Tuesday, August 28, 2012

మట్టి తత్వం...

రా...
నడుస్తూ గుండె తలుపులు తెరుస్తూ
మట్టి మనుషుల మధ్యకు రా...

మట్టి వాసనను ముక్కు పుటాలనిండా పీల్చు
నీ ఆదిమతనం బయల్పడుతుంది...

మట్టి చేతిని ఆత్మీయంగా తాకి చూడు
నీ రాతితనం బద్ధలవుతుంది....

భుజం భుజం కలిపి భారాన్ని పంచుకో
నవమాసాల బరువు గుర్తుకొస్తుంది...

గొంతు విప్పి బిగ్గరగా మాట కలుపు
హృదయాంతరాళంలోని గాయం సలుపుతుంది...

మట్టి మనుషులతో నడయాడు
ఒంటరితనపు ఎడారి దూరమై నది నీ కాళ్ళను స్పృశిస్తుంది...

రంగులన్నీ పారబోసి మట్టి తనాన్ని అద్దుకో
మనిషితనం వెలుగు నింపుతుంది...

దేహమంతా చేయి చేసి చాచు

మట్టితనం నీలోని మానవతా పరిమళాన్ని విరజిమ్ముతుంది

Sunday, August 26, 2012

వెలుతురు పిట్టలు...

అలా ఓ చాప చుట్టలో ఎర్రటి ముద్దలా
నువ్వొచ్చి వెలుగుతున్నప్పుడు....

అంతా గుమిగూడి నీ పేరు చుట్టూ
ఓ గేయాన్ని ఆలపిస్తున్నప్పుడు...

అమ్మ తన కంటి ధారను రెప్పల మాటున
ఉగ్గబట్టి నీ కనుపాపలు ముద్దాడుతున్నప్పుడు...

నీ ఒంటి గాయాలను తడుముతు వేళ్ళ చివరి అంచుల
నాన్న వెన్నపూసవుతున్నప్పుడు...

ఆమె దు:ఖాన్ని గొంతులో సుళ్ళుతిరుగుతుండగా
నేలపై నీ పేరును ముగ్గు వేస్తున్నప్పుడు...

గోధూళి వేళ లేగ దూడ మూగగా
తల్లి పొదుగును చేరక దిగులుపడుతున్నప్పుడు...

తూర్పు వాకిట కాకులన్నీ గుంపుగా
నీ చావు అబద్ధమని చాటుతున్నప్పుడు...

వెలుతురు పిట్టలు నీ గుండెలపై
ఎర్ర వస్త్రం అలంకరిస్తున్నప్పుడు....

నెత్తురు చిమ్మిన ముఖంతో సూరీడు రేపటి ఉదయాన్ని
వాగ్ధానం చేస్తూ నేల తల్లి ఒడిలో వాలిపోతూ.....

Friday, August 24, 2012

సగం కాలిన నెలవంక..


ఆకాశమంత అందనంత ఎత్తులో
నీవు...

నేలబారున అగాథపు అంచుల లోయలో
నేను...

దేహమంతా పూసుకున్న నీ ఊహల పరిమళంతో
నేను...

ఒక్క మాట కూడా రాని మౌన ప్రమాణంతో
నీవు...

రాని అతిథిలా సుదూర తీరాన ఒంటరి నావపై
నీవు...

కాలమంతా కరిగిపోతూన్న మంచు గడ్డపై
నేను...

శిశిరాన మునిమాపు వేల మబ్బుల తెరల మాటున దాగిన వెన్నెలలా
నీవు...

ఎడారి అంచుల కాష్టపు కారు మేఘాల మాటున సగం కాలిన నెలవంకలా
నేను...


Saturday, August 18, 2012

వాగ్ధానం..

నీవు చేత పట్టిన ఎర్ర జెండా
నేల నాలుగు చెరగులా
పచ్చదనాన్ని పూత వేస్తుంది...

నీ ముఖాన ఈ చిర్నవ్వు

లోకమంతా వెలుగు దివ్వె కావాలి...

కాలి కింది నేల

కార్పొరేట్ సొంతమవుతున్నప్పుడు
చేతపట్టిన ఈ అరడుగు ఎర్ర గుడ్డ
వాడిని పరుగు పెట్టిస్తుంది...

