Monday, March 28, 2011

ప్రియమైన శతృవా....

మిగలనీ

కాసింత కన్నీళ్ళనీ

చిగురంత చిర్నవ్వునీ...


అప్పుడప్పుడూ

హృదయాన్ని శుభ్రపరచే

వసంత మారుతాన్ని

శ్వాశించనీ....

బిగబట్టిన ఊపిరిని

నీ ఒడిలో

ఉప్ మని వదిలి

సేదదీరనీ...

ప్రియమైన నీ

శతృత్వంలో

స్నేహజగడాలలోంచి

మాధుర్యాన్ని వెదకనీ....

కట్టుకున్న ఈ

కలల నేతల

గిజిగాడి గూడు

గదులలో

పారాడిన నీ

కాలి అందెల

సవ్వడితో

తెలవారనీ...

ప్రియమైన శతృవా

నీ పెదవి చిగురున

నాటిన గాయం

తేనెలూరుతూ

బాహుబంధంలో

నన్ను బందీకానీ....

ఈ జగడం

జీవిత కాల

ఖైదుగా నీ చెంత

మిగలనీ....

Saturday, March 26, 2011

కలల సేద్యం....

ఇప్పుడే తొలి సూర్యకిరణాన్ని

లోనకి ఆహ్వానిస్తూ

గుండెనిండుగా ఓ స్వేచ్చా

మలయ మారుతాన్ని

శ్వాశిస్తూ....

చల్లని నీళ్ళు కళ్ళపై

చల్లుకుంటూ...

కాసిన్ని అక్షరాలను

మనోఫలకంపై దిద్దుకుంటూ

భుజాన కలల నాగలిని

ఎత్తుకుంటూ

జీవన సేద్యానికి

దోసిలినిండా

జ్నాపకాల విత్తులను

పట్టుకొని

రేలా రేలారే రేలా అంటూ

గుంపుతో సాగుబడిలో

సాగిపోతూ...

బతుకు వురవడిలో

కొట్టుకుపోకుండా

నిరంతరం నేను నేనుగా

నిలబడే ఎరుకనిచ్చే

సాహితీ మిత్రులకు

ఉదయారుణ వందనాలు...

Wednesday, March 23, 2011

ఇంక్విలాబ్ జిందాబాద్...క్రొన్నెత్తురు ధారపోసి
మీరందించిన విప్లవ వారసత్వం
నేటికీ నెరవేరని మీకలలను
ఆవిష్కరింప జేయడానికి
కొనసాగుతూనే వుంది....

దొరల టోపీలు మారి
ప్రజల బతుకు మారని తీరుకు
పోరాటమే మార్గమని
మీరూపిరులూదిన ఉద్యమం
నేడు భరతమాత సంకెళ్ళు తెంచడానికి
నేటి యువతరం అందుకుందన్న
నమ్మకంతో మరోమారు
ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినదిద్దాం....

(భగత్ సింగ్, రాజగరు, సుఖదేవ్ ల అమరత్వాన్ని నేడు గుర్తుచేసుకుంటూ)

Sunday, March 20, 2011

వేడుకోలు..పుట్టుకతోనో,
చిన్ననాడో,
ప్రమాదవశాత్తుగానో,

శరీరాంగం తిరిగిరాని
మొలకలా
వెక్కిరిస్తూ
నిరంతరం
మనసును దొలుస్తూ...

అన్నీ
వున్నాయన్న

వాడి
వెకిలి చూపు

బాధిస్తూన్న

జీవితం
పట్ల

పోగొట్టుకోలేని
ప్రేమ
నిబ్బరంగా
వెలిగిస్తూ
ఆసరాగా
ఓ కఱ ఇచ్చిన
ఊతనివ్వలేని

వారి
నిర్జీవ మనసును

చూసి నవ్వుకుంటూ....


మీ మీ జాలితనం
మాకొద్దు
మిత్రులారా

అవిటితనంలేని
మనసు
కలిగివుంటే
చాలని విన్నపం...

(నేడు వికలాంగుల దినోత్సవం సందర్భంగా)

Wednesday, March 16, 2011

కరచాలనంరెండు చేతులు

ఎదురెదురుగా..

ఒకరి కళ్ళలోకి

ఒకరు చూస్తూ

గుండెల్లోని

ప్రేమను, ఆప్యాయతను,

ఆవేదనను, అనురాగాన్ని

ఆవేశాన్ని,

అవ్యక్తానుభూతిని,

తన్మయత్వాన్ని

ఒకరినుండి

ఒకరిలోనికి

ప్రవహింపచేసే

వాహిక....

Monday, March 14, 2011

కలలను కత్తిరిస్తున్న వేళ..

కంటి రెప్పల చుట్టూ

పాతబడుతున్న

ముళ్ళ కంచె

నే నిలుచున్న చోటే

నీవు ఓ పునాదిరాయి

వేసి పొమ్మంటూ వుంటే

గొంతు పెగలనీయకుండా

బిగించిన కబంధ హస్తాలు!

పచ్చగా పరచుకున్న చోట

నల్లని మసిపూతకు

నీవు పూనుకుంటుంటే

గుండె పగిలేటట్టు

రోదిస్తున్నా

గుండెల్లో దిగబడ్డ తూటా!

చేతులు బార్లా చాపి

వలనిండా పడ్డ నా బువ్వ

నేడు బురదపాము చేస్తూ

అడ్డుపడుతున్న

నా డొక్కలో... నీ

ఇనుప బూటు తాపు!

వద్దయ్యా మా

బతుకులు మేం బతుకుతాం..

మా నేలని

మేం ఏలుకుంటాం

అంటే..

మా నీళ్ళను మేం

మా పంట సేల్లో

తడుపుకుంటామంటే..

