Friday, July 26, 2013

మృత పెదవులు


గదంతా పరచుకున్న చీకటి దీపపు కాంతిలో 
సన్నని నల్లని మెరుపు

కంటిపాప నలుపులో దాగిన
వెలుతురే కనిపిస్తోంది

అక్షరం చుట్టు పరచుకున్న వెలుగు 
వలయంలా

మాటల చుట్టూ అల్లుకున్న లోలోపలి
పరిమళంలా

చమురు ఇంకిన దీపపు ఒత్తి చివరి
మెరుపులా

గంధమేదో పూసినట్టు రాజుకుంటున్న
నిప్పు కణికలా

నువ్వలా దోసిలిలోకి రాగానే వేళ్ళ సందులగుండా
కరిగిపోతూ 

దాహార్తితో నెత్తురు చిమ్మిన గొంతులోంచి రాగమొకటి 
రాలిపడుతూ

వానలో తడిచిన కాగితప్పడవ మునకేస్తూ
చిరిగిపోతూ

మృత పెదవులపై కురిసిన చినుకు
తడి కోల్పోతూ

అసంపూర్ణంగా వదిలేసిన వర్ణ చిత్రంలా 
ఇలా వెలిసిపోతూ

Monday, July 15, 2013

మాటలు


కొన్ని మాటలు 
చెవిలో దూరినా మనసులో ఇంకవు

కొన్ని మాటలు
దూలం కంటే పెద్దగా అయి లోపలికి రాలేవు

కొన్ని మాటలు
ముళ్ళులా మారి దేహంతో పాటు మనసును గుచ్చుతాయి

కొన్ని మాటలు
ఆత్మీయంగా పలకరించి జీవం పోస్తాయి

కొన్ని మాటలు 
తొలకరి చినుకులా కురిసి చిగురు వేస్తాయి

కొన్ని మాటలు
వెన్నెల చల్లదనాన్ని పంచి ప్రశాంతతనిస్తాయి

కొన్ని మాటలు
రక్తాన్ని మరిగించి కరవాలాన్నందించి యుద్ధోన్ముఖున్ని చేస్తాయి

కొన్ని మాటలు
నిన్ను అంతర్ముఖున్ని చేసి సుషుప్తిలోకి నెట్టి స్వాంతననిస్తాయి

కొన్ని మాటలు
రావి ఆకు చివరన నీటి బొట్టులా నీ కనులపై పడి వెలుగు నింపుతాయి

కొన్ని మాటలు
అమ్మ చనుబాలులా మళ్ళీ మనిషిని చేస్తాయి...

Tuesday, July 9, 2013

ఆవలివైపు...



ఇలానే
ఇప్పటిలాగే
ఒక్కో క్షణం కోల్పోతూన్న
ప్రతి సారీ నన్ను వెంటాడే ప్రశ్న ఇదే

ఆవలివైపు మిగిలేదేముందని??
 
వేటాడే ప్రశ్న
వేట కొడవలిలా మెడవైపు దూసుకొస్తూ...

ఏదీ శాశ్వతం కాదన్న సత్యం
ఏదీ శాశ్వత సత్యం కాదన్న నిజం
ఏదీ నిత్యమూ కాదన్న నిష్ఠురం

ఈ వేధింపు మనసు సంధులలోనుండి
సుళ్ళు తిరుగుతూ అద్దం ముందు
నిరక్షర నిరుత్తరనౌతూ...

Thursday, July 4, 2013

భారమితి..

 
మనసులో ఒలికినది
చేతులలోకి చేరదు...

కనులలో తొణికినది
ఎదలో నిలవదు...

కాగితంపై చిందినది
నెత్తుటి జీర...

గొంతులో మూగైనది
తడి రాగం...

వేలి చివరే మిగిలినది
కుంచెకంటని రంగు...

భారమితికి అందనిది
భావ ప్రకంపన...

Sunday, June 30, 2013

దేహ కుంపటి..


మబ్బు కుండ పగిలి
జోరున వాన కురుస్తూ...

కనులలో ఉబికిన నీరు
చినుకులో కలగలిసిపోతూ...

