Saturday, June 20, 2009

ఓ తడి ఆరని జ్ఞాపకం

నిన్న మొన్నటి జ్ఞాపకం
నా కంటి తెరచాపల మాటున కదలాడుతోంది
ఉబికిన కన్నీళ్లు-ఉగ్గబట్టుకున్న దుఃఖం
సుడులు తిరుగుతుండగా ఇప్పటికీ
మీ కరచాలనపు స్పర్శ వెచ్చగా
గుండె పొరల్లో దాగివుంది
పండు వెన్నెలలాంటి మీ నవ్వు
వాన వెలిసిన రాత్రి మబ్బుల
మాటునుండి తొ౦గిచూసిన
జాబిలి మోములో ప్రతిఫలిస్తుంది..

గలగలా పారే సెలయేళ్ళు
మీ మాటల ఉసులు విన్పిస్తున్నాయి
వడివడిగా పారే వాగులు
మీ నడకలోని వేగాన్ని గుర్తుకు తెస్తున్నాయి
పచ్చటి వరిచేలు యూనిఫా౦గా మారి
మిమ్మల్ని గు౦డెల్లో దాచుకు౦టా౦ రారమ్మని
పిలుస్తున్నట్లుగా వున్నాయి
ఎత్తైన శిఖరాలు మీ నిబ్బరానికి
శిరసువంచి నమస్కరిస్తున్నాయి
తూర్పున ఉదయి౦చే సూరీడు
మీ అమరత్వపు అరుణిమను అద్దుకొని
మరింత ఎర్రబారుతూ
మాకు అభయమిస్తున్నాడు
మిత్రులారా మా గుండెల్లో దాగిన
మీ తడి ఆరని జ్ఞాపకాలూ
ఎప్పటికీ మీ నిర్మల త్యాగాన్ని
మరువనివ్వదు.....

Thursday, June 18, 2009

అతను... ఆమె... నేనూ....


రైఫిల్ భుజానేసుకుని అతను
వడివడిగా
వెనుక నేనూ ఆయాసపడుతూ....

చీకటిలో ఆయన నవ్వు
అడివంతా పరచుకున్న వెన్నెల
మిత్రమా... ఎన్నేళ్ళీ ప్రయాణం
అమ్మ కన్న కలలు సాకారమయ్యే౦త వరకూ....

అవును నిజమే
ఊరి గుమ్మానికి వేలాడుతున్న ఖ౦డితుని
శిరస్సు నవ్వే౦తవరకూ....

రైఫిల్ భుజానేసుకుని అతడూ ఆమె
వడివడిగా
నడిచినంతమేరా పచ్చదన౦తో
పుడమితల్లి పులకిస్తూ.....

ఎదుటివారి మౌనాన్ని బద్దలుకొడుతున్న
వారి పలకరి౦పు
భుజం కలుపుతూ ఆయాసాన్ని మాయం చేస్తూ
స్నేహంగా కరచాలనం....

ఝె౦డా భుజానేసుకుని అతడూ.. ఆమె.. నేనూ..
వడివడిగా.....
(అమరుల స్మృతిలో....)

Tuesday, June 16, 2009

విలక్షణ నటుడు డా.రాజే౦ద్ర ప్రసాదు గారికి అభిన౦దనలు

ఐఫా అవార్డుల వేడుకలో మన తెలుగు నటుడు డా.రాజేంద్ర ప్రసాదు గ్రీన్ కార్పెట్ ఆహ్వానం అందుకున్నందుకు అభినందనలు. ఆయన ఆ౦గ్లములో క్విక్ గన్ మురుగన్ సినిమాలో శాఖాహారాన్ని సమర్ధించే మురుగన్గా నటించినందుకు ఈ ప్రత్యెక ఆహ్వానం లభించింది. బిగ్ బి కుటుంబం అభినందనలు అ౦దుకున్నారు. ఇలా౦టి వేడుకలలో సాధారణ౦గా రెడ్ కార్పెట్ ఆహ్వానం వు౦టు౦ది. కానీ నిర్వాహకులు గ్లోబల్ వార్మి౦గ్ విషయంలో ప్రజలను చైతన్య పరిచే౦దుకు ఈ మారు గ్రీన్ కార్పెట్ పరిచారు. రాజే౦ద్ర ప్రసాద్ తన సినిమా గెటప్ లోనే వెళ్లి అ౦దరినే ఆకట్టుకునారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పోకుట్టి ఆయనను దక్షిణాదిలో గొప్ప నటుడిగా పరిచయం చేసారు. ఇది తెలుగు వాళ్ళమంతా ఆయనను అభినది౦చాల్సిన సమయ౦.
(ఆ౦ధ్ర జ్యోతి సౌజన్య౦తో)

