Thursday, October 24, 2013

నల్ల కుందేలు పిల్ల..


నీ చుట్టూ పొడారినతనం మద్య ఇక్కడో చెలమ వూట వుబికితే బాగుణ్ణని
ఎంతలా చేతులు చాచి ప్రార్థించావు...

అరిగిపోయి మొండిబారిన నీ వేళ్ళు గరకుగా నా మొఖంపై యింత తడితనాన్ని
రుద్దుతూ నువ్వు కళ్ళలోకి చూస్తుంటే తూనీగ రెక్కలపైనుండి మళ్ళీ బాల్యంలోకి గెంతువేసినట్టైంది...

నీ మాసిన మసిబారిన కొంగును వేళ్ళకు చుట్టుకుంటూ నీ చుట్టూ అటూ ఇటూ
కాళ్ళ మద్య తిరుగుతూ నువ్వు విసుక్కోకుండా ఆగరా అంటూ యింత ప్రేమని ఉండగా చుట్టి
జేబులో కుక్కిన మరుక్షణం మాయమయి పరుగులెట్టిన క్షణాలన్నీ అప్పుడే యింత తొందరగా ఓ తుఫానులా అలా గాలికి ఒడ్డుకు చేరినట్టు నెరిసి నెర్రెలు బారిపోవడం ఎండమావే కదా??

దుఃఖాన్నంతా ఆకుదోనెలో మడిచి మాయ చేసినట్టు నీ కన్రెప్పల నల్ల వలయాల సుడిగుండాలలో దాగి
యిన్నేళ్ళ తరువాత కూడా మాంత్రికత ఏదో మింగివేసినట్టు వెదురు పొదల మాటున దాగిన నల్ల కుందేలు పిల్లలా కనబడనీయక మాయం చేస్తావు!!

అమ్మా నాకింత బాల్యాన్ని ప్రసాదించవూ మళ్ళీ మళ్ళీ పుట్టాలనుంది ఆ బాలింతరపు పరిమళం ఒక్కటే మరల మరల మనిషిని చేస్తుంది కదా??

10 comments:

  1. బాల్యమనే అద్భుతమైన లోకాన్ని సృష్టించి....కలిసి ఆడి పాడిన అమ్మతనం జ్ఞాపకంగా మారడం నిజంగా ఎడారితనమే.
    ఆ కన్నుల్లో దాగిన ఆత్మీయతను గుర్తెరిగి తిరిగి బాల్యాన్ని పొందగోరితే ...ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది...
    చాలదూ మనిషిగా మారడానికి ఎంతగా తపిస్తున్నారో తెలియడానికి....

    ReplyDelete
  2. ఇది చదివిన తరువాత నాకు బాల్యంలొకి వెళ్ళాలని ఉంది...
    కాని కొంచెం బాధగా ఉంది మాష్టారు ,తిరిగి వెళ్ళలేమని.
    మీ కవిత నాకు చాల నచ్చింది

    ReplyDelete
    Replies
    1. థాంక్సండీ ఎగిసే అలలు (కార్తీక్ గారు)..

      Delete
  3. తిరిగిరాని బాల్యంపై తపన ఎందుకు?

    ReplyDelete
    Replies
    1. తిరిగి రాలేదనే.. :-(
      థాంక్యూ పద్మార్పిత గారూ

      Delete
  4. బాల్యం అందరికీ అంతే తియ్యగా ఉండదు మాష్టారూ.. కొందరు బాలల బాల్యపు బతుకులు ఇంకా మసిబారినతనంలోనే ఉన్నాయి..!!

    ReplyDelete
    Replies
    1. ఈ అసమాన సమాజంలో సహజమే కదా gnkvarma గారు..
      మీ స్పందనకు ధన్యవాదాలు..

      Delete
  5. ఆ బాల్యం తిరిగి వస్తే ఎంత బాగుంటుందో

    ReplyDelete
  6. కదా అనికేత్.. ప్చ్...
    థాంక్యూ అనికేత్..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...