పగిలిన నేల గుండెలో
పడి ఆవిరవుతూ...

కంటి అద్దం ముందు
అబద్ధమౌతూన్న నిస్సహాయతతో...

కొలిమంటుకున్న దేహ కుంపట్లో
తడి ఆరని మేఘం...

Monday, June 24, 2013

లాంతరు..

చేతిలో లాంతరు మసకబారుతూ
కనుల ముందు చీకటి తెరలు తెరలుగా...

వీధి మలుపులో తెల్ల తెల్లగా దూది ముద్దలులా
నంది వర్థనం పూలు తడిగా...

విసురుగా వీచిన గాలికి అవిసె చెట్టు
కొమ్మలనుండి వాన నీరు కుమ్మరింపు...

దూరాన గాయపడ్డ రాగమేదో
దు:ఖానలాన్ని సన్నగా మండిస్తూ...

కొండ పోడులో రాజుకుంటున్న
నిప్పు పొగ కమ్ముకుంటూ...

అవ్వ చేతిలో ఎర్రటి అంబలి
గిన్నెలో వణుకుతూ...

కాలం దేహపు నడి రోడ్డుపై
నెత్తురు కక్కుకుంటూ...

Friday, June 21, 2013

నిప్పు హృదయం..

నిన్నంత సున్నితంగా
ఈరోజు లేవు

మౌనం ఓ రంపంలా
తరుగుతూంది

కదలని కాలం
కాళ్ళ కింద పందిర్రాటలా

నిశ్చలమైన విన్యాసం
తాడు మీద నడక

రెప్పలపై రాలుతున్న
ఇసుక క్షణాలు

దోసిలి నిండా నిలవని
వాన బొట్లు

కాలుతూన్న
నిప్పు హృదయం

Thursday, June 20, 2013

సారంగలో నా కవిత 'సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు'


ఇప్పుడెందుకో ఒక్కో సమాధిని శుభ్రం చేయాలనుంది
రాలిన పండుటాకుల్ని వాడిన పూల రేకుల్ని పేరుకు పోయిన ధూళిని
మట్టిని నేలనుండి పాకిన చెద పుట్టలను చుట్టూ పట్టిన నాచును
చిగురు వాడిన మొక్కలను గడ్డి దిబ్బలను
దీపపు సమ్మెకింద అంటిన నూనె జిడ్డును
సున్నితంగా తొలగిస్తూ సమాధిని శుభ్రం చేయాలనుంది

మిగతాది సారంగలో చదివి మీ అభిప్రాయం చెప్పండి..

Monday, June 3, 2013

తరగని దూరం...

నీ మౌనాన్ని గుండెలో ఒంపుకొని
పాట కట్టలేని నిస్సహాయత...

గుమ్మం దాటుతూ నీ రెప్పమూయని కంటిపాప
వెనక దాగిన చిత్రం దాచుకుంటూ...

తడి ఆరని చెక్కిలిపై సన్నగా తాకిన సమీరం
దిగులుగా మరలి పోతూ...

తాకీ తాకని అరచేతుల మద్య ప్రవహించి 
ఒదిగిపోయిన పలకరింపు...

వెళ్ళొస్తానని వాగ్ధానమీయ లేని అసహాయత
నన్ను నేలలోకి కుంగదీస్తూ...

చెరో దారం కలుపుతూ ఎగరేసిన గాలిపటం
ఎక్కడో చిక్కుముడి పడుతూ...

తరగని దూరాల మద్య తీరం దాటని
నావలో పయనిస్తూ...

Friday, May 31, 2013

యత్నం..


చేతులలోకి ఇంత మట్టిని తీసుకొని
తడినద్దుతూ ఓ బొమ్మ చేసే ప్రయత్నం...

పిడికిలిలోకి ఉలినందుకొని రాతినిలా
నిలబెడుతూ ఓ శిల్పం చెక్కే ప్రయత్నం...

ఇన్ని దారప్పోగులను వేళ్ళ మద్య
తీసుకుంటూ నేత నేసే ప్రయత్నం...

