Friday, October 24, 2014

చినుకుల దీప హారం


ఏదో ఒక చివురున వేలాడే ఒక్కో చినుకును దీపపు మాలగా చేసి 
ఈ రాతిరి నీ మెడలో హారంగా వేయాలని

అక్కడక్కడా కొన్ని పూరెమ్మలను అతికించి 
కాసింత పరిమళాన్ని అద్దాలని

ఈ ఐ మూల ఈ నూనె వత్తిని కాసింత పైకి లాగి 
ఆరి పోకుండా అడ్డుపెట్టిన అరచేతులగుండా వెలిగే ఖాళీని
కాసింత పొదివి పట్టుకొని 
నీముందు కురవనీ

Friday, October 10, 2014

నివేదన..


శూన్యాన్ని ఒకింత ఒడిసిపట్టుకొని
మౌనాన్ని కాసింత ఆలపించనీ

ఈ వెదురు ఆకుల సవ్వడిని 
మోదుగు పూల రంగుని 
కొండ పాదాన్ని తాకే మబ్బు తునకని
ఒకింత దాచుకొని
మరికొద్ది కాలం
చరించనీ
ఈ 
పచ్చిక 
మొలకలపై

..............

Monday, October 6, 2014

ఇప్పుడిలా....

ఇప్పుడిలా మాటలు వినిపిస్తున్నాయి నిశ్శబ్దంగా 
ఎవరో కొద్ది మంది మోకాళ్ళపై వంగి గుస గుసలాడుతున్నట్టు


గుండెపై చేతులేసుకొని కళ్ళపై కఫన్ కప్పుకొని
ఖాళీ పాత్రచుట్టూ మూగి మూగగా రోదిస్తున్నట్టు


ఏదో పరిచయమున్న వాసననేదో మోసుకొస్తూ గాలి
ఇక్కడ సుళ్ళు తిరుగుతూ దుఃఖిస్తున్నట్టు


వానలు కాలి బూడిదైనట్టుగా ఈ ఏటి గట్టునుండి
ఇసుక మేఘం పొలాలను కప్పిపెడుతున్నట్టు


నిండు గర్భంపై మదపుటేనుగేదో తొక్కిపెట్టి
శిశువు గొంతు నులిమి పెకిలిస్తున్నట్టు


కాలమంతా ఓ చీపురుకట్టగా రూపాంతరం చెంది
నీ కనులను పెకిలిస్తూ చరిత్రను తుడిచిపెడుతున్నట్టు


ఇప్పుడిలా మాటలు మండుతున్నాయి ఉసుళ్ళుగా 
పేలుతూ పేగులన్నీ కాలి నిప్పు ఇనుముగా మారుతున్నట్టు


(తే 05-10-2014 దీ)

Friday, October 3, 2014

కొన్ని సమయాలు...

కొన్ని నెత్తురింకిన సమయాలు దోసిళ్ళలో ఇమడవు

కొన్ని ఇసుక గూళ్ళుగా మారి కూలిపోతాయి


కొన్ని రాతి పొరలలో దాగి పొక్కిలిగా కరుగుతూ చారికలవుతాయి


కొన్ని మైనపు పొరలలో దాగి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి


కొన్ని చీకటి అరలలో వెలుగును కప్పుకుంటాయి


కొన్ని భూమి పొరలలో లావాలా ఉడుకుతుంటాయి

కొన్ని రాజేయబడని అగ్ని శిఖలా పొగలూరుతాయి


కొన్ని రాజీపడలేని ముళ్ళుగా మారి నిత్యమూ హెచ్చరికలవుతాయి



కొ
న్ని


యా
లు

వెంటాడే రంపపు కోతలా ఎదురవుతూనే వుంటాయి....
Related Posts Plugin for WordPress, Blogger...