Monday, May 13, 2013

సంధ్యావస్థ..

దోసిలిలో పట్టిన నీళ్ళిన్ని
ముఖంపై చల్లుకుంటూ
మరో దోసిలి గొంతులో
వొంపుకుంటూ
ఈ వేసవి ఎడారిని
ఈదేద్దామని...

కానీ!

ఇన్ని మాటలు లేని
మౌన ఎడారిని
ఈదే సాహసం
చేయలేక నీ ముందిలా
ఓడిపోతూ...

కంట్లో నెత్తుటి నరం తెగి
నేలరాలిన నీటి బొట్టు..

అమవాస చంద్రునిలా
చీకటినంతా పులుముకొని...

నీటిలో నానిపోయిన
కాగితప్పడవలా చినిగిపోతున్నా
కాలాన్ని ఎదురీదుతూ...

దూసిన కత్తి పదునులా
మెరిసి మాయమై పోతున్న
క్షణాలను ఏరుకుంటూ
ఒకడు చినిగిన చేతి సంచిలో
వేసుకొని దారెమ్మట
ఎడతెగని బాటసారిలా...

కూలిపోతున్న వంతెన
చివర అంచున వేలాడుతూ
కాలం నవ్వుతూ
వెక్కిరిస్తూ...

కాదనలేని సత్యాన్ని
భుజంపై భేతాళునిలా
మోస్తూ అలసట తీరని
పయనం...

(తే 13-05-2013 దీ)

8 comments:

  1. అంత సులువు అర్థంకాలేదుగా నాకు, ఏదో తికమక :-(

    ReplyDelete
    Replies
    1. ఆ అవస్థ అలాంటిది మరి అనికేత్..:-) వీలైతే మరోమారు చదవొచ్చుగా..

      Delete
  2. enta baagaa elaa rastaaru miru abhinandanalu

    ReplyDelete
    Replies
    1. మీ స్ఫూర్తిదాయక స్పందనకు ధన్యవాదాలు మంజుల( చెప్పాలంటే ) గారు..

      Delete
  3. నీటిలో నానిపోయిన కాగితప్పడవలా చినిగిపోతున్నా కాలాన్ని ఎదురీదుతూ, ఈ లైన్ చాలా నచ్చిందండి.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయతకు ధన్యవాదాలు Yohanthji..

      Delete
  4. చేతల్లో రాయలేని భావం... మీరు రాసింది చదవగానే. అందులో నేనే ప్రతిబింబించినట్టుగా అనిపించింది. ఇటువంటి స్పందింపచేసే మాటలను కూర్చి పేర్చగలగడం మీ.. మా...అదృష్టం.
    I am feeling happy to visit some of the excellent blogs. Thanks to blogger:)

    ReplyDelete
    Replies
    1. మీ స్ఫూర్తిదాయక స్పందనకు అభివందనాలు అనూ గారు.. Thanks a lot..:-)

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...