Tuesday, January 31, 2012

Saturday, January 28, 2012

వెలుతురు పిట్టల పిలుపు!!నువ్వు నూనూగు మీసాల నూత్న యవ్వనంలో
గోడలపై ఎర్ర రంగు నినాదాలు అంత దస్తూరీగ రాస్తూన్నప్పుడు
విప్లవం వర్థిల్లాలని జెండా చేతబట్టి వడివడిగా ర్యాలీ అవుతున్నప్పుడు
నిన్ను చూసి మురిసిపోయాను....

ఈ కుర్రాడు ప్రతి పని చక్కగా ముగ్గువేసినట్లు చేస్తాడని అంతా అంటూన్నవేళ...
పాటకు భావయుక్తంగా గొంతు కలుపుతూ అడుగువేస్తున్నవేళ..
కంఠనాళాలన్నీ బిగబట్టి ప్రసంగిస్తుంటే కళ్ళలో నిప్పులు కురుస్తూ నువు మండుతున్న వేళ...
పచ్చని చిగురాకు పట్ల ప్రేమగా నువ్వు నిమురుతున్న వేళ....
ఇక్కడి ప్రకృతి పులకించి పోవడం కళ్ళారా చూసా రఘూ....

నిన్ను నీ అంతరంగ సంఘర్షణను సరిగా అర్థంచేసుకున్నామో
లేదోనని ఇప్పటికీ ఎక్కడో అపరాథ భావం వెంటాడుతునే వుంది...
నిజమయ్యా వాడు ఎన్ని ’అమ్మ పిలుపులు’ ’జన్మభూమి పిలుపులు’
పిలిచి ఎరగా తల్లి ప్రేమను వేసినా నీవు మడమ తిప్పక
అంతే పట్టుదలతో ట్రిగ్గర్ పై బిగుసుకున్న నీ చూపుడు వేలు చూసి
వాడు సిగ్గుతో వెన్ను చూపాడు....

అందుకే నీ తోవ అంత వెలుగు పరుచుకుంది రఘూ....
నిన్ను మట్టుబెట్టనీకి ఎన్నెన్ని రంగులు మార్చినా...
కాలిలో గాయమైనా వెన్ను చూపని నిన్ను చూసి
వాడు నీ పేరంటేనే వెన్నులో చలికి వణికిపోయాడు....

చివరికి బూటకపు  గణతంత్ర  వేడుక వేళ
నీ చావును బహుమానంగా ఇచ్చి
వాడు మురిసిపోతున్నాడు....

కానీ...
వెలుతురు పిట్టల పిలుపు
మా చెవులలోనే కాదు
గుండెల్లో గూడేల్లో గూడు కట్టుకున్నది రఘూ....

(తే 26-01-12 న ఒరిస్సా సరిహద్దు నారాయణపట్న బ్లాకు పరిథిలోని పొడపొదర అడవులలో బూటకపు ఎదురుకాల్పులలో సహచరితో పాటు అమరుడైన రఘు స్మృతిలో)

Wednesday, January 25, 2012

అతడు


అతడి నవ్వు
ఆకాశంలో సంతకం చేయబడ్డది....

అతడి దుఃఖం
సాగరంలో నిక్షిప్తమైంది....

అతడి ప్రేమ
నేలంతా పచ్చదనం పరిచింది....

అతడి స్నేహం
గాలిలో పరిమళమై వ్యాప్తి చెందింది....

అతడి కోపం
అగ్నిపర్వతంలా రగులుతూనే వుంది....

అతడి వాత్సల్యం
వసంతగానమై వినిపిస్తూనే వుంది....

Tuesday, January 24, 2012

క్షమించు పాపా

 
 క్షమించు పాపా! 

నువ్వు కడుపులో వున్నావన్న
స్పృహే ఊపిరాడనీయదు....

చచ్చాక నరకం దాటిస్తాడన్న బుద్ధిలేనితనంతో
మగ బిడ్డకు వెంపర్లాడే వెఱితనంతో
నీ గొంతునులిమి తుప్పలో పారేసే మూర్ఖులం...

గొంతులో వడ్ల గింజ వేసి ఊపిరిదీసే హంతకులం...

మేమూ ఓ తల్లి కడుపులోనే పుడతామన్న
స్పృహలేని జీవశ్చవాలం....

అద్దెకు కడుపులు కొనుక్కుని మురిసిపోతున్న
వికృత జీవులం....

క్షమించేయి తల్లీ....

(నేడు జాతీయ ఆడబిడ్డల దినోత్సవం సంఘీభావంగా)

Monday, January 23, 2012

ఒలికిపోతూ...