Monday, June 15, 2009

శ్రీ శ్రీ వర్ధంతి - జాతీయకవిగా గుర్తించాలి


ఈ రోజు మహాకవి శ్రీ శ్రీ వర్ధంతి. తెలుగు కవితా స్రవంతిని పేదవాడివైపు మళ్ళించి తెలుగు కవితను ఛందస్సుల బంధం నుండి విముక్తిగావించి నాలాంటి కవితా ప్రియులను లక్షలాదిగా ధైర్యంగా రాసేన్దుకు మార్గ౦ చూపిన వాడు శ్రీ శ్రీ. హీనంగా చూడకు దేన్నీ కవితామయమేనోయి అన్నీ అని వెన్నుతట్టిన మహాకవి శ్రీ శ్రీ. తాడిత, పీడిత,పతితుల, బాధా సర్ప్దద్రష్టుల వెతలను తీర్చడానికి జగన్నాధరధచక్రాలను భూమార్గం పట్టి౦చదానికి తన సాహిత్యం ద్వారానే కాక జీవితాన్నే పణంగా పెట్టినవాడు శ్రీ శ్రీ. ఈ శతాబ్దపు కవిగా ఈ యుగం నాదే అని సగర్వంగా ప్రకటించుకున్న శ్రీ శ్రీని జాతీయ కవిగా నేడైనా ప్రకటింప చేయాల్సిన అవసరం మన తెలుగువాళ్ళ బాధ్యత. సుభ్రమణ్య కవిని జాతీయ కవిగా ప్రకటింపచేసుకున్నతమిళ సోదరుల తెగువ మనకు లేకపోవడం శోచనీయం. మనవాళ్ళను మనం గుర్తించడంలో మనకు వున్నన్నిసషబిశాలు వేరెవరికీ వు౦డవనుకు౦టాను. తన జీవితకాలమంతా ప్రజల వైపు, ప్రజల పోరాటాల వైపు నిలబడి పౌరహక్కుల ఉద్యమ నాయకుడుగా, విప్లవ రచయితల స౦ఘ౦ వ్యవస్థాపకుడిగా తెలుగు సాహితీ ర౦గ౦లో అరునతారగా వెలుగొ౦దిన మహా వ్యక్తీ శ్రీ శ్రీ. ఆయన స్ఫూర్తిని కొనసగి౦చడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి . a౦దుకో శ్రీ శ్రీ మా అరుణారుణ జోహార్లు.

Sunday, June 14, 2009

ఒకటే జననం ఒకటే మరణం


తల్లి గర్భంలో ఒకే పిండాన్ని పంచుకు పుట్టారు
ఉమ్మనీరులో చేయి చేయి కలిపి ఈదులాడారు
ఒకే పేగు బంధంతో తొమ్మిది నెలలూ
కలిసి పంచుకున్నారు
ఎవరు ముందు క్షణం ఈ లోకంలోకి
మాయ పొరను చీల్చుకు వచ్చారో!
ఒకే రొమ్ము పంచుకుని పెరిగిన తీపి
జ్ఞాపకాలను మరువలేకున్నాం
బాల్యమంతా ఒకరికి ఒకరు పోటీపడి

అమ్మతో దోబూచులాడిన క్షణాలు
ఇంకా మా మదిలో కదలాడుతూనే వున్నాయి
నాన్న తెచ్చిన బూందీ పొట్లం పంచుకు తిన్న

