Tuesday, June 16, 2015

అతడే జవాబు..


కొన్ని సాయంత్రాలకు దుఖం వేలాడబడుతుంది
తెగిపోయిన వేళ్ళ చివర నెత్తురు గూడు కడుతుంది

చిగురించిన ఆకు చివరల ఒక
ప్రశ్న మొలకెత్తుతుంది

నువ్వొక జవాబువి కాలేదని తెలిసి
రాలుతున్న పిల్లెట్లన్నీ కుప్పబడతాయి

నీ నుదుటిపై పోస్ట్ మార్టం కుట్టు రోకలిబండలా 
నన్ను నిద్రకు దూరం చేస్తుంది

నువ్వింకా ఆ చౌరస్తాకు అడ్డంబడి వాడికెదురుగా
అరుస్తున్నట్టే వుంది

వాడి చేతిలో చిక్కిన నీ జుట్టు ఇంకా
రాలిపడలేదు

ఆ నల్లగేటుకు తాకిన నీ అరచేతి రేఖల
ముద్రలు ఇంకా కరిగిపోనూ లేదు

నువ్వంటావు పోరాటం ఎప్పుడూ కొనసాగింపే
కదా అని!

అవును
నువ్వెత్తి పట్టిన జెండా
అవనతం కాలేదు కాబోదు
భుజం మార్చుకుంటుందంతే కదా??

(కామ్రేడ్ వివేక్ స్మృతిలో)

Thursday, May 14, 2015

వెదురు పూలు..


రాత్రికి ఈ గోడ నిండా ఓ నినాదమై
కంపించాలని వేళ్ళనిండా రంగు పూసుకొని

అతను ఆమె రహస్యంగా నడుస్తూ
ఇంత వెలుతురుని వెదజల్లుతూ

అక్కడక్కడా ఏరిన తురాయి పూలను
అగ్ని పింఛంలా ధరిస్తూ ఆమె

గాయమైన స్వప్న శకలాలకు వెదురు పూల 
రెక్కలు అతుకుతూ అతను

దూరంగా ఆకాశ పాదాన ధింసా ఆడుతూ 
సూరీడు సందురూడు!!

చీకటి గానం..


కొన్ని సాయంత్రాలకు పాదాలు చెరబడ్తాయి
ఎగురుతున్న పావురాయి రెక్క తెగి
నేలకు రాలుతుంది

గొంతుపై ఉక్కుపాదం తొక్కుతూ
నినాదాలు గాయాలవుతాయి

వేసవిని పూసుకుని అడవి ఆకురాలి 
కరకరమంటు మండుతుంది

నువ్వంటావు చీకటి ముసిరిన వేళ
పాట కట్టలేవా అని!

అవును 
చీకటింట చీకటే గానం చేయబడుతూ
ఒక్కొక్కరూ కదలబారుతారు!!

ప్రమిద-నువ్వూ...


ఈ రాత్రికి ఇన్ని మాటలు లేకుండా పొదిగినది
నువ్వే కదా

కొన్ని వాడిన పూరేకులలా మూలగా విరామంగా
సేదదీరుతూ

నువ్వడిగిన మట్టి గాజులు మరచి పోయి
వెలసిపోయిన ముఖం

ఈ ప్రమిదనిలా ఒంటరిగా ఆరిపోనివ్వు
ఒక్కో చినుకులా!!

నూలు దారాలు...


నీటి పాయలుగా విడివడిన దేహాలు
తేట తెల్లంగా మెరుస్తూ

అరచేతులలో రేఖలగుండా
సరిహద్దులను చెరిపేస్తూ

పున్నమి రోజు కురిసిన
నిన్నటి వానలా వెన్నెలను మింగేస్తూ
కాసింత చీకటి దాహమేదో గొంతును నులిమేస్తూ

నువ్వంటావు నిన్నటి ఆ ఛాయా మేఘాన్ని
అదృశ్య హస్తమేదో మాయం చేసిందా అని!

చూడలేదా నువ్వు ఆ సాయంత్రం
కొన్ని రంగుల నూలు దారాలు ఎగిరిపోవడాన్ని!!

Monday, April 27, 2015

కొన్ని సాయంత్రాలకు రూపం వుండదు..

కొన్ని సాయంత్రాలకు రూపం వుండదు
కడవలకొద్దీ కన్నీళ్ళు బూడిదలో కలిసి
దేహమంతా కూరుకుపోతుంది!
అక్కడక్కడా మిగిలిన గురుతులన్నీ
దర్వారాలుగా కుప్పకూలిపోతాయి!
రహదారులన్నీ చీలిపోయి పగిలిన
బీళ్ళలా నోరుతెరుచుకుంటాయి!
ఒక్కసారిగా ఆకాశం ధూళి మేఘంలా
విరుచుకుపడి భూస్థాపితం చేస్తుంది!
తవ్విన కొద్దీ గుండె పగుళ్ళు మధ్య
నెత్తుటి ఇటుకల శిధిల విలాపం!
నువ్వంటావు కన్న పేగునెవరో
కసిగా తెంపివుంటారా అని!