ఒక్కోసారి
బయలుదేరిన చోటనే
మరచిపోయినట్టు
ఏదో మిగిలిపోయినట్టు
కంటిమూలలో ఓ నీటి బిందువు కదలాడుతూ
ఊపిరినీయక గుండె గదిలో ఉక్కపోత....

ఓ చెలిమి దాటిపోయి మిగిల్చిన
చెమ్మ ఎడారిలో ఆవిరవుతున్న
ఒయాసిస్సులా....

కరిగిపోతున్న వెన్నెల
అనంత సాగరంలో ఓ మంచు బిందువులా
ఒలికిపోతూ....

Saturday, January 21, 2012

నిశ్శబ్ధ సంగీతం..


ఇక్కడెవరో సన్నని తీగలను
నిశ్శబ్ధంగా మీటూతూ
రక్తజ్వలన సంగీతాన్ని ఆలపిస్తున్నారు...

ఒక్కో మెట్టులోనూ ఎగుడు దిగుళ్ళ
వంపులతో గుండెను చిలకబడ్తుంటే
దేహమంతా విద్యుత్ ప్రవహిస్తూ
తీవ్ర ప్రకంపనలతో కుదుపు....

కనులముందు కురుస్తున్న
ధారలో చూరంటిన జ్నాపకమొకటి
వేలాడుతూ నెత్తురోడుతూ
పచ్చిగా మిగిలి వున్నానన్న
బాలింతరపు వాసనేస్తూ....

Wednesday, January 18, 2012

నవ్వుల వెలుగు


కాలం దొంగిలించిన బాల్యాన్ని
మళ్ళీ గుర్తు చేసాడు వీడు...


తప్పిపోయిన హృదయాన్ని

మళ్ళీ పట్టిచ్చాడు వీడు....


గతమంతా గురుతులుగా

మాసిపోయిన నూనె మరకలా

మిగిలిన నలుపు తెలుపుల

ముఖ చిత్రంపై కాసింత వెన్నెలని

చిలకరించాడు వీడు....


ఏ కాలుష్యమూ అంటని

నవ్వులు విరజిమ్ముతూ
భోగీలో
కనుమ వేళ
దీపావళిని
వెలిగించాడు వీడు...

(నిన్న విజయనగరం రైలులో వెల్తూన్నప్పుడు ఈ బాబును చూసి యిలా...)

Sunday, January 15, 2012

ఆవిష్కరింత....


తొలి పలకరింపుతోనే
ఎన్నో యుగాలుగా కలిసి వున్నట్టు...

తెగిన దారమేదో ముడిపడి
గొంతులో జీరగా ఓ సన్నని
గీతమొకటి ఒలికినట్టు...

కనులముందు వాన వెలుస్తూ తుంపరల
మెరుపులగుండా రంగుల చిత్రమొకటి
ఆవిష్కరిస్తున్నట్టు....

పిలిచినప్పుడంతా
ఓ బంగరు పిచ్చుక నుండి జారిపడిన
రేక అలా ఎగురుకుంటూ మెడ వంపున
చక్కిలిగిలి పెట్టినట్టు....
ఆ ముంగురులను తాకిన సన్నని
గాలి తిమ్మెర సువాసనగా
ముక్కు పుటాలను తాకుతూన్నట్టు...

అలా సందేశమొచ్చినప్పుడంతా
గుండె గదిలో నెత్తురు ఉలికిపడ్డట్టు
కంట్లో ఓ మూలగా కదలిన ప్రతిబింబం
పలకరిస్తూ మెల్లగా చేతి వేళ్ళలో
వెచ్చగా తన వేళ్ళు చొప్పిస్తూ దగ్గరగా
వెచ్చని ఊపిరి సెగలుగా తాకుతూ
చలి పులిని వేటాడుతున్నట్టు....

ఈ బంధమిలా చివరాఖరి ఊపిరి
మెట్టు వరకు దాచి వుంచుతావా............

Saturday, January 14, 2012

అపెండిసైటిస్ లా...ఇక్కడేదో మిగిలిపోయినట్టుంది
తీసి మంటలో వేయండి...

ఇంకా అలానే అతుక్కుపోయింది!
ఎంతగా కాల్చి బూడిద చేద్దామన్నా
బయట పడేయలేనితనం
అసహానానికి గురిచేస్తోంది...

ఈరోజు తప్పక పెకిలిద్దామన్న
ప్రయత్నం...
అదే ఈ ఐమూల నక్కి
అపెండిసైటిస్ లా సలుపుతూన్న
అసూయాహంకారాల వ్రణావశేషాన్ని... 
(మిత్రులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు..)

