Sunday, September 9, 2012

దేహపు విల్లు...

తప్పొప్పుల తడిక చాటున దాగి
లోలోపల అగ్ని పర్వతాన్ని
ఉఫ్ మంటూ ఊదేసే వృధా ప్రయత్నమెందుకు....

మనసు నిండా నిండిన భావాన్ని
వ్యక్త పరచడానికి సాకులు వెతుక్కోక
మూసిన కున్రెప్పలను తెరచి చూడు
కనుల నిండా ఇంద్ర ధనస్సులే....

కలల్లో కలవరిస్తూ పలవరిస్తూ
మనసు ఐ మూలల దాగిన
కోరికల బుసలను తలపై మోదుతూ
చంపేయడమెందుకు??

రానీయనీ లోలోపలకి
ఎంత ఆస్వాదించ గలిగితే
అంత జీవితాన్ని ఆమూలాగ్రం
పిడికిట పట్టి గుండెల్లో పొదువుకోవాలి.....

నీ చూపు మేరా పరచుకున్న పచ్చదనాన్ని
వెచ్చని సూర్య కిరణాల ప్రతిఫలనంలో
మెరుస్తున్న ఆ లేలేత అందాలను
కంటి వెనకాల వెండి తెరపై బంధించి చూడు....

దేహాన్ని విల్లులా సారించి
నీ కోరికల బాణాన్ని సంధించు
అణువణువు ఆస్వాదించు
నేడున్న క్షణం మరుక్షణం మాయమవుతున్న
కాలబలం నిన్ను వెంటాడక ముందే....

కుళ్ళి కృశించి నశించే కంటే
అగ్నిశిఖలా కాలుతూ మెరుస్తూ
ఆకాశమంతా ప్రకాశిస్తూ
క్షణకాలమైనా బతికి చూడు....

గుండె నిండా ఊపిరి తీసుకొని
అడుగు వేయి
చీత్కరించిన లోకమే
నీకు దాసోహమవుతుంది....

24 comments:

  1. చీత్కరించే లోకం ఎంత నిండుమనసుతో దాసోహమౌతుందో తెలీదు కానీ ఈ కవిత ద్వారా మీ సహృదయం తెలిసిందండి వర్మగారు:-) కవితబాగుందండి!

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన హృదయానికి ధన్యవాదాలండీ పద్మార్పిత గారూ...:)

      Delete
  2. గుండె నిండా ఊపిరి తీసుకొని
    అడుగు వేయి.

    అగ్నిశిఖలా కాలుతూ మెరుస్తూ
    ఆకాశమంతా ప్రకాశిస్తూ
    క్షణకాలమైనా బతికి చూడు....


    ఆకులా రాలినా.. కలకాలం నిలుస్తావ్..వేకువ రాకతో కాంతి రేకై మొలుస్తావ్..

    మనసు నిండా నిండిన భావాన్ని
    వ్యక్త పరచడానికి సాకులు వెతుక్కోక
    మూసిన కున్రెప్పలను తెరచి చూసా
    కవిత నిండా ఇంద్ర ధనస్సులే....

    ReplyDelete
    Replies
    1. ఓహ్ మీ ఆత్మీయ కవితాత్మక స్పందనకు ధన్యవాదాలండీ యశశ్వి గారూ...

      Delete
  3. దేహపు విల్లు.....ఇలాంటి కొత్త టైటిల్స్ మీకు ఎలా తడతాయండి:) Nice poetry.

    ReplyDelete
    Replies
    1. మీలాంటి సృజనాత్మక మిత్రుల దీవెనలతో...:) thank you..

      Delete
  4. వర్మగారూ, మీ కవితలో నిగూడమైన హెచ్చరిక ఉంది, వెన్ను తట్టే ప్రోత్సాహం ఉంది,
    ఏ భాదాతప్త హ్రిదయాన్నో ముందుకు నడిపించే ఆయశయం ఉంది.
    నీ భావాన్ని బయట పెట్టటానికి ఇదే తగిన సమయం అనే సూచన ఉంది.
    సర్, నాకు అర్ధమైన బావాన్ని తెలిపాను. నా అభిప్రాయం తప్పో ఒప్పో తెలీదు.
    కవిత, చిత్రం బాగున్నాయి....మెరాజ్

    ReplyDelete
    Replies
    1. మీ విశ్లేషణాత్మక స్పందనకోసం ఎదురు చూస్తుంటా ఫాతిమాజీ...మీరు చెప్పినవన్నీ ఒప్పే...ధన్యవాదాలు..