అవును
ఆత్మలన్నీ సామూహిక దహనకాండలో
కరిగిపోయి దు:ఖావరణాన్ని మిగిల్చాయి!!

అచ్చులో రెండు కవితలు

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో తే26/04/2015దీ.

నవ తెలంగాణా 'దర్వాజా' పేజ్ లో తే27/04/2015దీ.

Thursday, April 16, 2015

దు:ఖపు చినుకు..


గాలికి కాసింత రంగునద్దుదామని
ఇన్ని గోరింటాకులు ఏరి తెచ్చా

కానీ గాలి ఆ కొండ మలుపుని దాటగానే
ఓ పావురం నెత్తురంటి ఎర్రగా కుంగిపోయింది!

పాటకింత పరిమళాన్ని జతచేద్దామని
ఇన్ని మల్లెలు గుది గుచ్చి తెచ్చా

కానీ పాట ఆ అడివంచు చేరగానే
గొంతు తెగిన కోయిలొకటి కూలిపోయింది!

ఒక దు:ఖపు చినుకు రాలి
నేల తల్లికి గర్భస్రావం అయింది!!

Wednesday, April 15, 2015

కొనసాగింపు..


అవును 
ఈ పాత పాళీ పెన్ను
సిరా ఇంకి పోయి రాయడం మాని
ఇలా చాన్నాళ్ళుగా ఒరిగిపోతూ వుంది!


ఈ పాత డైరీ అట్ట చెద తిని
అసంపూర్ణంగా రాయబడి
ఇలా చాన్నాళ్ళుగా చినిగిపోతూ వుంది!


నువ్వంటావు
ఎప్పుడూ ఆ పాత వాటి మధ్యలో
పెచ్చులూడిన గోడ వారగా వుంటావెందుకూ అని!


నేనంటానూ
ఈ పాత పెన్ను చెద రాలుతున్న డైరీ
ఈ పెచ్చులూడుతున్న గోడ నన్నిలా నిలబెట్టే
నా అసంపూర్ణ కొనసాగింపు అని!!

Tuesday, April 7, 2015

వెలుతురు కట్టిన పాట...


చీకటినలా దోసిట పట్టి విసిరేస్తావు 
మిణుగురులు అలా మెరుస్తూ కురుస్తున్నాయి

చుట్టూ పరుచుకున్న వెలుతురునింత 
పోగు చేసి బొమ్మ కడుతున్నా

ఇన్ని మందార ఆకులు  పరచి 
గూడు అల్లుతున్నా

చుట్టూ ఇన్ని బంగారు పిచుకలు 
ఎగురుతు ఏవో పాటలు కడుతున్నాయి 

నువ్వంటావు నీ మాటలు
వినపడ్డం లేదని 

అవును నా గొంతు 
రాగమై గాలిలో కలిసి పోయిందని
.
.
.
.....

Wednesday, April 1, 2015

కాగితం..


మనసెప్పటికీ
ఓ తెల్లకాగితం!


నువ్వు విసిరేసినప్పుడంతా
గాయపడిన ఎర్రని కాగితం!


గాలికీ భారమై 
చినిగిన చిత్తు కాగితం!!

Saturday, March 28, 2015

రాతి రెప్పలు..


ఇక్కడో చిత్రకారుడు అక్షరాలకు
నెత్తుటి తడిని అద్దుతూ
దేహాన్ని చిత్రిక పడుతున్నాడు

కనులకంటిన చెమ్మను కోల్పోతూ
రాతి రెప్పలను చెక్కుతూ
నరాలను పేనుతున్నాడు

రాలిన కలలను పేరుస్తూ
వాన నీటిలో రెక్కలూడిన 
తూనీగకు రంగులద్దుతున్నాడు

ఇన్ని రాలి పడిన పసిపాపల
కనురెప్పలను ఏరుతూ
నిచ్చెన కడుతున్నాడు

తెగిన దారం చివర గాలిపటాన్ని 
ఎగరవేస్తూ పావురం 
గాయానికి లేపనమవుతున్నాడు..

Saturday, March 21, 2015

నీళ్ళ రంగు చిత్రం


కలలు రాని కంటి తెరపై 
నువ్వో నీళ్ళ రంగు చిత్రాన్ని ఆవిష్కరిస్తావు

కరిగిపోతున్న కాలం తెరచాపపై 
చినుగును అతుకుతూ

రాలుతున్న ఆకుల ఈనెలపై 
ఒక్కో అక్షరం  నెత్తురోడుతూ 

ఈ చెరువు అలల మధ్య 
తెగిపడిన దేహంతో జ్వలిస్తూ

నిర్వికల్ప సంగీతాన్ని మౌనంగా 
ఆలపిస్తూ 

............

