కంటి రెప్పల చుట్టూ
పాతబడుతున్న
ముళ్ళ కంచె
నే నిలుచున్న చోటే
నీవు ఓ పునాదిరాయి
వేసి పొమ్మంటూ వుంటే
గొంతు పెగలనీయకుండా
బిగించిన కబంధ హస్తాలు!
పచ్చగా పరచుకున్న చోట
నల్లని మసిపూతకు
నీవు పూనుకుంటుంటే
గుండె పగిలేటట్టు
రోదిస్తున్నా
గుండెల్లో దిగబడ్డ తూటా!
చేతులు బార్లా చాపి
వలనిండా పడ్డ నా బువ్వ
నేడు బురదపాము చేస్తూ
అడ్డుపడుతున్న
నా డొక్కలో... నీ
ఇనుప బూటు తాపు!
వద్దయ్యా మా
బతుకులు మేం బతుకుతాం..
మా నేలని
మేం ఏలుకుంటాం
అంటే..
మా నీళ్ళను మేం
మా పంట సేల్లో
తడుపుకుంటామంటే..
మా ఉద్యోగాలేవో
మేం జేసుకుంటామంటే..
అధికారపు
హుంకరింపులతో
మా కలలను
కత్తిరిస్తున్నావు!
అయినా
వేయి తలల నాగుపాము
చలిచీమల చేత చిక్కదా
No comments:
Post a Comment
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..