ తీరనివాడు...

ఎగిరి వెళ్ళి ఆవల తీరాన చేరిన
వాళ్ళనింకా ఆశగా తన చివరాఖరి
ఊపిరి దాకా ఎదురుచూసే ఆశావాది...

తండ్రీ నీకు వేన వేల వందనాలు...

Friday, June 15, 2012

కలలయామినిలో..


నిన్ను మరిచిందెప్పుడు ప్రియా?

సుషుప్తిలో కనురెప్పలకావల
స్వప్న సాగరంలో కలల
అలల సహపయనం...

జాగృతిలో ఉఛ్వాశ నిశ్వాశల
జుగల్బందీలో
నీ ఊహల పంజరంలో
బంధీని కానా?

ఓ రహస్యం చెప్పనా!
చెవిలో గుస గుసగా
గుండెకు చేరువుగా
మనసుకు మక్కువగా...

అదే నీవెరిగినదే
మరొక్క సారి
ఇలా...

అలా పావురం
రెక్కల అలికిడిలా
మృధువుగా...

నెమలీకతో
నిమిరినట్టుగా
హాయిగొలిపేలా....

తేనె రంగు కనులపై
ఓ తీయని చుంబనంలా...

కలువ రేకుల
మెరుపుదనం
కనురెప్పలకద్దినట్టుగా
...

చేతికందిన
వెన్నెల చల్లదనం
చెక్కిలిపై పూసినట్టుగా...

ఎప్పుడైనా ఇదే మాట కదా..
నువ్వే
నా నువ్వే!!!

Tuesday, June 12, 2012

పచ్చదనం..


బూడిదనింత దోసిట్లో తీసుకొని
ఇలా ఈ చెట్ల మధ్య చల్లుతూ
తిరుగుతున్నా...

ఏవో వెలుతురు పిట్టల గానంతో
చుట్టూరా ప్రకాశమై
మోడువారిన చెట్లన్నీ చిగురిస్తూ
ఆకాశమంతా బంగరు రంగు
అద్దినట్లు కాంతివంతమయింది...

ఇదెవరిదో వృక్ష ప్రేమికుడిదిలా వుంది!
చేతుల్నిండా పచ్చదనం అంటుకుంది...

Saturday, June 9, 2012

సామూహిక నెత్తుటి పాట..ఇక్కడేదో
ఓ సామూహిక గానాన్ని
ఆలపించి వదలివెళ్ళిన
గురుతులు...

ఇసుక మట్టిలో
ఎర్రగా మిగిలిన
నెత్తుటి చుక్కలు...

గాయకుడెవరో
నాభిని చీల్చుకొని
తన ఆదిమ సంగీతాన్ని
ఆలపించినట్టున్నాడు...

ఏదో కనుగుడ్డు
ఓ అసంపూర్ణ వర్ణ
చిత్రాన్ని దర్శించి
చిట్లినట్టుంది...

గాలి ఏదో
ధూళి మేఘాన్ని
మోసుకొచ్చి ఇక్కడ
కూలబడినట్టుంది...

దుఖమొక్కటే
చివరి సంతకమైనట్టు
ఏదో చిందర వందరగ
అటూ ఇటూ
చెల్లాచెదురు చేస్తూ....

గుండె పగిలి
పొగిలి పొగిలి
ఏడ్చినట్టు
ఆకురాలిన చోట
చిట్లిన నేల...

విరిగిన వేణువు
స్రవిస్తున్న
నెత్తుటి పాటనెవరో
దోసిలి పట్టి
గొంతులో
నింపుకు పోయినట్టున్నారు..

(సాల్వడార్ డాలీ పెయింటింగ్ వాడుకున్నందుకు క్షమాపణలతో)

Monday, June 4, 2012

నేల రాలిన పూలు..నేల రాలిన పూలని
ఏరుకొని జేబులో వేసుకున్నా...

ఎవరి సిగలోంచో జారిపడ్డట్టున్నాయి
కాస్తా తల నూనె కలగలపిన
పరిమళం చేతికంటుతూ...

గాలికెగురుకుంటూ వచ్చిన
కాగితపు ముక్కని
ఆప్యాయంగా చేతుల్లోకి
తీసుకున్నా..

ఎవరో తన ప్రేయసికో అమ్మకో
రాసిన ఉత్తరంలా వుంది...
చివరిగా
నీవు నా కంట్లో వెలుగువి
అన్న మాటలే కనబడి
రెప్పలొక్కసారిగా
మూతబడి తెరుచుకున్నాయి...

దారిపక్కన దాహంతో
ఇంతలా నాలిక చాపుకుంటూ
కుక్క పిల్ల
చేతుల్లోకి తీసుకున్నా...

రూపాయి వాటర్ పేకెట్
కొని నా గొంతులో ఇన్ని
చుక్కలు పోసుకొని
దాని నోట్లో యింత తడిపా
కు(య్ కు(య్ మంటూ
మారాం చేస్తూ
నడిచినంత మేరా వెంటబడుతోంది...

దూరంగా వీధి లైటు వెలుగుతున్నా
వేడి తగ్గని సాయంత్రం
చాయ్ తాగి కూచుందామంటే
కాలుతున్న కుర్చీ ఫ్రేము
సెగలు కక్కుతున్న
దుఖానపు గీతలు పడ్డ మసి గోడలు
అంతా ఆబ్ స్ట్రాక్ట్ చిత్రంలా
కళ్ళముందు...

ఒక్కొక్కటిగా బయల్దేరిన
కాకులన్నీ గుంపుగా
మళ్ళీ తూరుపు వైపుగా
పయనమవుతూ
ఎందుకో సాయంత్రపు
నిశ్శబ్ధాన్ని జోకొడుతున్నట్టున్నాయి...

వీధి మలుపులో
ఎవరో ఆగి
వేచి చూస్తున్నట్టున్నారు
పడమటి సంధ్యలోని
వెలుగు కోసం...

Saturday, June 2, 2012

తలుపు ఆవల..ఎవరో తలుపు తీసిన అలికిడి!

ఒక్కసారిగా..
గదినిండా పరచుకున్న వెలుగు

కళ్ళు నులిమి చూస్తే కాని
చూడలేక పోయినంత...

ఉదయమే యింత
కాంతిని నింపిన దయాళువెవరో??

సవ్వడిలేని అడుగులతో
గుండె గదినిండా అలజడి..

నిర్వికల్ప సమాధి నుండి
చేయి పట్టుకు లేపిన దెవ్వరో??

తలుపుల కిర్రు సవ్వడింకా
చెవులలో...

కాంతిపుంజపు వెలుగు
కనులలో...

పసుపు ఆకు పరిమళం
దేహమంతా....

ద్వారం బయట
తను...

నిశ్శబ్ధంగా
అలల
కల్లోలంలో
నాలో
నేను....
Related Posts Plugin for WordPress, Blogger...