Tuesday, June 22, 2010
చింతా 'దుక్కి' కవిత్వానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్...
ఉత్తరాంధ్ర బతుకు దుఃఖాన్ని తన కవితా వస్తువుగా చేసుకొని తన మాతృ యాసలో కవిత్వాన్ని రాస్తున్న మా చింతా అప్పలనాయుడు మాస్టారుకు 2009 ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్ ప్రకటించారన్న వార్త చూసి మేమంతా గొప్పైపోయాము. తను కథలు, కవిత్వంతో ఈ ప్రాంత వాసుల జీవన వెతలను రికార్డు చేస్తున్న మాస్టారికి ఈ పురస్కారం రావడం ముదావహం. మా ప్రాంతానికి దక్కిన ప్రత్యేక గౌరవంగా భావిస్తూ ఫ్రంట్ కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్బంగా వర్తమాన తెలుగు కవితా దీపస్తంభం కె.శివారెడ్డి గారు ఈ సంకలనానికి రాసిన ముందుమాటలోని వాక్యాలుః 'చింతా అప్పలనాయుడు మనముందు కూర్చొని శ్రీకాకుళం యాసలో కబుర్లు చెబుతున్నట్లు హాయిగా ఉంటుంది. చాలా సూటిగా, హాయిగా సాగిపోయే శైలి, పల్లెటూళ్ళ జీవనంలో అతలాకుతులమయిన పల్లెల జీవన దృశ్యాల్ని కతచెపుతున్నట్టు చెప్పుకుంటూ పోతున్నాడు, అతని కథా కథన పద్ధతి జానపదకథకుడు చెప్పే పధ్ధతి. అనుభవసారం గుండెనిండుగా వున్నవాడు, గొప్ప ఊహాశీలి, సంక్షోభాల్ని వర్ణించేటప్పుడు, కుతూహలం తగ్గకుండా, కన్నీళ్ళు తెప్పిస్తూ కథనడుపుతాడు. బహుశా అప్పల్నాయుడు శిల్పంకూడా యిదేనేమో' అన్నారు.
మాస్టారి కవితా పాదాలు కొన్నిః
'ఊరు ఊరంతటికీ..
ఉదయమే పొద్దు పొడుస్తుందిగానీ
నిజానికి మాలపేటలో
సాయంకాలమే సూర్యోదయమవుతుంది!
పొద్దు పోయి పోయి తిరిగొచ్చి
మాలపేట పొయ్యిల్లో దూరినట్టుంటుంది' (ఒక మాలపేట కొన్నిదృశ్యాలు)
అమెరికా వెళ్ళి పట్టించుకోని ఇంజినీరు కొడుకు గురించిః
'ఇంజీనీరువైతే..
గట్టిగూడు కట్టి నీడనిస్తావనుకున్నాను
డాలర్ పులి నోటికి దొరికి పోతావనుకుంటే
పుట్టినపుడే పుటికీసుందును!'
'నేల నా తల్లి
నాకు ఓర్పును ఒంటబట్టించింది నేలే..
ఏరు నా నేస్తం
కెరటాల్లో కొట్టుకు వచ్చే కట్టెను తెప్పజేసుకొని
ఈదులాడే విద్య నేర్పించింది ఏరే నాకు
ఏలినవారు మా దొడ్డ వారు
ఒక్క నదిని నాకు కాకుండాజేసి
రెండు నదుల్ని కానుకగా ఇచ్చారు
ఒక కంటికి కన్నీరు!
ఒక కంటికి నెత్తురు!'
'మాలోలు గుంటరా అని
మాటికీ నోళ్ళు పారేసుకుంటారు గానీ
నీలకుండతో నీలాటి రేవు చేరినప్పుడల్లా
ఆమె అందాన్ని చూసి నోళ్ళూరబెట్టుకున్నోలే!
అప్పడాల ముద్ద పేడించినట్లు
ఫెయిర్ అండ్ లౌలీ పుసుకున్నోళ్ళంతా
నాటుకోడిలా నిగనిగ మెరిసిపోయె
ఆమె ముందు ఫారం కోళ్ళే గదా?