Wednesday, March 11, 2015

ఇసుక పంజరం


నిశ్శబ్దావరణాన్ని సృష్టించుకొంటూ

రావి ఆకుల ఈనెల మధ్య ఒదిగిపోతూ

నాకు నేనుగా ఈ ఇసుక పంజరాన్ని మోస్తూ

నెత్తుటి తీగల మధ్య వేలాడుతున్న పక్షిలా

కాసేపు విశ్రాంతిని తీసుకోనివ్వు

Wednesday, February 18, 2015

భార రహితం..


తడి ఇగిరిపోతున్న శబ్దం 
ఫట్ మంటూ మొఖంపై


గరకుగా మిగిలిన పాయలగుండా
మౌనం తెరలుగా జారుతూ


నువ్వంటావు
నీకంటూ కొన్ని రాతలను మిగుల్చుకో అని!


నేనిలా 
భార రహితంగా ఎగిరిపోవాలనుకుంటూ!!

Tuesday, February 10, 2015

ఓ పేజీ మధ్య...


కొన్ని వాక్యాలనలా పొదివి పట్టుకొని
భద్రం చేయాలనిపిస్తుంది



కొన్ని పదాలకు ఇన్ని బియ్యం గింజలు చల్లి
బతికించుకోవాలనిపిస్తుంది


కొన్ని మాటలను ఆకు దోనెలో ఒడిసిపట్టి
దాచుకోవాలనిపిస్తుంది


నువ్వంటావు
నువ్వీ పేజీల మధ్యన సీతాకోకచిలుకలా ఎగిరిపోతావేమొనని...


నేనంటాను
అద్దుకోని రంగులను హామీ ఇవ్వలేనని...

Sunday, February 1, 2015

అసంబద్ధం


నువ్వొక అబద్ధాన్ని వెతుక్కుంటూ 
బయల్దేరుతావు!

నీటిపై నూనె మరకలా తేలియాడే 
నవ్వు ఎదురవుతుంది!

గరకుగా అరచేతులతో మొఖాన్ని రుద్దుతూ 
చలిని దాటిపోవాలనుకుంటూ!

టీ డికాక్షన్ లో ఆఖరి పంచదార పలుకు 
చేదు గుళిక!

అరిపాదం కింద నలిగిన పక్షి 
ఈక మూల్గుతూ!

దాహం నాలుకపై పారుతున్న 
నదీపాయ ఇగిరిపోతూ!

కొండ పాదం కింద పగిలిన అద్దంలో 
ఆకుపచ్చని నెత్తుటి మరక!

ఈ అసంబద్ద వర్ణ చిత్రం 
అసంపూర్ణంగా!!

Saturday, January 10, 2015

భారమితి

 
ఇప్పుడు నీకొక్కక్కటీ భారమౌతున్నాయి
ఒక్కొ క్షణమూ భారంగా కదలాడుతూ

నెర్రెలు బారిన అరచేతుల చాళ్ళ నిండా 
అంటిన మట్టి పెళ్ళలుగా

నీ గోళ్ళ చివురున ఆరిన రంగేదో 
తనను తాను కోల్పోయి 

ఒక్కో అక్షరానికీ అంటని తడితనం
ముక్కలైన వాక్యంగా 

మిగిలిపోనీ ఈ గది మూల 
ఓ పక్కగా సేదదీరుతున్న గాలిలా!!

Thursday, January 1, 2015

నేనిలా


ఏదో ఉత్సవ కోలాహలం
చుట్టూ హరివిల్లులా


ఇటువైపేదొ నలుపు తెలుపుల వర్ణ చిత్రం
ఆకాశమ్ నిండా కఫన్ లా


నువ్వొక్కడివే నిస్సహాయంగా 
దుఃఖపు చినుకులా


వడి వడిగా జారిపోతున్నట్టు కాలం 
పొడిబారిన మేఘంలా


తెగిపడిన చేతుల్నిండా యింత
దాహపు నాలుకలా


దేహమంతా చుట్టుకున్న నగ్న చర్మం
వలిచేస్తూ నువ్వలా

ఇంకొన్ని పూరేకులు దోసిలినిండా ఏరుకొని 
ఈ రాళ్ళ దారిలో పరుచుకుంటు నేనిలా!!

Wednesday, December 31, 2014

ఆఖరి పేజీ..


కాలెండర్ ఆఖరి పేజీని చించేస్తావు

కానీ 
అది మిగిల్చిన జ్ఞాపకాన్ని 
గాయాన్ని మరిచిపోగలవా?

నువ్వంటావు 
ఇన్ని నీళ్ళు కుమ్మరించుకో
అవే కడిగి వేస్తాయని

కానీ గాయం నెత్తురంటినది కదా!
Related Posts Plugin for WordPress, Blogger...