ఇన్నిన్ని రంగులను ఒంపుకొని
కుంచెతో చిత్రం గీసే ప్రయత్నం...

రాజుకున్న బొగ్గుల మద్య ఇనుప కడ్డీని
సమ్మెటతో మోదుతూ ఓ పనిముట్టు చేసే ప్రయత్నం...

మనసులోకి ఇన్ని తడి అక్షరాలను ఒంపుకొని
కాగితంపై కవిత చేద్దామని విఫల యత్నం,,,

Friday, May 24, 2013

ఎండ కాలం...


రోడ్డు మీద కాలుతున్న రాతి వాసనతో
మనసు కూడా…


మౌనంగా ఆకుల తేమను హరిస్తూ
గొంతు పెగలనితనం…


ఆరిపోతున్న చెలమలోని తడి
దేహమంతా భారమౌతూ…


దోసిలిలో నిప్పుల కుంపటితో
గుండె మండుతూ…


కన్నులలో ఇగిరిపోతున్న నీటి పాయ
రెప్పలముందు వడగాడ్పు…


కలలన్నీ ధూళి కమ్ముకుంటు
చినిగిన తెర పైకి లేస్తూ…

Wednesday, May 15, 2013

రంగద్దని చిత్రం...



కనులముందు పరచుకున్న కాన్వాసుపై
ఇన్ని రంగులు అద్దుతూ...

కొంచెం చీకటిని వెలుగును నలుపు తెలుపుల
మద్య పొదుగుతూ...

రాత్రి మిణుగురుల కాంతిని ఒక్కో గీత
అంచుల నింపుతూ...

అసంపూర్ణత్వమేదో కుంచె చివర
వర్ణాల వెనకాల విరిగిపోతూ...

విసురుగా వీస్తున్న గాలి కెరటాల వేగానికి
ఆకు అంచులా చినిగిపోతూ...

నెలవంక వెనకాల పరుగులెడుతున్న
కుందేలు కాలి ముద్రలు అతుకుతూ...

చెవిలో వినిపించీ మనసులో ఇంకని
స్వరమేదో రొదపెడుతూ...

గాయం నుండి స్రవిస్తున్న నెత్తురు
కాగితపు చివరల ఒలికిపోతూ...

మనసంత శూన్యపు ఆవిర్లు కమ్ముకుంటూ
కాలుతున్న ఒంటరితనం మండుతూ...

చేతులు బార్లా చాపి కావలించుకున్న
ఖాళీతనాన్ని కాన్వాసుపై చిత్రిస్తూ...

Monday, May 13, 2013

సంధ్యావస్థ..

దోసిలిలో పట్టిన నీళ్ళిన్ని
ముఖంపై చల్లుకుంటూ
మరో దోసిలి గొంతులో
వొంపుకుంటూ
ఈ వేసవి ఎడారిని
ఈదేద్దామని...

కానీ!

ఇన్ని మాటలు లేని
మౌన ఎడారిని
ఈదే సాహసం
చేయలేక నీ ముందిలా
ఓడిపోతూ...

కంట్లో నెత్తుటి నరం తెగి
నేలరాలిన నీటి బొట్టు..

అమవాస చంద్రునిలా
చీకటినంతా పులుముకొని...

నీటిలో నానిపోయిన
కాగితప్పడవలా చినిగిపోతున్నా
కాలాన్ని ఎదురీదుతూ...

దూసిన కత్తి పదునులా
మెరిసి మాయమై పోతున్న
క్షణాలను ఏరుకుంటూ
ఒకడు చినిగిన చేతి సంచిలో
వేసుకొని దారెమ్మట
ఎడతెగని బాటసారిలా...

కూలిపోతున్న వంతెన
చివర అంచున వేలాడుతూ
కాలం నవ్వుతూ
వెక్కిరిస్తూ...

కాదనలేని సత్యాన్ని
భుజంపై భేతాళునిలా
మోస్తూ అలసట తీరని
పయనం...

(తే 13-05-2013 దీ)

Saturday, May 11, 2013

నడక..

