తడి ఆరని జ్ఞాపకం...
నిన్న మొన్నటి జ్ఞాపకం
నా కంటి తెరచాపల మాటున కదలాడుతోంది...
ఉబికిన కన్నీళ్ళు ఉగ్గబట్టుకున్న దు:ఖం
సుడులు తిరుగుతుండగా యిప్పటికీ
మీ కరచాలనపు స్పర్శ వెచ్చగా
గుండెల్లో దాగి వుంది..
పండు వెన్నెలలాంటి మీ నవ్వు
వాన వెలిసిన రాత్రి మబ్బులు వీడిన
చంద్రుని మోములో ప్రతిఫలిస్తుంది...
గలగల పారే సెలయేళ్ళు
మీ మాటల ఊసులు విన్పిస్తున్నాయి...
వడివడిగా పారే వాగులు
మీ నడకలోని వేగాన్ని గుర్తుకు తెస్తున్నాయి...
పచ్చటి వరిచేలు యూనిఫాంగా మారి
మిమ్మల్ని గుండె గదిలో దాచుకుంటాం రారమ్మని
పిలుస్తున్నట్టుగా వున్నాయి...
ఎత్తైన శిఖరాలు మీ నిబ్బరానికి
శిరసు వంచి నమస్కరిస్తున్నాయి...
మీ అమరత్వపు అరుణిమను అద్దుకొని
నెత్తుటిముద్దైనాడు సూరీడు...
మిత్రులారా
నా గుండెల్లో దాగిన చెమ్మ ఎప్పటికీ మీ
త్యాగాన్ని మరువనివ్వదు
మీరెత్తిపట్టిన ఝెండాను
ఒరగనివ్వదు....
(1998 ఆగస్ట్ 09 న జరిగిన కోపర్ డంగ్ ఎన్ కౌంటర్ అమరుల స్మృతిలో- ప్రచురణ ఏప్రిల్ 2002-అరుణతార)
No comments:
Post a Comment
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..