కర్ఫ్యూ......
ఇప్పటికిక
తెరలు అవనతం చేద్దాం రండి ఇన్ని రాళ్ళ గాయాల మద్య స్రవించని నెత్తుటి
బొట్లను చిదుముకుంటూ విరిగిన కొమ్మలను అతుక్కుంటూ రేగిన జుత్తును
సవరించుకుంటూ రంగును కడుక్కుందాం
మరో మారు ఉదయాస్తమయాల సంధి
సమయంలో ఊదారంగు సూర్యున్ని రక్త వర్ణ చంద్రున్ని దూలానికి వేలాడగట్టి ఒకింత
పసుపు ముద్దను గుమ్మానికి పూసి అందరినీ ఆహ్వానిద్దాం
ఎవరో తెగ్గోసిన నాలుక చేతపట్టిన యువకుడు పళ్ళ మద్య బాధను బిగుతుగా కరచిపట్టి పాదాలను మెట్లకానకుండా ఎక్కుతూ వస్తూ పాట పాడుతున్నాడు
మీకింక వినబడదులే ఎందుకంటే అతని కనులనెవరో పెకలించి వెనకకు విసిరేసారు
రాతిరింత చిక్కగా ఓ గాజుముక్కను అతుక్కుంటూ రొప్పుతూ తన చివరి డైలాగు నెవరో
చెప్పకముందే చెప్పాలని ఆత్రంగా వస్తున్నాడు
ఆగండి మరో మారు
నరకబడ్డ విదూషకుని చేతులలోని అతుకుల కఱ పటక్ పటక్ మంటూ మీ పిరుదులపై
చరుస్తూ మీ చేతుల నిశ్శబ్ధ చప్పట్లను గాల్లోనే ఒడిసి పడ్తూ వేదిక నిండా
నవ్వులు పరుస్తున్నాడు
ఈ కర్ఫ్యూ వాసనింకా వేస్తూనే వుంది
బాలింతరాలి నెత్తురి స్రావంలా ఆగకుండా అన్ని వీధుల్లోనూ కురిసిన రాళ్ళ వాన
మద్య కు(య్ కు(య్ మంటూ నెత్తురోడుతున్న కుక్కపిల్ల దైన్యపు చూపులా ఆ వీధి
లాంతరు వెలుగుతూ
ఊరి చివర ఎత్తు కానాల బ్రిడ్జి వెనక చింత చెట్టు
కొమ్మకో వేలాడుతున్న యువకుని దేహం మిమ్మల్ని ప్రశ్నిస్తూ వుండడాన్ని
సహించలేని తనంతో చెప్పులొదిలి మీరంతా పగిలిన గాజు పెంకులపై పరుగు పెడుతూ
ఆగండి ఈ తెరనింక చించేద్దాం ఈ రాత్రికి మీరు నాలుగు వాలియం .5 మాత్రలు
మింగి ప్రశాంతంగా నిద్దరోయి విరిగిన మంచంపై నుండి శుభోదయం కోసం పడమర తిరిగి
ఆర్ఘ్యం వదులుదురు...
మొత్తం కర్ఫ్యూని కళ్ళకి కట్టినట్లు చూపించారు.
ReplyDeleteఒకప్పుడు 'కర్ఫ్యూ' అనేది హైదరాబాద్ వాసులకు తప్ప ఎవరికీ తెలిసేది కాదు :-( చక్కగా అభివర్ణించారు.
ReplyDeleteస్పందించేలా రాసారు...
ReplyDeleteఅమాయకులే కదా అల్లల్లాడుతున్నది....ఎప్పటికి ఆగుతుందో ఈ సెగ