శ్రమ జీవన సౌందర్య వేదిక మీద
ఆమె కదా విశ్వ సుందరి' (మా ఊరి మాలపిల్ల)
'మా ఊరికి నాగరికతను
మోసుకొచ్చిందని సంబరపడ్డామే గానీ
మా శ్రమ చమట చుక్కలై
ఈ రోడ్డుమీదుగానే ప్రవహించి
పట్నంలో ఇంకిపోతాయనే
ఎరుకలేని వాళ్ళం!'(కొండ)
'పెట్టుబడుల ప్రవాహమై
నా మట్టి పాదాలను చుట్టుముట్టి
ఊబిలోకి లాక్కుపోతుంటే
ఇనుప దున్నల స్వైర విహారంలో
ఇప్పుడు నేను విరిగిన నాగలిని..!'
ఇలా తన ప్రతి కవితలోను కరుణ రసాన్ని మేళవించి ఈ నేల ఆనుపానుల్ని ఎరిగిన ఈ తరం కవి చింతా అప్పల్నాయుడు మాస్టారు. ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కలం నుండి మరిన్ని కొత్త పదచిత్రాలను ఆశిస్తూ...
ఈ సంకలనాన్ని ప్రముఖ కథా రచయిత, కవి గంటేడ గౌరునాయుడు మాస్టారి నేతృత్వంలోని 'స్నేహకళా సాహితి, కురుపాం' వారు ప్రచురించారు. ప్రతులు విశాలాంధ్ర, ప్రజాశక్తి బ్రాంచీలలో లభ్యమవుతాయి.
Subscribe to:
Post Comments (Atom)
ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు విజేత చింతా అప్పల నాయుడుకి నా మప:పూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
ReplyDeleteఉత్తరాంధ్ర బతుకు గోసని నిసర్గసుందరంగా, కళాత్మకంగా అక్షర బద్ధం చేస్తున్న అప్పల నాయుడు శతథా అభినందనీయుడు.
మా చింతా అప్పల నాయుడు, మా గంటేడగౌరు నాయుడు, మా అట్టాడ అప్పల నాయుడు, మా అల , మా జగదీష్, .... యిలా ‘మా’ అని చెప్పుకోడానికి ఎంతగానో గర్విస్తాను.
అప్పలనాయుడు గారికి అభినందనలు!
ReplyDeleteసాహిత్య సమావేశాల్లో ఏ మాత్రం సందు దొరికినా ఆసికాలు ఏలాకోలాలు అనబడే వాలకాలేసి మనల్ని నవ్విస్తూనే చురకలు పెట్టించే చింతా అప్పలనాయుడి కవిత్వం మన జన జీవితపు అగాధాల్లోంచి పుట్టింది. ఏమీ అనుకోకండి ఇలా అంటున్నానని... అప్పుడప్పుడు ఫ్రీవర్స్ ఫ్రంట్ ఇలా తన ప్రతిష్టను పెంచుకుంటుంది. సెభాసో కవీ!
ReplyDelete"కవిత్వంకు ?"
ReplyDeleteఇదేమి తెలుగండీ ? "కవిత్వానికి" అని కదా మనం మాట్లాడేది ?
ఆఖరికి తెలుగువారికే తెలుగు రాని పరిస్థితి దాపరిస్తోందా ?
చింతా అప్పలనాయుడు గారికి నా అభినందనలు.
ReplyDeleteఉత్తరాంధ్ర కవిత్వ జెండాని 'ఫ్రంట్' కు తెచ్చినందుకు!
కథకే కాదు, ఉత్తరాంధ్ర కవిత్వానికీ పెద్ద పీట అని చూపిస్తున్నందుకు!
I use to read Mr.Naidu`s poems in magazines..
ReplyDeleteI like his poetry..
Thanq..
అప్పలనాయుడు మాస్టారుకు శుభాకాంక్షలు తెలియజేసిన సాహితీమిత్రులకు ధన్యవాదాలు.
ReplyDeleteఅజ్నాత మీ ఆత్మీయ దిద్దుబాటుకు ధన్యవాదాలు.
naa nudi kooda appalanayuduki subhakaankshalu.
ReplyDelete