Saturday, March 20, 2010

పిట్టలేని ఆకాశం



సంకురాతిరికి ముందుగానే
చూరుకు వేలాడే వరికంకుల పై
వాలి పలకరించిన పిచ్చుక గుంపులు
నేడు మచ్చుకైనా కానరాక
కోల్పోయినదాని విలువ ఏమిటో
నేడు గుర్తుకొచ్చి ఒక దీర్ఘ నిట్టూర్పుతో
సరిపిట్టుకోవడమేనా?

గుండెలో దిగులు గొంతులో పెగలక
కీచుమని అరుపు బయటకు రాలేకపోతోంది...
హరించుకుపోయిన పత్రహరితంతో
ఆకులు ఎండిన ముసలిదాని చర్మంలా
ముడుతలు పడి వొంకరలుపోయినాయి..

ఏరుకునేందుకు గింజలు జల్లిన పొలాలు కరువై
అసహజంగా పొడుచుకొచ్చిన కాంక్రీటు దిమ్మలతో
నగరం గోడపై వుమ్మివేయబడ్డ పాన్ మరకలా మారిన
నాగరికత అపహాస్యతతో కుళ్ళిన పేగువాసనలబారిన పడి
మాయమైన ఈ పిచ్చుకగుంపులోని
చివరి పిట్ట చేసిన ఆర్తనాదం
నీ చెవిన పడకుండా అడ్డుకున్న సెల్ మోత...

ఇది నీకు చివరి వీడ్కోలు కాకూడదు మిత్రమా..

(నేడు అంతర్జాతీయ పిచ్చుకల సంరక్షణ దినం సందర్భంగా)

17 comments:

  1. pichuka arupantha haayinga undi mee bhava vispotam

    - http://vinuvinipinchu.blogspot.com

    ReplyDelete
  2. చివరి పిట్ట వేదనంతా ఉంది మీ అక్షరాలలో...

    ReplyDelete
  3. ఔను. చిన్నప్పుడు వూళ్ళలో ఊరపిచ్చుకలు, కట్లె పిట్టలు, పాలపిట్టలు కనిపించేవి. అవన్ని ఇప్పుడు ఏమైపోయాయో తెలియడం లేదు. ఇలా అరుదైన పక్షులు అంతరించిపోవడం చాలా బాధాకరమైన విషయం.

    ReplyDelete
  4. @అజ్ఞాత గారూ మీ ఆత్మీయ పలకరింపునకు ధన్యవాదాలు..

    ReplyDelete
  5. @అక్షర మోహనం గారూ ధన్యవాదాలు..యిలా మీవంటి కవిమిత్రులు ప్రోత్సాహం కావాలి ఎల్లప్పుడూ..

    ReplyDelete
  6. @నాగరాజు రవీందర్... చాలా వరకు పక్షుల జాతులు, మత్స్య సంపద, అడవి జంతువులు, వనమూలికలు పర్యావరణ కాలుష్యం కారణంగా అంతరించిపోతున్నాయి. మనకు వాటి నిష్క్రమణ పట్ల వున్న ఉదాసీనత మన భవితపై తప్పక ప్రభావం చూపుతుందన్న ఎరుక లేకపోవడం నేటి విషాదం మిత్రమా..

    ReplyDelete
  7. wonderful
    baaraasaaru.

    these lines are fantastically expressing the agony

    మాయమైన ఈ పిచ్చుకగుంపులోని
    చివరి పిట్ట చేసిన ఆర్తనాదం
    నీ చెవిన పడకుండా అడ్డుకున్న సెల్ మోత...

    thank you for standing for a cause

    bollojubaba

    ReplyDelete
  8. వర్మ గారూ !
    సెల్ ఫోన్లే పిచ్చుక కూతలు కూస్తున్నాయి. ఇక అనలు పిచ్చుకల పలకరింపులు, మన పులకరింతలకు చోటెక్కడ !
    బాగా ( బాధగా ) రాశారు. అభినందనలు.

    ReplyDelete
  9. >>>మాయమైన ఈ పిచ్చుకగుంపులోని
    చివరి పిట్ట చేసిన ఆర్తనాదం
    నీ చెవిన పడకుండా అడ్డుకున్న సెల్ మోత...

    ఈ లైన్స్ Superb అండి!!

    కవిత చాలా బాగా రాసారండి.

    ReplyDelete
  10. మీ వేదనను అద్భుతంగా అక్షరీకరించారు. ఆలోచింప చేశారు.

    ReplyDelete
  11. బాబాగారూ బహుకాల దర్శనం. మీకు నచ్చినందుకు ఆనందంగా వుంది. ధన్యవాదాలు

    ReplyDelete
  12. SRRao గారు మీ అభినందనలు చూరగొన్నందుకు ధన్యవాదాలు. కానీ ఏమీ చేయలేకపోవడమన్న నిస్సహాయత బాధిస్తోంది.

    శేఖర్ సార్ మీ రాక సంతోషకరం..మీకు ధన్యవాదాలు..

    వాసు గారూ మీ ఆత్మీయ పలకరింపునకు ధన్యవాదాలు..

    ReplyDelete
  13. అంతా చెప్పేసారు నా మాటలు. ఇది హాజరుపట్టికలో టిక్కు కోసమే... బాధాకరమే కానీ నివారణ అందరి చేతిలోదీను. ఆ స్పృహ కలిగించటం ఈ వేగవంతమైన యాంత్రిక జీవనాల్లో సాధ్యమా?

    ReplyDelete
  14. ఉషగారూ మీ వ్యాఖ్య కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటా. మీ వ్యాఖ్య ప్రత్యేకంగా వుంటుంది కాబట్టి.
    స్పృహ లేకపోతున్నది మన అస్తిత్వం పట్ల కూడా కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రాణులపట్ల ఎరుక లేకపోవడాన్ని గుర్తుచేసే కృషిలో భాగంగానే ఈ దినాన్ని ఏర్పాటు చేసారనుకుంటా! యాంత్రిక జీవనం మన ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. చివరకు మిగిలేది శూన్యమా అనిపిస్తోంది. మీ రాకతో సంపూర్ణమయింది. ధన్యవాదాలు.

    ReplyDelete
  15. పిచ్చుకల గురించి మీరు రాసిన ఈ కవితని చాలా ఆలస్యంగా ఇవాళే చూసాను. చాలా బాగుంది. ముఖ్యంగా ఆఖరి వాక్యాలు గుండెని పిండేసాయి. వాటికి మనం చేస్తున్న హాని గురించి తెలుసుకునే సరికే చాలా ఆలస్యమయిపోయింది.
    ఇక పిచ్చుకల సందడులు సెల్ ఫోన్లో వినవలసినదేనా.......
    కిందటిసంవత్సరం నేను రాసిన ఒక పోస్టుని వీలయితే చదవండి.
    http://illalimuchatlu.blogspot.com/search?updated-min=2008-01-01T00%3A00%3A00-08%3A00&updated-max=2009-01-01T00%3A00%3A00-08%3A00&max-results=4

    ReplyDelete
  16. సుధారాణిగారూ మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..

    ReplyDelete
  17. నక్షలైట్ల విషయంలోసానుభూతి చూపనక్కర లేదనుకొంటాను.ఎందుకంటే వారు ఓపెన్ గానేతిరుగుబాటు ప్రకటించేరు ప్రజాస్వామ్యం వారికినమ్మకం లేదు కాబట్టి .రమణారావు

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...