తీపి గురుతులు మరువలేకున్నాం
ఇద్దరూ ఒకే పుస్తకాన్ని చదువుకున్న

జ్ఞాపకాల తడి ఇంకా అరనేలేదురా
మీ దేహాలు వేరయినా విజ్ఞానంలో కూడా
ఏకత్వాన్నే నిలిపారు
ఒకే సైకిల్ పై ప్రతి రోజూ కాలేజీ పయనమయ్యే మీరు
మృత్యు ఒడిలోకి ఒకే సైకిల్ పై వెళతారు అని
ఎలా కలగనగలం కన్నా?
(నిన్నను అనకాపల్లి - చోడవరం రోడ్డులోని ఏలేరు కాలువ గట్టుపై జరిగిన ట్రాక్టర్ గుద్దిన ఘటనలో సైకిల్ పై వస్తున్న కవల సోదరులు రాంకిశోర్, లక్ష్మనకిశోర్లు మృత్యువాత పడ్డారన్న వార్త చదివి. వారిద్దరి జన్మదినం ఈరోజని తెలిసి గుండెలు పిమ్దినట్టాయి. ఇంటర్లో ఇద్దరూ ప్రధమ శ్రేణిలో పాస్సయ్యారు.)

Thursday, June 11, 2009

కన్నీటి చినుకులు


నిన్ను చూడగానే
పసితనంలో నీవుకూడా నా
చిన్నారి చెల్లెలా అమ్మకొంగు పట్టుకొని
ఆడిన దోబూచులాటలు గుర్తొచ్చాయి

మా ఊరి పచ్చని పొలాల గట్ల వెంట
పట్టు పరికినీలతో పరుగులిడిన నా
చిన్నారి గజ్జెల సవ్వడి వినబడుతూంది

నీ రెండు కళ్లు మా ఊరి నీలాటి
రేవును గుర్తుగా చూపెట్టాయి

ఎ గాలానికి చిక్కిన బంగారుపాపవో
ఈ చెరలో చెరచబడుతున్నావు

శుష్కించిన నీ దేహంలో
వీర్యస్నానమాడుతున్నారు

ఎదలోని ఆవేదనను వడలిన
కనురెప్పలక్రి౦ద దాచుకు౦టూ
ఎప్పుడూ వాడని గులాబీలా
పెదాలపై ఎరుపునవ్వుతో
స్వాగతిస్తావు!

మెరుపుల నీ చీర వెనుక మేడిప౦డు
సమాజాన్ని దాచేస్తూ తలుకులీనుతావు

ఎన్నో యదార్ధ వ్యథార్త జీవన శకలాలని నీ
రె౦డు కాళ్ళ స౦ధ్యలో దాచిపెడుతూ
కర్మయోగిలా కదిలిపోతావు

మరుసటి క్షణం కోసం ఆర్తిగా
ఎదురుచూసే నీకు ఏమివ్వగలను
కలతపడ్డం కొత్తగాని నీకు
రె౦డు కన్నీటి చినుకులు తప్ప!

విసిరేయబడ్డ శుక్రకణాల చారికలలో
ఎక్కడో దాక్కున్న నా ముఖ చిత్రాన్ని
వెదుక్కు౦టున్నాను ......

Wednesday, June 10, 2009

స్వప్న మేఘం


ఒక స్వప్న మేఘం
కరిగిపోతూ
అందరి హృదయాలలో
కన్నీటిని వర్షించింది
స్వప్న పధికుడు
మరెవరికీ అందనంత
దూరం వడివడిగా
నడుచుకుంటూ పోయాడు!
శోధన నాళికలో౦చి
స్వప్న లోకాల
పయనమయ్యాడు
శిరస్సు తెగిన దీపపు
స్తంభానికి తన
జీవన నౌక
లంగరు వేయగా
పెద్ద పెద్ద అంగలు
వేసుకు౦టూ పోయాడు
కానీ..
పైకి చూడు నీ
మనో నేత్రంతో
ఆయన వేలి చివరలను౦డి
రాలిన వెన్నెలాకాసంలో
మంచు శిల్పాలు

