Tuesday, July 31, 2012

గోడ మీది పూలు...

ఈ నాచు పట్టిన గోడ పక్కగా
తడిచిన పూలను కోసి గుత్తుగా
నీ చేతిలో వుంచి
కళ్ళలో వెలుగు చూసిన గురుతు...

ఆ తడి ఇంకా ఆరనే లేదు
ఈ గోడపై ఎండిన నాచు పెళ్ళలు పెళ్ళలుగా
రాలి ఏవో అస్పష్ట ఆకారాలు
నలుపు తెలుపుల రంగు మాధ్యమంలో...

ఆ వెలుగు జిలుగు
ఈ కంటి రెప్పలు దాటి బయట మెరియనే లేదు
సంధ్య కాంతిని పులుముకుంటూ
కొండ వాలులోకి జారిపోతూ....

ఆ చేతి మృధుత్వం
అలా నరనరాన ప్రవహిస్తూ వానలో కరిగిపోనూ లేదు
గోధూళిని దోసిలిలో నింపుతూ
మస్తిష్కంలో రంగుటద్దంపై అలికినట్టూ...

ఆ అడుగుల సవ్వడి
అలా అలల వెల్లువలా ఒడ్డుకు చేరనూ లేదు
రాళ్ళ గవ్వల ఒరిపిడిని రాగంజేస్తూ
మనసులో అసంపూర్ణ గేయమైనట్టూ...

ఆ గాయపు గురుతులేవో
కలల దేహంపై ఎర్రగా చారలుదేరుతూ
స్వేదమింకిన నేల బీటలు వారుతూ
కణకణ మండే ఉచ్వాశ నిశ్వాశలైనట్టూ....

చివరిగా ఆ గోడపై ఓ చిగురు తొడిగిన
మొక్క పచ్చగా పైకెగబాకుతూ
వేకువ వెలుగు రేఖల వెచ్చదనమౌతూ
గుండె అలికిడికి గురుతుగా పూస్తున్నట్టూ...

10 comments:

  1. నాలుగు లైన్లకో ప్రసంశాపదంతో స్పందించాలనుకున్నా...
    పదాలు లేవన్న 56 అక్షరాలపై అలిగి ఇలా మిన్నకున్నా!

    ReplyDelete
    Replies
    1. వావ్...అక్షరాలపై అలిగినట్టే అలిగి గొప్ప ప్రశంసాపదాన్నిచ్చిన మీకు స్నేహాంజలులు పద్మగారూ...

      Delete
  2. చక్కగా రాశారండి, అభినందనలు.

    ReplyDelete
  3. గుండె అలికిడికి గురుతుగా పూస్తున్నట్టూ....అంటూ చిగురుతొడిగే మొక్కతో ఇచ్చిన ముగింపు చాలా ఆశాభావం చూపింది.
    చిత్రానికి కవిత రాశారా అన్నంత చక్కగా కుదిరింది చిత్రం. మీరే చెప్పాలి, చిత్రం ముందా లేదా కవితే ముందా అన్నది.
    చాలా బాగుంది కవిత, చిత్రమూ రెండూ....

    ReplyDelete
    Replies
    1. కవితే ముందు రాసి మనసులోని గోడ చిత్రాన్నీ గూగుల్లో వెతికా చిన్ని ఆశ గారూ...
      మీ స్ఫూర్తిదాయక స్పందనకు ధన్యవాదాలు...

      Delete
  4. ఇలాంటి ఆలోచనలు ఎలావస్తాయండి మీకు భలే రాస్తారు మీరు.

    ReplyDelete
    Replies
    1. oh..అలా అడిగితే ఏం చెప్పగలను?? ఏదో అలా మదిని దొలిచేస్తే కీ బోర్డ్ పై ఒలికిపోవడమే..:) ధన్యవాదాలు Yohanth..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...