నువ్వొస్తావని
ఆశగా కళ్ళలో వత్తులేసుకొని ఎదురు చూసా.....
మాటాడాలనుకున్నవన్నీ
గుండె గదిలో ముఖమల్ మూట కట్టి దాచుకున్నా....
నీతో కలిపి తిందామని
అటుకుల మిక్చర్ దాచి వుంచా...
ఇంతలోనే వచ్చావన్న
కబురుతో గాలి పరిమళించింది....
నువ్వు వత్తిగిలి అలా రాస్తూన్న
అక్షరాల తడి స్పర్శిస్తూనే వున్నా....
ఎదురెదురుగా నవ్వుతున్న నీ కళ్ళలోకి చూస్తూ
ఏళ్ళుగా వేళ్ళూనుకున్న కబుర్ల బాకీ తీర్చుకుందామనుకున్నా..
మళ్ళీ మనం కలుస్తున్నామని
అమ్మ నీకోసం దాచిన నాన్న యిచ్చిన విభూది పొట్లం అలానే మిగిలిపోయింది...
నువ్వు మళ్ళీ నీ రెక్కల గుర్రమెక్కి
మంత్రనగరికి మాయమవుతావని తెలిసి మూగబోయా...
మళ్ళీ నువ్వొచ్చేసరికి ఈ ఎండిన నదీపాయ వెంబడి
నేనిలా మిగిలి వుంటానా??
(మా ఊరు రాకుండానే మరలి పోతున్నానని అఫ్సర్ సార్ అన్నప్పుడు ఇలా మనసెందుకో బాధ పడింది. ఎవరి పనులలో వారు కరిగిపోతున్నామన్న ఆవేదన. సరే అనుకుంటూ ఓ దీర్ఘ శ్వాశ మిగిల్చినతనం నుండి యిలా తన ముందు)
No comments:
Post a Comment
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..