Sunday, July 26, 2009

తల్లిద౦డ్రులకు నమస్కారం

నేను కేర్మన్నంతనే
నా గొంతులో అమృతపు
చుక్కలు పోసి
పొత్తిళ్ళలో సేదదీర్చిన
నిన్ను ఎలా మరువగలనమ్మా
నీ వేలి చివరి ఆసరాతో
నీ అడుగులో అడుగునై
నేర్చానీ నడక
అమ్మా అన్న బీజాక్షరాలలోంచే
భాష నేర్చుకొన్నాను
నీ లాలిపాటలలోని
కరుణామయ పల్లవులే
నాకవిత్వం!

తండ్రీ నీ కష్టానికి ప్రతిరూపమే
యీ దేహం
నీ కనురెప్పల మాటున
రూపొందిన నా భవిష్యత్
చిత్రపటం నీకే అంకితం

మడమ తిప్పని నీ సాహస పోరాట
తత్త్వం మమ్మల్ని వెన్నంటి
ఉంటోంది

మీ పేగు ఋణం జన్మకు
తీరేనా?

(పేరెంట్స్ డే సందర్భంగా)

Thursday, July 23, 2009

తొలకరి - ఉభాలు


వేసవన్నాల్లు కుత కుత ఉడికిన మట్టి
తొలకరి చినుకులు కురవగానే
వెదజల్లే
పరిమళం
ముక్కు
పుటాలను తాకగానే
నాలోని ఆదిమ తత్వం ఒక్కసారిగా మేల్కొని
నన్ను ఆనంద సాగరంలో ముంచెత్తుతుంది

వానజల్లుతో
పులకరించిన పుడమి తల్లి
ఏరువాక
సాగగానే
ఒడలంతా గుల్లబారి
తనలోకి వంగడపు విత్తనాన్ని
ఆహ్వానించి చిగురువేసే దృశ్యం
ప్రకృతంతా పచ్చని
పున్నమి
వెన్నెలాకాశం!

Tuesday, July 14, 2009

స్పేస్ ఫర్ కమ్యూనికేషన్


జీవితం ఎం. . ఫారంలోని
స్పేస్ ఫర్ కమ్యూనికేషనంత
కుదించుకుపోవడం
ఎంత విషాదమోగదా!
చిన్ని జాగాలోనే క్షేమ సమాచారాలు
పలకరించుకోవడాలు
చేసేంత మరుగుజ్జుతనం
ఎంత దౌర్భాగ్యం!

ఒకరినొకరు హృదయం విప్పి
పలకరించుకోలేనితనం
ప్రతిమాటకు ఏదోకనబడని
తెర అడ్డుపడుతుండడం
అంతా సవ్యంగా సాగిపోతుందని
అనుకోలేని వెన్నాడుతున్న
పిరికితనం
కనుచూపుమేరా చూసిన దృశ్యం
కంటివెనకాల అదృశ్యం
అంటీ ముట్టనట్టు కరచాలనం!

ఎందుకింత అబద్దం
రాజ్యమేలుతోంది!
మంచుతెర కమ్ముకుంటూ
గుండె కవాటాలను
బిగదీస్తోంది!!

Wednesday, July 8, 2009

ఎప్పుడైనా?

ఎప్పుడైనా గొంతులోంచి బిగ్గరగా అరిచి నీ ఎదురుగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించావా?
ఎప్పుడైనా నీవు ప్రయాణిస్తున్న పడవ ఆవలి ఒడ్డుకు చేరేలోపు సుడిలో చిక్కుకుందా?
ఎప్పుడైనా నీవు నదిలో దిగినపుడు నీ కాలికింద ఇసుక కోతకు గురై పీకల్లోతు నీటిలో మునిగి బయటపడ్డావ?
ఎప్పుడైనా మీ ఇల్లు తగలబడి కట్టుబట్టలతో మిగిలి మళ్ళి మొదలయ్యావా?
ఎప్పుడైనా గాలికి నీ ఇంటి పైకప్పు ఎగిరి, గోడలు కూలి ధారాపాతంగా కురుస్తున్న ముసురులో మూడురోజులు పస్తులున్నావా?
ఎప్పుడైనా సకాలంలో వర్షం కురవక ప౦టకొచ్చిన పొలం ఎండి పోయి ఏడాదంతా ఏమి చేయాలో పాలుపోని స్థితికి లోనయ్యావా?
ఎప్పుడైనా చేతిలో చిల్లిగవ్వ లేకుండా కడుపులో పేగులు ఉండ చుట్టుకొని నొప్పితో బాధ పడ్డావా?
ఎప్పుడైనా నీ ఇంట్లోకి చొరబడి నీ నుదుటిపై తుపాకీ గురిపెట్టబడి౦దా?
ఎప్పుడైనా నీ వీధిలో తుపాకి కాల్పుల హోరు వినబడిందా?
ఎప్పుడైనా అకారణంగా నీ పెడ రెక్కలు వెనక్కి విరిచికట్టి నీ డొక్కలో గుద్ది నీ మెడపై బలమైన చేతులు వేసి తోసుకుంటూ జీపెక్కించారా?
ఎప్పుడైనా కర్ఫ్యూ విధించిన వీధిలో రాల్లదాడి జరిగి ఎటు కదలలేని స్థితికి లోనయ్యావా?
ఎప్పుడైనా నీ వాళ్ళెవరైనా అత్యాచారానికో, హత్యకో గురై సాక్ష్యం చెప్పేవాడు లేక నీ ముందే వాడు కాలరేగారేసుకు తిరుగుతున్న స్థితికి గురయ్యావా?
ఎప్పుడైనా నీ వాళ్లు తప్పిపోయి ఎటుపోయారో తెలియక మానసిక క్షోభ అనుభవించావా?
ఇవన్నీ కాదు మిట్ట మధ్యాహ్నం నీరందక తీవ్రమైన దప్పికతో నాలుక పిడచ కట్టుకుపోయే స్థితికి లోనయ్యావా?
ప్రశ్నలలో ఒక్కటికి గురైనా నీకు దు:ఖం గురించి తెలుస్తుంది..
(ఇవన్ని సామాన్యుడికి నిత్య కృత్యమైనాయి)

Thursday, July 2, 2009

నింగికెగసిన నేల తార



నిన్ను మరల మరల చూడాలని అనిపిస్తోంది

నిజానికి మనిషి బతికున్నప్పుడు లేని ఆప్యాయత

అనురాగం ఇలా బయటకు తన్నుకువచ్చేట్లు చేసే

ఆ మృత్యు మహారాజుకు వందనం

ఏమిటో నీ పాటలలోని సాహిత్యం ఎన్నడు నాకు

అర్ధం కాకపోయినా ఆ సంగీత ఝరి నా నరాలలో

విద్యుత్ ప్రవహింపచేసేది

నీ కదలికల వేగం నిజమేనా అని అనిపించేవి


విశ్వ వ్యాపితమైన నీ పాట మాధుర్యం

మరువనివ్వకున్నది

నీ జాతి జనుల స్వెచ్చా కాంక్షనీ మోములో

ప్రతిఫలించేది


నాకెందుకోగాని నీ యవ్వనంలోని నల్లనయ్య

రూపమంటేనే ఇష్ట౦
ఏమిటో మల్లీ నీవు వస్తావని మరలా

నీ మునివేళ్ళపై

ఈభూగోళాన్ని గిర గిరా తిప్పుతావని అనిపిస్తోంది
ఐ వాంట్ యు కం బాక్

Related Posts Plugin for WordPress, Blogger...