నాకింకా...
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది..
అతడు నేనూ కలసి ఆ దారులు లేని
రాదారిలో నడుస్తున్నట్టే వుంది...
అతడు చురుకైన చిరుత చూపులతో
జింకలా రాళ్ళ గుట్టల్ని సుతారంగా
తొక్కిపెడుతూ యెక్కుతుంటే..
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది..
అతడు ఆప్యాయంగా చేయందిస్తూ
నవ్వుతుంటే ఆకాశంలో చందమామ
అందినట్లే వుండేది..
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది...
అతడు మాటాడుతుంటే తను చేస్తున్న
వ్యవసాయం పట్ల రైతుకు వున్న
నిబద్ధత కలిగిన ప్రేమ వ్యక్తమై
గుండెను తాకేది...
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది...
అతడు అలసటను మరపిస్తూ నన్నగా
స్మృతి గీతమాలపిస్తుంటే
నడకలో దూరం తెలియనితనం...
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది...
అతడు ఓ రహస్య ప్రేమికుడిలానో
స్నేహితుడిలానో కనిపించి
గొప్ప ఓదార్పునిచ్చేవాడు..
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది...
అతడి గుండెల్లో దిగిన తూటా
నవ్వుతూ పిడికిలెత్తిన
ఆ రూపం నీకెన్నటికీ
నిద్రపట్టనీయదు
నా ప్రియ శతృవా...
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది...
(18 ఏళ్ళకే అమరుడైన కా.కిరణ్ స్మృతిలో)
No comments:
Post a Comment
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..