      Delete
  5. I think Fathimaji told everything about your poem sir, Thanks to her too.

    ReplyDelete
  6. ఈ కవిత చదువుతుంటే మీకు దేనిగురించైనా అనర్గళంగా చెప్పే సత్తా ఉన్నట్లనిపిస్తుందండి:)

    ReplyDelete
    Replies
    1. అంతా నీ అభిమానం అనికేత్..నీ మాట స్ఫూర్తిదాయకం నాకు..థాంక్యూ

      Delete
  7. వర్మ గారు మీ కవిత చాల చాల బాగుంది.
    నేడున్న క్షణం మరుక్షణం మాయమవుతున్న
    కాలబలం నిన్ను వెంటాడక ముందే....

    ఈ 2 lines అద్భుతం

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి ధన్యవాదాలు skvramesh గారూ...

      Delete
  8. కుళ్ళి కృశించి నశించే కంటే
    అగ్నిశిఖలా కాలుతూ మెరుస్తూ
    ఆకాశమంతా ప్రకాశిస్తూ
    క్షణకాలమైనా బతికి చూడు....
    ఈ నాలుగు వాక్యాలు నిజంగా అగ్నిశిఖలె! గొప్ప స్పూర్తిదాయక మయిన కవిత

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు రవి శేఖర్ గారు...

      Delete
  9. ప్రతి వాక్యం ఓ ఇంద్రధనస్సై మెరుస్తోంది. అద్భుతంగా వుంది కవిత. ధన్యవాదాలు వర్మగారు.

    ReplyDelete
    Replies
    1. ఎన్నాళ్ళకి మీ స్పందన...ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు..

      Delete
  10. దేహపు విల్లును సంధించి
    వెన్నెలదారిలో కలలయామినితో
    అక్షరయానం చేసేవర్మ గారూ

    లోలోపల అగ్ని పర్వతాన్ని ఉఫ్ మంటూ ఊదేసే
    వృధా ప్రయత్నమెందుకంటారా !
    భావాన్ని వక్తీకరిండానికి రెప్పలు తెరచి చూస్తె
    కళ్ళ నిండా ఇంద్ర ధనస్సులేనా !
    కోరికల చంపెయకుండా లొలొపల అస్వాదించి
    పట్టి గుండెల్లో పొదువుకోవాలా !
    పరచుకున్న ఆ లేలేత అందాలను కంటి వెనకాల
    వెండి తెరపై బంధించి చూడాలా !
    దేహాన్ని విల్లులా సారించికోరికల బాణాన్ని సంధించి
    అణువణువు ఆస్వాదించాలా !
    అగ్నిశిఖలా కాలుతూ ఆకాశమంతా ప్రకాశిస్తూ
    క్షణకాలమైనా బతికి చూడాలా !
    గుండె నిండా ఊపిరితీసుకొని అడుగు వేస్తే
    చీత్కరించిన లోకమే దాసోహమవుతుందా?

    తప్పొప్పుల తడిక చాటున దాగి లోలోపల అగ్ని పర్వతాన్ని
    ఉఫ్ మంటూ ఊదేసే వృధా ప్రయత్నం చేసే మావంటి వాళ్ళకు
    కోరికల బుసలను తలపై మోదుతూ చంపుకుని
    కుళ్ళి కృశించి నశించే మాలాంటి వాళ్ళకు
    మీరు చెప్పెవన్ని సాధ్యమెనంటారా
    దెహపువిల్లును సంధిస్తె వెన్నుపూస విరిగి మూలన పడితె ఎలా అంటారు
    అసలే లేనివాళ్ళం ఆసలుమాత్రమె ఉన్నవాళ్ళం
    వైద్యం కొసం వెళితే ఇంటికి తిరిగిరాలెని వాళ్ళం

    ReplyDelete
    Replies
    1. ఏ వయసుకు తగ్గట్టు ఆ వయసులో చేయాల్సినవి చేయాలి కదా సార్...
      మీకు నా బ్లాగిల్లుకు స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు మాస్టారూ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...