Thursday, January 12, 2012

నువ్వొస్తావని....


నువ్వొస్తావని
వెండి వెన్నెలలాంటి నీ నవ్వు
సంతకమిస్తావని
ఈ దీప స్థంభపు క్రీనీడలో
నీ రాకకై నిరీక్షిస్తూ వున్నా నేస్తం....

తడి ఆరిపోతున్న గొంతులో
నీ పాటతో ఇన్ని అమృతపు చినుకులను
వర్షిస్తావని ఈ మలుపులో వేచి వున్నా నేస్తం...

ఈ చలి రాతిరి మంచు ముద్దవుతున్న
వేళ నీ వెచ్చని కరస్పర్శతో
నన్ను వెలిగిస్తావని ఈ మాటున ఎదురు చూస్తున్నా నేస్తం...

ఆకాసమంత నేత్రంతో
కాలయంత్రాన్ని బంధించి యుగాలుగా
ఇక్కడే ఇలా ఈ వేళ నీ రాక కోసం...........

Monday, January 9, 2012

కలలనేత...వరుసగా గోడపై పలు ఆకారాల్లో
ముఖపు బొమ్మలు అతుక్కుని తదేకంగా చూస్తున్నాయి....

అందులో గెడ్డం మాసిన బొమ్మొకటి
అలా చూస్తుంటే ఏదో వెలితి ఆ కళ్ళలో ....

గుండెల్లో ఓ మూల

ఎవరిదీ అన్న అనుమానంతో పాటు
సందేహమొకటి వెన్నాడుతూ...

ఆ పక్కగా బవిరి గెడ్డంతో ఓ మొఖం
ఏదో చెప్పాలని చూస్తున్నట్టు
కళ్ళతో నవ్వుతూ పిలుస్తూ....

ఇంతలో మరో మొఖం గాటుపడ్డ వెంబడి
ఎర్ర చారతో తీక్షణంగా చూస్తూ
హెచ్చరిస్తూన్నట్టుగా.....

ఏవో నీడల జాడల వెంబడి
అలా జారిపోతున్నట్టు
కనికట్టులా ఒక్కోటి అదృశ్యమవుతూ
ఇంతలో గోడంతా మరకలు మరకలేవో
పులుముకుంటూ.....

అసంపూర్ణ పద్యాన్ని గట్టిగా ఆలపిస్తూ
కీచుమంటున్న గొంతొకటి
శబ్ధిస్తూ...


పీలికలైన గుడ్డ దారాలన్నీ
అతికీ అతకనట్టుగా
కలలనేత......

ఉలిక్కిపడి లేవగా
కాళ్ళు రెండూ తెగిపడిపోయినట్టు
మనిషినంతా ఓ మూలగా....

Wednesday, January 4, 2012

ఆకాశమే హద్దుగా..

నిరీక్షణ ఫలిస్తే కళ్ళనిండుగా
ఆనందపు సెలయేళ్ళే...

గుండెనిండుగా
పచ్చిక బయళ్ళే...

నీ చుట్టూ
ఓ కాంతివలయం...

కోటి జన్మల ఆవలనుండి
ఓ చేయి నీ నుదుటిపై
ప్రేమగా తాకిన అనుభూతి....

ఓ మధుర సంగీత ఝరి
ఇంపుగా చెవులను తాకుతూ
దేహమంతా పరిమళిస్తుంది...

ఆకాశమే హద్దుగా
....

Sunday, January 1, 2012

నీవూ.. నేనూ....


ఏదో జరుగుతుందనో
జరగబోతుందనో
కేలండర్ మార్చలేం...

లేచి నిలబడే ప్రయత్నం చేస్తూ
అడుగుముందుకు వేస్తూ
కదులుతూ కదిలిస్తూ
పరుగులు తీస్తూ
భుజం భుజం కలుపుతూ
సాగుతూ ముందుకు పోయే
జీవన యానంలో
రేయింబవళ్ళు
భాగాలుగా
అటూ ఇటూ
జరుగుతూ....
జరుపుతూ....

ఆస్వాదించడంలోనే
తేడా కలిగిన
విషాదపు ఆనందపు
వేళల బరిగీతల
కీవల నీవూ నేనూ...

నిజానికి
నిన్ను ప్రేమించడంలోనే
పొదిగి వున్న ఆ భావ వీచిక
మదిలో గూడుకట్టిన క్షణాన
ఇంక యుగాంతమైతే మాత్రం
నాకేంటి???
Related Posts Plugin for WordPress, Blogger...