మా ఉద్యోగాలేవో

మేం జేసుకుంటామంటే..

అధికారపు

హుంకరింపులతో

మా కలలను

కత్తిరిస్తున్నావు!

అయినా

వేయి తలల నాగుపాము

చలిచీమల చేత చిక్కదా


Friday, March 11, 2011

పతంజలి సార్ మిమ్మల్ని మేం మర్చిపోయి రెండేళ్ళైంది..


ఈ రోజు అక్షర శిల్పి, అక్షరకొరడాతో నిద్దరోతున్న సమాజాన్ని మేల్కొలిపేందుకు ఆఖరిశ్వాశ దాకా సాహితీప్రయాణం సాగించిన మనందరికి మిత్రుడు, శత్రువైన ఆధునిక భాష్యకారుడు పతంజలి గారి రెండవ వర్థంతి.. ఈ సందర్భంగా ఆయన గురించి ఎక్కువగా రాయలేని నా అజ్నానానికి సిగ్గుపడక ఆయన రాసిన ముక్కలలోంచే ఈ నాలుగుః

"ఆదియందు అక్షరముండెను. అది అబద్ధమై ఉండెను. అందువల్లనే అది అక్షయము, అక్షరము, అమరమూ అయివుండెను. అది పాలకుల వద్ద ఉండెను. ఆ అక్షరము నుంచి క్రమక్రమముగా అసత్య ప్రచారము పుట్టుకు వచ్చెను. అది ఏలిన వారి నాలుక చివరనె ఉండెను. ఏలినవారి అవసరార్థము వారి తాబేదారులు, మగధగణమూ, ఆ అసత్య ప్రచారమును రథములపై మోసుకుని తిరుగుచుండెను. ఏమీ అర్థం కాలేదా?"


ఐతే
పతంజలి భాష్యము, నాకు తప్పదు కదా? అధ్యాయము, పేజీ 127 చదువుడు..

Tuesday, March 8, 2011

ఆకాశంలో సగమేనా?
కొలమానం
లేని
మా సెమట సుక్కలను

ఖరీదు కట్టనీకి

ఎన్ని మాయలో!


ఎన్ని జనమలెత్తినా

ఈ నెత్తిన తట్ట
మారలే!

కరకరమని
ఎముకలు
విరుగుతున్నా

తప్పని మోత!


ఎన్ని ప్రణాళికలు
వేసినా
అవి
మా కన్నీటిని
తుడవకపోగా

మరింతగా
మా
మూలుగును

పీలుస్తూనే వున్నాయి!


ఈ రూపాయి

సంబంధమిలా వుండగా

పెనిమిటి లమ్డీ కొడుకు

మగపురుగు బుద్ధిని

మాపై రుద్దకమానడు!


అరకొర కస్టాన్ని

తానొక్కడి సంతోసానికి

మింగి మళ్ళీ నాపై

అఘాయిత్యం
సేస్తానే వుంటాడు!

ఆకాసం సూడనీకుండా

తట్టడు బరువు
నెత్తిన!

తళుకు సీరల

అమ్మలుది
ఓ బాధైతే

నాది నిరంతర

ఱంపపు కోత!!


(అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా)

Friday, March 4, 2011

నేరం...

మాటాడాల్సిన వేళ

మౌనం నేరం..


ప్రశ్నించాల్సిన వేళ

తలవంచుకోవడం నేరం..


పిడికిలెత్తాల్సిన వేళ

చేతులు కట్టుకోవడం నేరం..


కౌగిలించుకోవాల్సిన వేళ

ముడుచుకుపోవడం నేరం..


ద్వేషించాల్సిన వేళ

ద్వేషించలేనితనం నేరం..


ప్రేమించాల్సిన వేళ

పారిపోవడం నేరం...

Wednesday, March 2, 2011

డిక్లరేషన్..
పరిశ్రమలు,
అభివృద్ది,
ఉద్యోగాలు
ఇవన్నీ కావలసినవే
కాదనం..

కానీ మా బతుకుల్ని
బూడిద చేసి
వాటిపై నిర్మించే
అభివృద్ధి సౌధాలు
ఎవరికోసం?

మా
ప్రశ్నలకు

మీ తుపాకీ తూటాలు
సమాధానమైనప్పుడు
మరి మాకెవరు దిక్కు?

ఇది కాదా హింస?
ఇది కాదా రక్తపాతం?
ఇదేనా ప్రజాస్వామ్యం?
ఐతే మాకొద్దు యివన్నీ..

Tuesday, March 1, 2011

నెత్తుటి బాకీ..రోజు నీది కావచ్చు

నీ చేతిలో తుపాకీ నా గుండెల్లో
గురి చూసావు

ఎవడో విసిరిన బొమికలకు
ఆశపడి మా జీవితాలను
బొగ్గు చేయడాన్ని
అడ్డుకున్న మమ్మల్ని
కాల్చి,
మా గుడిసెల్ని
మసి చేసి నువ్వు
విభూదిగా ధరించి
వీరంగం వేయొచ్చు...

మా ఊళ్ళని బీడు చేసే
కుట్ర
అదిక్కడితో ఆగదు

రేపటి సూరీడుని
మసి బార్చే అగ్గి
కుంపట్లు నీ ఊపిరినీ
ఆర్పేంత వరకు
ఆగవు...

నెత్తుటి బాకీ
తీరక మానదు..

అది మట్టి వారసత్వం

(నిన్న సిక్కోలు కాకరాపల్లి వద్ద జరిగిన పోలీసు కాల్పులలో మరణించిన జీరు నాగేశ్వరరావు, శీరపు ఎఱయ్యల వాగ్ధానం)
Related Posts Plugin for WordPress, Blogger...