Friday, January 25, 2013

ఆకుపచ్చని ఆకాశం...

పారే సెలయేటి నవ్వునలా
మీరు దోసిట పట్టి
వెన్నెలలో తెలుపు నలుపుల
హోళీ ఆడుతూ…

వాడొక్కో అడుగూ
చదును చేస్తూ
ఆక్రమించుతూ
వ్యాపిస్తున్నాడు….

వింధ్య నుండి
నియాంగిరీ వరకూ
మహానది నుండి
బ్రహ్మపుత్ర వరకూ
కోటయ్య బాట వేసి పోయాడు…

ఆ మూల
నీవు చాపిన చేయి
అందుకుని ఈ చివురున
నేను ఓ జెండా పాతుతూ
సరిహద్దుల కీవల…

వాడు ఒక్కో నదినీ
పుక్కిట పట్టి
మెల్లగా వ్యాకోచిస్తున్నాడు…

అటూ ఇటూ
వాడికొక్కడే పచ్చగా
నవ్వుతూ తుళ్ళుతూ
చావు బంతిని విసురుగా
తంతూ ఆడుతూ కనిపిస్తున్నాడు…

బూడిద పూసుకొని
వాడు ఒక్కో భాగంగా
విడగొడుతూ సవాల్ జేయ వస్తున్నాడు…

రానీ!
ఇక్కడ క్లేమోర్లయి
గుండెనిండా నిబ్బరాన్ని శ్వాసించి
ఆకుపచ్చని ఆకాశాన్ని కప్పుకొని
నిలబడి చూస్తున్నాం….

(ఆపరేషన్ గ్రీన్ హంట్ దాడికి వ్యతిరేకంగా)
ఈ కవిత ఈరోజు విడుదలైన వాకిలి మేగజైన్లో వచ్చింది..

No comments:

Post a Comment

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...