Monday, October 6, 2014

ఇప్పుడిలా....

ఇప్పుడిలా మాటలు వినిపిస్తున్నాయి నిశ్శబ్దంగా 
ఎవరో కొద్ది మంది మోకాళ్ళపై వంగి గుస గుసలాడుతున్నట్టు


గుండెపై చేతులేసుకొని కళ్ళపై కఫన్ కప్పుకొని
ఖాళీ పాత్రచుట్టూ మూగి మూగగా రోదిస్తున్నట్టు


ఏదో పరిచయమున్న వాసననేదో మోసుకొస్తూ గాలి
ఇక్కడ సుళ్ళు తిరుగుతూ దుఃఖిస్తున్నట్టు


వానలు కాలి బూడిదైనట్టుగా ఈ ఏటి గట్టునుండి
ఇసుక మేఘం పొలాలను కప్పిపెడుతున్నట్టు


నిండు గర్భంపై మదపుటేనుగేదో తొక్కిపెట్టి
శిశువు గొంతు నులిమి పెకిలిస్తున్నట్టు


కాలమంతా ఓ చీపురుకట్టగా రూపాంతరం చెంది
నీ కనులను పెకిలిస్తూ చరిత్రను తుడిచిపెడుతున్నట్టు


ఇప్పుడిలా మాటలు మండుతున్నాయి ఉసుళ్ళుగా 
పేలుతూ పేగులన్నీ కాలి నిప్పు ఇనుముగా మారుతున్నట్టు


(తే 05-10-2014 దీ)

8 comments:

  1. సార్...మీ స్థాయికి మేము చేరుకోవడం బహుకష్టం.

    ReplyDelete
  2. చాలాబాగుంది మీ కవిత

    ReplyDelete
  3. కాలమంతా ఓ చీపురుకట్టగా రూపాంతరం చెంది
    నీ కనులను పెకిలిస్తూ చరిత్రను తుడిచిపెడుతున్నట్టు

    ReplyDelete
  4. మంచి కవితను అందించారు వర్మగారు.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...