క్రొన్నెత్తురుతో తడిసిన

ఈ జెండా రేపటి తరానికి
భవిష్యత్తును వాగ్ధానం చేస్తుంది...

Thursday, August 16, 2012

ఆటోగ్రాఫ్...


వడిగా విడిపోతున్న వలయాల మధ్య
ఓ కిరణంలా దూసుకుపోతూ నువ్వు....

ఒక్కో సంకెలా తెగిపడుతున్న వేళ
ఓ గజ్జెల మోతలా తాండవిస్తూ నువ్వు....

రెప రెపలాడుతున్న జెండా గుడ్డలా
ఒకే రంగులో అలరిస్తూ నువ్వు....

రహస్యాలన్నీ ఉల్లిపొరలా వీడిపోతున్నప్పుడు
డప్పుల మోతలా మోగుతూ నువ్వు....

అచ్చెరభ శరభా అంటూ ఊరేగింపు సాగుతున్న వేళ
చంద్రప్రభలా ప్రభవిస్తూ నువ్వు....

యిన్ని దీపకాంతుల వరుసల మధ్యగా
ఓ తారాజువ్వలా మండుతూ వెలుగుజిమ్ముతూ నువ్వు.....

ఆశయాల అరచేతుల కలయికలో
గట్టిగా బిగించిన పిడికిలిలా నువ్వూ నేను.....

చివరి చిరునవ్వు సంతకంతో
నీవందించిన ఆటోగ్రాఫ్ చెరగని ముద్రతో నేనిలా....

Monday, August 13, 2012

నిలబడుతూనే వుంటాం...

ఇప్పుడిప్పుడే తల ఎత్తి నిలబడే
నా ప్రయత్నాన్ని హత్య చేసేందుకు నీ కుతంత్రం...

నీ ముందు తలపాగా చుట్టి
నిలబడినందుకు నా గుండెల్లో బల్లెం పోటు...

నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసినందుకు
నా కంట్లో కారం చల్లి కనుగుడ్డు పెరికించావు...

నీవాక్రమించుకున్న నేలలో జానెడు జాగాలో
దుక్కి దున్నినందుకు నా గొంతులో గునపం పోటు...

బానిస బతుకు వద్దనుకుని గట్టిగా
ఓ అడుగు ముందుకు వేసినందుకు నా కాళ్ళపై రోకలి పోటు...

నీ ముందు తెల్లని చొక్క తొడిగినందుకు
నా చర్మమంతా ఒలిచి రక్తం పులుముకున్నావు....

పచ్చని చీర కట్టిన నేరానికి
నా ఆలి ముఖంపై నీ ముళ్ళ పాదం ముద్ర....

మా వాటా మాకు కావాలన్నందుకు
నీ కళ్ళలో నిప్పులు పోసుకొని మా బతుకులార్పజూసావు...

తరాలుగా మా ప్రశ్నలకు బదులివ్వలేక
కారంచేడు చుండూరు పదిరికుప్పం వేంపెంట లక్ష్మీపేటలు....

యిలా శ్మశానాలు సృష్టిస్తూ భయపెట్టాలని చూస్తున్నావు!
అయినా సరే ప్రతిసారీ మేము లేచి నిలబడుతూనే వుంటాం....

(లక్ష్మీపేట దళిత మృత వీరుల స్మృతిలో)

Thursday, August 9, 2012

ఎడారితనం...


రాయలేక పోవడం కూడా
అక్షరాల ఆత్మీయతను తెలుపుతుంది...

ఆకు రాలిన కాలంలో
పచ్చదనం గొప్పదనంలా...

గొంతెండిన వేళ
నీటి చుక్క దొరకనితనంలా...

చెప్పుల్లేని ఎండాకాలంలో
తారంటుతున్న పాదం మంటలా...

దుప్పటి దొరకని
చలిరాత్రి నిప్పు రాజేయలేనితనంలా...

కాలుతున్న కడుపులో
ఓ ముద్ద వేయలేనితనంలా...

చుట్టూ అక్షరాలన్నీ ఒక్కోటీ
వెక్కిరిస్తూ ఉలికి అందని శిలలా....

కుంచెకంటని రంగు
కాగితంపై అటూ ఇటూ అలుక్కుపోయినట్టుగా...

