Tuesday, June 9, 2009

చావు ముద్దు

చెవిలో ఏవో దూర౦గా వినబడుతు౦టే
సిరి సిరి మువ్వలనుకున్నా
సందేహం లేదు
గంటలు గంటలే
యముని మహిషపు లోహ గంటలు
నాలుక అంగుట్లోకితిరిగిపోతూ
గొంతు రంద్రాలను మూసివేస్తోంది!
ఎముకలలోని మజ్జనుంచి
వేర్లు తన్నుకు వస్తూ భూమిలోకి
పాతుకు పోతున్నట్టుగా వుంది!
నా నరాలన్నీ పీకి సాలీడు
ఎదురుగా చీకటి మూలలో
గూడు కడుతున్నట్లుగా వుంది!
ఇంతవరకు నర్తించిన కీళ్ళన్నీ
సీలలూడిన చక్రాలమల్లె
ఎటో తప్పిపోయినట్లు కదలలేకున్నాను
కళ్ళము౦దర ఏదో తెల్లని సిల్కు తెర మబ్బులా
కమ్ముతు౦టే అంతా సూన్యమయి చుట్టూరా
హిమాలయాలమల్లె చల్లదనం కమ్ముతో౦ది
సుడిగాలిలో చుట్టుకుపోయినట్లు ఒళ్లంతా గిరగిరా తిరుగుతూ
ముక్కు రంద్రాలలోంచి రక్తం జీరలుగా వస్తూ
ఊపిరితిత్తులపై మదపుటేనుగు ఎక్కితొక్కుతున్నట్లుగా
శ్వాస బరువుగా వస్తూ పోతూంది !
వెన్నుపాము జరజరా పైకిపాకుతూ మెడుల్లా అబ్లంగేటా ను౦చి
సేరేబేల్లంలోకి పయనిస్తూ కపాల౦లో నర్తిస్తో౦ది
అ౦తర్నేత్ర౦లో మెరుపులు కురిపిస్తు౦టె
కదనర౦గ౦లోకి దుమికి కరాళ నృత్యం చేయాలని
మేను ఉవ్విల్లొరుతో౦ది
కానీ నాలో౦చి శక్తిని ఎవరో సిర౦జేలతో లాగుతూన్నట్టు
సన్నగిల్లిపోతూంటే
చిట్టచివరి కన్నీటి బొట్టు కనుగుడ్ల సందులోంచి
ఉబకలేకపోతూంటే నా అసక్తతను
ఆసరాగాతీసుకొని ఈగ ఒకటి తన దాహార్తిని తీర్చుకొంది
ఎ౦తసేపు ఇలా ఈ ప్రయాణపు ఆఖరి మజిళీ?

2 comments:

  1. మరణమృదంగంతో మొదలు పెట్టి, నవరంధ్రాల ప్రాణం వీడిపోతుంటే విగతజీవిగా మారే ఆ చివరి క్షణాలు లోతుగా తరచి చెప్పారు. చివరిగా ఆ ఈగ ప్రస్తావన అసహాయుడి స్థానమేమిటో తెలియజెప్పింది.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...