Saturday, September 22, 2012

చిల్లర మాయం

అలికిడి వినపడకుండా
పిల్లి కాళ్ళ పంజాతో
నడి బజార్లోకి సరకు సరఫరా...

నీ జేబు చీల్చుకుంటూ
వాడి చెయ్యెప్పుడో చొరబడింది
ఖాళీ తనం నిన్నింక వెక్కిరిస్తుంది
కుక్క నోట్లో బొమికలా....

నీ బెటరాఫ్ పుస్తెలమ్మినా
తీరని బాకీతో నడి వీధిలో
నీ నెత్తిపై రూపాయి బిళ్ళ పెట్టి
అర్థ రూపాయికి పాట....

పొయి మీద పాలు పొంగక ముందే
ఆరి పోయిన గ్యాస్ బండ
కోటా పూర్తయి వెక్కిరించింది...

చిల్లర కొట్టు చిట్టెమ్మ
వాకిట్లో నుదుటిపై పాలిపోయిన
పసుపు బొట్టుతో నోట్లో తులసాకు....

ఒక్కోటీ అదృశ్యమవుతూ
ఏదీ మిగలనితనంతో
నీకు నీవే ఓ హాలోమెన్ లా
చివరాఖరకు ఆత్మను కోల్పోయి....

నువ్వింక మేల్కొనక పోతే
నీ కంటి రెప్పలను కత్తిరించి
కలలను కూడా LED తెరకు అతికిస్తారు...

సొంతమంటూ ఏదీ లేనితనం
నిన్ను ఓ బ్రాండ్ అంబాసిడర్
చేతిలో ఖాళీ కోక్ డబ్బాలా పీల్చి విసిరేస్తుంది....

దేహమంతా తొడగబడ్డ
విదేశీ కండోమ్ ను చీల్చుకు రారా
కాలం నిన్ను అనకొండలా మింగి ఉమ్మివేయక ముందే....

6 comments:

  1. హ్మ్...నిజమే మనం మనంగా మిగేలేటట్లు లేడు

    ReplyDelete
    Replies
    1. నిజమే కదా శశికళ గారూ...థాంక్యూ..

      Delete
  2. మీదైన శైలిలో అదిరిందండి పోస్ట్:)

    ReplyDelete
    Replies
    1. వాస్తవం కొంచెం చేదుగా వున్నా చెప్పక తప్పదు కదా అనికేత్..థాంక్యూ...

      Delete
  3. వర్మగారూ, భావావేశం అర్ధవంతంగా పలికింది.
    మధ్యతరగతి బతుకులెలా తెల్లారతాయో చక్కగా వివరించారు.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...