గొంతు దాటని రాగం
లోలోన సుళ్ళు తిరుగుతూ ఊపిరాడనితనంలా....

ఏదీ రాయలేనితనం పాడలేనితనం
దృశ్యీకరించలేనితనం ఎడారితనం కదా...

సూరీడు ముఖాన నెత్తురి మరక..


ఈ తెల్లవారే సూరీడు
ముఖాన మీ నెత్తురి మరక...

గాయపడ్డ అడవి
గర్భశోకంతో నెత్తురు మడుగైంది...

ఒక్కొక్కరు ఒకే కలను కంటూ
ఒరిగి పోతూ పిడికిలెత్తుతూ...

చుట్టూరా కమ్ముకున్న వేట గాళ్ళ
మధ్య పోరాడుతూ మందుగుండవుతూ...

వారి కలలను చిదిమేయాలని
గుండెలపైనే కాదు మెదళ్ళనూ చీలుస్తూ గుళ్ళ వర్షం...

నవ్వుతూ వాడి ఓటమిని
చూస్తూ ఎరుపెక్కిన తూరుపు తీరం...

ఆశయాలను అంతం చేయాలన్న
వాడి కలను చిద్రం చేస్తూ తూటా దెబ్బతిన్న లేగ దూడ రంకెవేస్తూ....

దేహమంతా కప్పుకున్న నెత్తుటి వస్త్రాన్ని
జెండాగా ఎగురవేస్తూ అడవి తల్లి దిక్కులు పిక్కటిల్లెలా నినదిస్తూ...

(1998 ఆగస్టు 9 న ఒరిస్సా రాష్ట్రంలోని కోపర్ డంగ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పులలో్ అమరులైన 13 మంది ప్రజావీరుల స్మృతిలో. తొలిసారిగా రాజ్యం హెలికాప్టర్ నుండి కాల్పులు జరిపిన దారుణ సంఘటన.)

Sunday, August 5, 2012

మళ్ళీ కలుసుకుందాం...

నువ్వలా నాకంటే ఎప్పుడూ త్వరగా తొందరగా వేగంగా
నడుచుకుంటూ వెళ్ళీపోతూ తిరిగి నవ్వుతూ చూస్తుంటే
నా ఆయాసానికి నాకే నవ్వొచ్చేది....

కానీ నీ నడక అలా ఆ చందమామ దాకా సాగిపోయిందని
ఇప్పుడే తెలిసి ఒక్కసారిగా ఏదో మబ్బు ముఖాన
యింత మసి రాసిపోయినట్టై గుండే చుట్టూ వరద గూడు కట్టింది నేస్తం...

నువ్వు ఒరే అనక నేనేదో పెద్ద వాడిలా
చేస్తున్న నౌకరీకి గౌరవించి పిలిస్తే ఒక్కటిచ్చుకొని అలా కాదురా
మునుపు లాగే ఆప్యాయంగా పిలవరా అన్న
నా మాటకు నీ గుండెకత్తుకున్న జ్నాపకం నేడు నా కళ్ళలో ధారగా కురుస్తోంది....

స్కూలులో పంచుకున్న కూరల రుచి
ఇంకా నాలుకపై అలానే వుందిరా...

భుజంపై మనిద్దరి పుస్తకాల సంచీ బరువు
ఇంకా వేలాడుతూనే వుందిరా...

ఖాళీ అయిన నా పెన్నులో
నీవు నింపిన సిరా చుక్కలు యింకా మిగిలే వున్నాయిరా...

నాతో ఒక్క మాటైనా చెప్పకుండా
అలా ఉరుకులు పరుగులు పెడుతూ ఒంటరిగా పయనమయ్యావా మురళీ...

నాకోసం నీ పక్కనే ఒకింత చోటు వుంచు నేస్తం
మళ్ళీ కలుసుకుందాం ఓ బూందీ పొట్లంతో....

(ఈ రోజు స్నేహితుల దినం సందేశం తన మొబైల్ కు పంపించగా నా బాల్య మిత్రుడు మురళీ కొడుకు ఫోన్ చేసి తను చనిపోయి ఏడు నెలలయ్యింది అని చెప్పడం నాకు అశనిపాతమయ్యింది. అనారోగ్యంతో వున్నాడని తెలిసి పలకరిస్తే బాగయ్యిందిరా అని చెప్పాక మరల తనతో కాంటాక్ట్ లేక ఈ విషాదం ఇప్పుడే తెలిసింది.. ఈ రోజు ఈ వార్త ఇలా పంచుకోవాల్సి రావడం బాధాకరం)

ఊరు...ఊరు విడిచి వెళ్ళ బుద్ది కాదెందుకో..

