Thursday, March 13, 2014

పాత చొక్కా


అవును ఆ పాత చొక్కా ఎప్పుడూ అలా
నా మనసు కొక్కేనికి వేలాడుతూనే వుంది

బొత్తాం వూడిన ప్రతి సారీ అమ్మ కళ్ళు చిట్లిస్తూ
సూది బెజ్జంలో ప్రేమ దారాన్ని చేర్చి కుడుతున్నట్టు

బస్సెక్కేటప్పుడు తోపులాటలో చినిగి వస్తే నాతో పాటు
తననూ ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని నాన్న అతుకు వేస్తున్నట్టు

మాసి పోయినప్పుడల్లా నెమ్మదిగా పులుముతుంటే
రంగు వెలసిన జ్నాపకమేదో మసకగా కంటి నీటి పొర వెనక కదులుతున్నట్టు

యింకా వదలని పిట్ట రెట్ట మరక చెవిలో
ఆ కువ కువ వేకువనింకా పల్లవిగా ఆలపిస్తున్నట్టు

వీచే చల్లగాలిని ఆప్యాయంగా ఒడిసిపట్టి అలసిన
దేహానికి తన బిగువులో  కాసింత సేద దీరుస్తున్నట్టు

ఆ జేబులో దాచుకున్న గులాబీ రేకు
తననింకా ఆ మలుపుకు గురుతుగా దాచి వుంచినట్టు

ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!

(తే 13/03/2014 దీ 08.09 PM )

6 comments:

  1. ఎంత కాలమైనా ఆ పాత చొక్కా చిన్ననాటి వాసనలను
    మడతలలో దాస్తున్న మంత్రపు దారప్పోగుల నేత నాకు!!
    chaalaa rojula tarvataa blogworld ku vaccharu..ani kopanni chuppiddam anukunte..manchi venna mudda laanti kavitato itte naa kopaanni teesesaaru.:):)chaalaa baagundi kcube varma gaaru:):)

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయతకు ధన్యవాదాలు కార్తీక్ గారు. ఈ మద్య ఏమీ రాయలేక రాలేక పోయానిక్కడకు. థాంక్యూ..:-)

      Delete
  2. పాతచొక్కా వాసనతో జ్ఞాపకాలు మీకు, మీ జ్ఞాపకాల కవితను ఆస్వాధిస్తూ మేము :-)

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందన కొరకు ఎదురు చూస్తూ నేను.. :-)
      ధన్యవాదాలండీ పద్మార్పిత గారు..

      Delete
  3. kavitha kotha chokka thodukkundi

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన ప్రతిస్పందనకు ధన్యవాదాలు భావరాజు శ్రీనివాసు గారు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...