Sunday, August 5, 2012

మళ్ళీ కలుసుకుందాం...

నువ్వలా నాకంటే ఎప్పుడూ త్వరగా తొందరగా వేగంగా
నడుచుకుంటూ వెళ్ళీపోతూ తిరిగి నవ్వుతూ చూస్తుంటే
నా ఆయాసానికి నాకే నవ్వొచ్చేది....

కానీ నీ నడక అలా ఆ చందమామ దాకా సాగిపోయిందని
ఇప్పుడే తెలిసి ఒక్కసారిగా ఏదో మబ్బు ముఖాన
యింత మసి రాసిపోయినట్టై గుండే చుట్టూ వరద గూడు కట్టింది నేస్తం...

నువ్వు ఒరే అనక నేనేదో పెద్ద వాడిలా
చేస్తున్న నౌకరీకి గౌరవించి పిలిస్తే ఒక్కటిచ్చుకొని అలా కాదురా
మునుపు లాగే ఆప్యాయంగా పిలవరా అన్న
నా మాటకు నీ గుండెకత్తుకున్న జ్నాపకం నేడు నా కళ్ళలో ధారగా కురుస్తోంది....

స్కూలులో పంచుకున్న కూరల రుచి
ఇంకా నాలుకపై అలానే వుందిరా...

భుజంపై మనిద్దరి పుస్తకాల సంచీ బరువు
ఇంకా వేలాడుతూనే వుందిరా...

ఖాళీ అయిన నా పెన్నులో
నీవు నింపిన సిరా చుక్కలు యింకా మిగిలే వున్నాయిరా...

నాతో ఒక్క మాటైనా చెప్పకుండా
అలా ఉరుకులు పరుగులు పెడుతూ ఒంటరిగా పయనమయ్యావా మురళీ...

నాకోసం నీ పక్కనే ఒకింత చోటు వుంచు నేస్తం
మళ్ళీ కలుసుకుందాం ఓ బూందీ పొట్లంతో....

(ఈ రోజు స్నేహితుల దినం సందేశం తన మొబైల్ కు పంపించగా నా బాల్య మిత్రుడు మురళీ కొడుకు ఫోన్ చేసి తను చనిపోయి ఏడు నెలలయ్యింది అని చెప్పడం నాకు అశనిపాతమయ్యింది. అనారోగ్యంతో వున్నాడని తెలిసి పలకరిస్తే బాగయ్యిందిరా అని చెప్పాక మరల తనతో కాంటాక్ట్ లేక ఈ విషాదం ఇప్పుడే తెలిసింది.. ఈ రోజు ఈ వార్త ఇలా పంచుకోవాల్సి రావడం బాధాకరం)

9 comments:

  1. వచ్చే జన్మ లో మీరిద్దరూ మరలా స్నేహితులు గా ఉండాలని ఆశిస్తూ..!

    ReplyDelete
  2. జాతస్య మరణం ధృవం. మిత్రుడి జ్ఞాపకాలే తోడు. మీకు నా సానుభూతి.

    ReplyDelete
  3. వర్మాజీ, మీ పోస్ట్ కలచివేసింది. మీ మిత్రుడు ఇంకా వెనక్కి తిరిగి మిమ్మల్ని చూస్తూ చిరునవ్వు నవ్వుతున్నట్టుంది మీ కవిత చదువుతూ వుంటే. స్వర్గంలో ఉన్న మురళి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

    ReplyDelete
  4. వర్మ గారూ!
    స్నేహితుల రోజు నాడే మీ ఆప్తమిత్రుని మరణం
    నిజంగా తీరని లోటే...
    ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ..
    @శ్రీ

    ReplyDelete
  5. Dukhaanni panchukunna mitrulandariki dhanyavaadaalu..

    ReplyDelete
  6. ఆ జ్ఞాపకాలు గుండెను మెలితిప్పుతున్నాయ్, ఓ స్నేహితుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ......

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయతకు ధన్యవాదాలు భాస్కర్జి

      Delete
  7. జీర్ణం చేసుకోలేని వార్త.మీ స్నేహం ఎంత గొప్పదో మీ కవితలో అర్థమవుతుంది. so sorry to hear this.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...