అవును పురిటి వాసనేసినప్పటినుండీ
అలవాటైన ఈ నేల ఈ గాలి ప్రతి శ్వాశలోను
ఇంకి దేహమంతా పరిమళిస్తూంది....

ఇవే ముఖాలు ఇవే మాటలు
అవే యాస అవే జీవితాలు
అవే అనుబంధాలు అవే స్నేహాలు
అవే కోపాలు అవే తాపాలు
అవే కొమ్మలు అవే కొండలు
అవే నదులు అవే రహదారులు
అదే రుచి అదే కమ్మదనం
అదే అమ్మతనం
అలా అంటుకు పోయిందెందుకో...

తెగని ఈ బంధం
ఎడబాటుకు ఓర్వలేదెందుకో
ఈ నెమ్మదితనం ఈ అమాయకత్వం
అలా గుండె చుట్టూ వెలుతురు గూడు కట్టుకున్నది...

ఏదో వలస పక్షిలా అద్దె రెక్కలతో ఎగిరి
ఆ నగరపు జనారణ్యంలో ఒక్కసారి
తిరిగి వచ్చినా ఇమడలేనితనం...

ఏదో పరాయితనం వెంటాడుతూ
పరుగులు పెట్టిస్తున్న ఆ పయనం
నిలవనీయదు ఆ కాంక్రీటు జంగల్ మధ్యన....

ఈ కాకి పిలుపు లేని ఉదయం తెల్లారనీయదు...
ఇక్కడి ఆవు అంబా అంటూ ఆప్యాయంగా
నాలుక చాపుతూ లేగ దూడను సాకేతనం అగుపడక
పాకెట్లలో బందీకానితనం పరుగులు పెట్టిస్తుంది....

ఇక్కడి వేప పుల్ల తీయదనం
పెదవుల చివరంటా రుచిస్తూ స్పృశిస్తూంది...

ఆకలి దప్పు;లు సహజంగా స్వీకరించే గుణం
ఎందుకో అడుగు బయటపడనీయదు...

ఈ నేలతో పేగు బంధం విడదీయరానిదిగా
ఏదో ఋషిత్వాన్ని ఆపాదిస్తూ
ముందరి కాళ్ళకు బంధం వేస్తూంది....

ఈ అమ్మతనం దూరం కానీయకు...


Friday, August 3, 2012

స్వప్నానికావల...


ఆది అంతం మధ్య
ఊగిసలాట నా హృదయ విలాసం...

అక్షరాలన్నీ అనుభూతుల దారంతో కుట్టుకుంటూ
ఓ వీలునామా నా కవిత్వం...

ఆ మధ్యన ఓ చిగురాకు నునులేతదనాన్నిఅద్ది
ఇంత లేలేత వర్ణాన్ని పొదిగి
అప్పుడే అరవిచ్చుకున్న శిశువు కనుదోయిలా
కాగితంపై ఒలికిపోతూ...

పంచుకున్నది విషాదమైనా ఆనందార్ణవమైనా
ఓ నిటారు కొమ్మలా స్వేచ్చగా
లేలేత సూర్య కిరణంలా
ఓ గాలి తిమ్మెరలా
కొండరాతిమీంచి జారిపడే జలపాతంలా
సహజంగా సహానుభూతిగా
ఓ మెత్తని ముఖమల్ స్పర్శలాంటి కరచాలనంలా
హృదయాన్ని తాకాలన్నదే నా స్వప్నం...

Wednesday, August 1, 2012

పచ్చని వెలుగు పావడా

ఒక్కో వరి నాటుతో పుడమి తల్లికి
పచ్చని చీర నేత...

కనులముందు పరచుకున్న

పచ్చని వెలుగు పావడా...

ధరణి నిండుగా
మారిన పసుపు సంద్రంలా...

నేల తల్లి ఒడిలో
ఆకు పచ్చ చందమామ పులకరింత...

Related Posts Plugin for WordPress, Blogger...