Tuesday, March 20, 2012

టక్ టక్...టక్ టక్...



నువ్ టక్ టక్ మంటూ కిటికీ అద్దంపై
శబ్ధిస్తూ నిద్రలేపే ఉదయం మాయమై
నేడు నా కలత నిద్ర సాగుతున్నది
మిత్రమా....

నీవంటూ మాయమవుతున్న
సమయాన మా చెవులు
చిల్లులు పడుతూ మోగుతున్న
సెల్ శబ్ధ కాలుష్యం నిన్ను
మాయం చేస్తూ
మాకు ఎడారి బీడును వాగ్ధానం చేస్తున్నది మరిచిపోతూ
కాల్పనిక లోకంలో బతుకుతున్నాం...

బాంధవ్య రాహిత్యాన్ని
గుర్తు చేస్తున్న
నీ రాలిపోతున్న ఈక
నా మెదటి గూటిలో
ఓ సజీవ సాక్ష్యం....

నువ్వు లేని సంక్రాంతి ముగ్గు
వర్ణం కోల్పోయి పాలిపోయింది...

నువ్వు ఎంగిలి పడని వరి కంకులు
రుచిని కోల్పోయి గడ్డిగా మిగిలాయి...

రా నేస్తం...
అని పిలవాలని వున్నా
చేస్తున్న ద్రోహం గొంతులో
పలకని నిశ్శబ్ధ పిలుపై
మూల్గుగా...


(నేడు పిచ్చుకల దినోత్సవం సందర్భంగా)

14 comments:

  1. బాంధవ్య రాహిత్యాన్ని
    గుర్తు చేస్తున్న
    నీ రాలిపోతున్న ఈక
    నా మెదటి గూటిలో
    ఓ సజీవ సాక్ష్యం....

    చాలా బాగుందండీ.. ఎన్నాళ్ళైందో పిచ్చుకని చూసి.

    ReplyDelete
    Replies
    1. సుభగారూ థాంక్సండీ...పిచ్చుకల అంతర్థానానికి సెల్ టవర్లే కారణమని తెలిసినా ఏం చేయలేక పోతున్న మనమంతా యిలా బాధపడడం కన్నా ఏం చేయలేం కదా...:-(

      Delete
  2. వర్మగారూ కదిలిస్తోంది మీ కవిత...

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయి గారూ ధన్యవాదాలు...

      Delete
  3. అద్బుతంగా ఉంది వర్మ గారు ... మొబైల్ వాడే వారెవ్వరూ కుడా వాటిపై జాలి పడడానికి కుడా అనర్హులు ... నాతొ సహా, అందుకే మీ కవితలో చివరి రెండు పంక్తులు నిజం.....!

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ రాజేష్ గారూ...నాతో మాట కలిపినందుకు...

      Delete
  4. "నువ్వు లేని సంక్రాంతి ముగ్గు
    వర్ణం కోల్పోయి పాలిపోయింది...

    నువ్వు ఎంగిలి పడని వరి కంకులు
    రుచిని కోల్పోయి గడ్డిగా మిగిలాయి"
    నిజమే కదా!!!:-(

    ReplyDelete
  5. చాలా బాగుంది. కదిలించారు వర్మ గారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండీ జలతారు వెన్నెల గారూ..

      Delete
  6. నగరాలలో ఏమో కానీ పల్లెలలో..అక్కడక్కాడా పిచ్చుకలు కనబడుతున్నాయి. వాటిని కాపాడుకోవడం మన విధి.

    చాలా బాగుంది. కదిలించే హృదయావిష్కరణ .

    ReplyDelete
    Replies
    1. నిజమేనండీ పూర్వం గుంపులు గుంపులుగా ఎగిరేవి..ఇప్పుడు ఒక్కటో రెండో కనిపిస్తున్నాయి...
      థాంక్యూ వనజవనమాలిగారూ..

      Delete
  7. మీరు ఎన్నుకున్న కవితా వస్తువు పిచ్చుక మా బళ్ళో మమ్మల్ని రోజు పలకరిస్తుంది.ఎన్ని పిచ్చుకలో !మా స్కూల్ లోని అద్దం ముందు తనని తాను చూసుకుని ఎంత మురిసిపోతుందో!దాని స్వేచ్చను మనం హరిస్తున్నాం .పట్టణాల్లో cell towers వాటిజీవనాన్ని చిద్రం చేస్తున్నాయి.వాటితోపాటు మనుషుల ఉనికికే ఈ towers వలన ముప్పు వచ్చిందని నివేదికలు.మనిషి తన మనుగడనే మరిచి ప్రవర్తిస్తున్నాడు.చక్కటి,చిక్కటి కవిత.

    ReplyDelete
    Replies
    1. oddula ravisekhar గారూ మీ స్పందనకు ధన్యవాదాలు...స్వేచ్చను హరించడం అభివృద్ధి ముసుగులో మనల్ని మనం కోల్పోతున్నామనే స్పృహ లేనితనం బాధాకరం..కూచున్న కొమ్మనే నరుక్కునే మూర్ఖత్వం కదా...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...