Sunday, June 5, 2016

చిగురు..

కదలిక లేనితనం ఒకటి వెంబడిస్తూ
నీలోని చర్యా ప్రతి చర్యలను నియంత్రిస్తుంది

అటూ ఇటూ ఒక కనబడని ఇనుపతెర
పరచుకొని ఒరుస్తూ గాయపరుస్తుంది

గడ్డకట్టిన హృదయం వెచ్చని అశృవుగా
బొట్లు బొట్లుగా రాలుతుంది

నువ్వంటావు ఈ మాయ తెర
చినుగుతుందా అని

విత్తిన ఆ గింజ పగిలి ఎర్ర చిగురు
తొడగక మానదు కదా?

కాసేపిలా ఒత్తిగిలి ఈ మట్టివాసన
గుండెల్నిండా తీసుకోనీ!!

యశోధరను..

ఈ తెలవారని రేయినిలా
నివురులా ఓ కఫన్ కప్పుకొని

నువ్వలా నిశ్శబ్దంగా నడుచుకుంటూ
పోతూ చివరిగా తాకిన నీ వేలి చివరి
తడి ఇంకా ఆరనే లేదు

మరో వైశాఖి నన్ను వెక్కిరిస్తూ
అలల కల్లోలంలో మిణుగురులా దోబూచులాడుతూ

నేనిలా
ఓ తెగిపడిన రావి ఆకులా

రహదారి దుమ్ములో
విరిగిన భిక్షా పాత్రలా

చెదరిన కలలో నీ రాకకై
ఈ ఎండమావి తీరాన
ఇసుక సంద్రంలో ఓ రేణువుగా చెరిగిపోతూ!

నీ
యశోధరను..

ఈ గోడమీద..

మీ పేర్లు
ఒక్కొక్కటి
రాస్తూ

కొన్ని
నెత్తుటి చుక్కల
మధ్య


బాలింతరపు
వాసన

అవును
మిమ్మల్ని
మరిచిపోనివ్వని


ఆకు సవ్వడి
గుండెనలా
ఒత్తిపడుతూ!!

కాసింత నిదురపో


ఆ గరిక పూలనలా తాకకు 
నేల రాలనీ


ఆ మేక పిల్లనలా ఎత్తుకోకు
ఎగిరి దుంకనీ

ఆ ఎర్రని చిగురును తుంచకు
మరికాస్తా ఎదగనీ

ఆ రాతితో మాట కలపకు
మౌనాన్ని అనుభవించనీ

కాసింత గోడవారకు ఒత్తిగిల్లనీ
రెప్పల పడవలో ఈదని!

నివురు..

కొన్ని సాయంత్రాలకు నల్లని ఆకాశపు కొక్కేనికి
ఒంటరి వెన్నెల ఉరిపోసుకుంటుంది

అలముకొన్న సదురు నుండి ఆత్మ
వేరుపడక పొక్కిలిగా పిగిలి పోయింది

నెత్తుటి ధారలన్నీ సిరాగా మారి
చరిత్రను పేజీలలో మడతపెట్టాయి

యింత నమ్మకాన్ని పంచిన
ఉదయాలేవీ నీ కనుపాపలు చేరలేదు

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ
నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది

తూరుపింకా తెలవారక నీ పేరు
తలుస్తూ పొలమారుతొంది

కోందు బాలుడొకడు గొడ్డలి నూరుతూ
నియాంగిరీ సానువులలో సాగిపోతున్నాడు

(కామ్రేడ్ సత్నాం స్మృతిలో)

కానుగపూల పరిమళం...


కొన్ని సాయంత్రాలు దేహం కోల్పోయిన
ఆత్మను మోసుకొస్తుంది


అడుగుల పరిధి కుంచించుకొని
ఒక మాత్ర అందని దూరంలో విసిరేయబడతావు

పహరా చుట్టూ కంచె పెరుగుతూ
నడకను నియంత్రిస్తుంది

నీలోని ప్రతి అణువును మలేరియా తిని
మెదడుకు పాకి కళ్ళను పైకెగదోస్తుంది

నిట్ట నిలువుగా వెన్నును విరిచి
కాళ్ళను చేతులను హరిస్తుంది

నీ నుదుటి మీద వెన్నెల ఓ
దు:ఖపు ముద్దుగా మెరిసి కుంగిపోతుంది

నువ్వంటావు చివరిగా ఈ ఝెండా
భుజం మార్చుకుంటుందా అని

రవీ నువ్ నడిచినంత మేరా పరచుకున్న
ఈ కానుగ పూల పరిమళం అద్దుకుని

అటు చివర ఆ బాలుడు విల్లునలా
గురిచూస్తూ విసురుగా వస్తున్నాడు...

(మలేరియా కబళించిన కామ్రేడ్ సి.సి.కమాండర్ రవి స్మృతిలో)
Related Posts Plugin for WordPress, Blogger...