ఎర్రగా కాలుతున్న రాయిపై
అరిపాదం బొబ్బలెక్కినా
ఆగని నడక...

మెత్తగా ముళ్ళు దిగుతూ
గాయం సలపరమెడుతున్నా
ఆగని నడక...

కసిగా ఇసుక కోస్తు
నెత్తురు చిమ్ముతున్నా
ఆగని నడక...

చల్లగా మంచు గడ్డపై
తిమ్మిర్లెక్కుతున్నా
ఆగని నడక...

జీవితం నడకైనప్పుడు
తోవ ఏదైనా
నడక ఆగదు కదా...
(తే 10-05-2013 దీ)

Monday, May 6, 2013

సందిగ్ధంతో...

నువ్వెప్పుడూ విడి విడిగానే కనబడతావు
నువ్వూ నేనులా

ఇసుక రేణువు విడి విడిగానే కనబడుతుంది
దేనికది స్పృహ లేనట్టుగా

నీటి తుంపర విడి విడిగానే ఎగసిపడుతుంది
వీడలేని బాంధవ్యంలా

కళ్ళు రెండూ విడి విడిగానే చూస్తాయి
ఒకే దృశ్యాన్నిలా

చెవులు రెందూ విడి విడిగానే వినిపిస్తాయి
ఒకే స్వరాన్ని ఏక తాళంలా

దేనికది విడివడుతూనే ముడి పడి
వున్నదన్నది ఎంత విషాదమూ...

Friday, May 3, 2013

ఎండిన...

 
ఎండిన ఆకు ఈనెను అలా గట్టిగా
వత్తి పట్టకు
విరిగి పోతుంది కదా...
ఎండిన మొదలుపై అలా గట్టిగా
వేటు వేయకు
ఒరిగి పోతుంది కదా...

ఎండిన నీటి పాయలో అలా గట్టిగా
అడుగు వేయకు
ఇసుక కోతకు గురవుతుంది కదా...

ఎండిన చర్మం పై అలా గట్టిగా
పట్టి చూడకు
నెత్తురు చిమ్ముతుంది కదా...

ఎండిన ఎదపై అలా గట్టిగా
మాటాడకు
పగిలి ముక్కలవుతుంది కదా...

Friday, April 26, 2013

మెలకువను మింగిన రాత్రి..

కనురెప్పల కావల దాగిన ప్రతిబింబాలను
నలుపు తెలుపు రేఖా చిత్రాలుగా మార్చుకొని...

గాలిపటాన తోక చివర అతికించి
నల్లని ఆకాశాన ఎగురవేద్దామని...

తోకను కత్తిరిస్తూ ఓ తోక చుక్క తన దేహ
కాంతిని ఓ క్షణమిచ్చి మాయమయింది...

ధడాలున నేలనంటుతూ కల చెరిగిపోని
వర్ణ చిత్రంగా ఆ పచ్చ గడ్డి కొసలపై మెరుస్తూ....

రాతిరంతా కురిసిన వాన
తడి ఆరని బురద మట్టిలో ఇంకిపోతూ...

రెక్క తెగిన పక్షి ఒకటి ఈ కాగితాన్ని
ముక్కున కరచి కుంటుకుంటూ...

చిరిగిన జెండా గుడ్డనే ఎగురవేస్తూ తూటా
దిగబడ్డ కాలితో ఓ యువకుడు పరుగులెడుతూ...

నెత్తురంటిన ముఖంతో ఖిన్నుడై
ముఖం చాటేసిన చందమామ ఆకు చాటున దాగుతూ...


ఈ  రోజు వాకిలి ఈ-పత్రికలో ప్రచురితమయింది..


Wednesday, April 24, 2013

రాత్రి...

 
 
 
 
 
 
 
 
 
రాత్రి...

నిద్రను
వెన్నెల
కొక్కేనికి
వేలాడ
దీసి
నలుపు
తెలుపుల
మిశ్రమాన్ని
కలలకు
పూత
పూస్తూ...
జ్ఞాపకాల
పుటలకు
గుండె
తడిని
జిగురుగా
అతికిస్తూ...