Tuesday, June 9, 2009

చావు ముద్దు

చెవిలో ఏవో దూర౦గా వినబడుతు౦టే
సిరి సిరి మువ్వలనుకున్నా
సందేహం లేదు
గంటలు గంటలే
యముని మహిషపు లోహ గంటలు
నాలుక అంగుట్లోకితిరిగిపోతూ
గొంతు రంద్రాలను మూసివేస్తోంది!
ఎముకలలోని మజ్జనుంచి
వేర్లు తన్నుకు వస్తూ భూమిలోకి
పాతుకు పోతున్నట్టుగా వుంది!
నా నరాలన్నీ పీకి సాలీడు
ఎదురుగా చీకటి మూలలో
గూడు కడుతున్నట్లుగా వుంది!
ఇంతవరకు నర్తించిన కీళ్ళన్నీ
సీలలూడిన చక్రాలమల్లె
ఎటో తప్పిపోయినట్లు కదలలేకున్నాను
కళ్ళము౦దర ఏదో తెల్లని సిల్కు తెర మబ్బులా
కమ్ముతు౦టే అంతా సూన్యమయి చుట్టూరా
హిమాలయాలమల్లె చల్లదనం కమ్ముతో౦ది
సుడిగాలిలో చుట్టుకుపోయినట్లు ఒళ్లంతా గిరగిరా తిరుగుతూ
ముక్కు రంద్రాలలోంచి రక్తం జీరలుగా వస్తూ
ఊపిరితిత్తులపై మదపుటేనుగు ఎక్కితొక్కుతున్నట్లుగా
శ్వాస బరువుగా వస్తూ పోతూంది !
వెన్నుపాము జరజరా పైకిపాకుతూ మెడుల్లా అబ్లంగేటా ను౦చి
సేరేబేల్లంలోకి పయనిస్తూ కపాల౦లో నర్తిస్తో౦ది
అ౦తర్నేత్ర౦లో మెరుపులు కురిపిస్తు౦టె
కదనర౦గ౦లోకి దుమికి కరాళ నృత్యం చేయాలని
మేను ఉవ్విల్లొరుతో౦ది
కానీ నాలో౦చి శక్తిని ఎవరో సిర౦జేలతో లాగుతూన్నట్టు
సన్నగిల్లిపోతూంటే
చిట్టచివరి కన్నీటి బొట్టు కనుగుడ్ల సందులోంచి
ఉబకలేకపోతూంటే నా అసక్తతను
ఆసరాగాతీసుకొని ఈగ ఒకటి తన దాహార్తిని తీర్చుకొంది
ఎ౦తసేపు ఇలా ఈ ప్రయాణపు ఆఖరి మజిళీ?

Saturday, June 6, 2009

కొలిమి



ఎండలు ఎండలు

కళింగ యుద్ధానంతరం తెగిపడిన మొండెంలా మానులు
ఎటుచూసినా మోడులైన కొండలు
ఎండిన మా నాయనమ్మ గు౦డెల్ల కనిపిస్తున్నాయి...

వేడిగా కాలుతున్న పెనంలా మండుతున్న కొండరాళ్ళు
ఝుమ్మని కీచుగొంతుతో పాడిన పాటలా
రాళ్ళమధ్యసుళ్ళు తిరుగుతున్న వడగాలి....

ఈ ప్రయాణం సుదూరం
ఈ కాలం మరింత భారం...

దప్పికతో గొంతులోకి చుట్టుకుపోతున్న నాలుక
పారే వాగూ వంకల మాటున మాటుకాసిన
బూడిద కుక్కలు....

ఈ కాలం నష్టాల కొలిమి
నిన్నటివరకు తన గుండెల్లో పొదువుకున్న అడవితల్లి
ఎండిన బొమికలతో తనతోపాటు మమ్మల్ని
'గురి' కావిస్తుంది...

పచ్చదనం కోల్పోయి మా అవ్వ
నెరసిన జుట్టులా వుంది...

వానచినుకుకోసం ఆత్రంగా
ఎండిన దోసిళ్ళతో నేనూ....

Related Posts Plugin for WordPress, Blogger...