గాయాన్ని
రేపే
గానమేదో
నిశ్శబ్దంగా
దేహమంతా
ప్రసరిస్తూ...

రాజుతున్న
మది
నిప్పు
వేలి
చివుళ్ళ
మండుతూ...

ఒంటరిగా
ఖాళీ
కూజాలో
గ్లాసు
నింపని
దాహంతో...

తెలవారని
ఆకాశంలో
నెత్తురోడుతూ
రాలుతున్న
నక్షత్రం
బూడిదౌతూ...

Sunday, April 21, 2013

చైత్రపు చినుకు...

మంచి గంధం వాసన కన్నా
ఈ ఎండిన నేలపై పడ్డ చినుకు పరిమళం
అంతరాత్మను తట్టి లేపుతుంది...

ఆకాశం నుండి జారుతున్న ఒక్కో చినుకు
నాలిక అంచు చివర ఒడిసి పడ్తూంటే
లోలోపలి తడితనాన్ని తడిమి చూపుతుంది...

గడపలో పడ్డ ఆకాశపు మంచు గడ్డలను
అరచేతిలో కరగబెడ్తూంటె మనసు
మూలల దాగిన రాతి నిప్పు ఆవిరవుతుంది...

ఒక్కో చిగురుగుండా మొక్క దేహమంతా
పాకుతూన్న చినుకు తడి మట్టి
అంతర్భాగంలోంచి జీవస్సునందిస్తుంది...

ఎర్రగా కాలుతున్న పెనంపై పడ్డ నీటి జల్లులా
మండుతున్న నేలపై జాలువారిన వాన చినుకు
నీలో దాగిన రహస్య సంగీతాన్నాలపిస్తుంది...

నిండుగా ఆకాశం వైపు కను రెప్పలు విప్పార్చి
చూస్తూ చేతులు చాచి దేహమంతా నగ్నంగా
ఈ చైత్రపు తొలి చినుకులలో తడిసి సేదదీరనీ...

Friday, April 19, 2013

ఫార్టీ ప్లస్...


అద్దం భయపెడుతోందిప్పుడు!
రోజు రోజుకి తరుగుతున్న చర్మం నునుపుదనంతోపాటు
కళ్ళకింది చారలు వెనక దోబూచులాడుతున్న
లోలోపలి విషాదమేదో ఉబకని కన్నీటి చుక్కను
ఆకు ఈనె చివర ఒడిసి పడ్తూ...

అక్కడక్కడా పొడుచుకొచ్చిన ఎండు గడ్డిలాంటి
తెల్ల వెంట్రుకలతో రాని పెద్దరికమేదో మీదపడి
భుజాలపై మోయరాని భారమేదో కావడి కర్ర
జవ జవలాడుతూ కిందకు గుంజుతున్నట్టు...

పులిమిన నల్ల రంగు వెలసి పోయినప్పుడంతా
రంగు కరిగిన నక్కలా బయటపడుతూ
మూతి మీద మీసంపై మునివేళ్ళతో దాగని సత్యాన్ని దాచిపెడ్తూ...

అటూ ఇటూ చేతులందని పిల్లలు
సందెట్లో ఇమడక చేతులు దాటిపోతూ
కనుపాప వెనక ఉగ్గబట్టి కడుపులో మెలిపెడుతున్న
పేగు బంధాన్ని అత్మీయంగా తడుముకుంటూ....

చిరాకు ప్రతి క్షణం పెదవిపై తప్పని అతిధై
గుండె కింది నరాన్ని పట్టుకుంటూ
కడుపులో HCL స్రావాలు అధికమై
రోకటి పోటులా పొడుస్తూ నుదుట చిట్లిన మడతల
వెనక దోబూచులాడుతూ దూరమవుతున్న
కరచాలనాలతో రాని నవ్వును పులుముకుంటూ...

ఏమైనా నలభైల హర్డిల్ దాటినప్పుడంతా
ఈ ఎగసోప తప్పదేమో కదా నేస్తం!!

Related Posts Plugin for WordPress, Blogger...