Saturday, December 24, 2016

కొన్ని దృశ్యాలు!!

కొన్ని పేజీలను
నీకంటూ రాసుకుంటావ్!

కానీ
ఆఖరు పేజీ చిరిగి
నువ్వంటూ
కనబడవేం?

వద్దింక
సరిహద్దులు
చెరిపేయి!

ఖాళీ
నల్లరంగు సిరాబుడ్డీ
వెక్కిరిస్తూ!

చినిగిన కాగితప్పడవ
మునకలో
కొన్ని నీటి బిందువులు!

ఆ వీధి మలుపులో
ముసలి అవ్వ
చేతులు ఖాళీగా!

చలినెగడు చుట్టూ
పరచుకున్న రగ్గులు
ముడుచుకుంటూ!!

(Dec.22.2016)

Wednesday, December 14, 2016

ఆ ఇంటి గుమ్మం


వెళ్ళిన వాళ్లు తిరిగి వస్తారని ఆ ఇంటి
గుమ్మం ఎదురు చూస్తోంది

వాళ్ళేదో కోట్లకొద్దీ రూపాయి మూటలు
మోసుకొస్తారని కాదు

వాళ్ళేదో బంగారపు గనులు
తవ్వుకొస్తారని కాదు

వాళ్ళేదో తాను పడుతున్న ఈతిబాధలన్నీ
తీరుస్తారనీ కాదు

వాళ్ళేదో మేడ మీద మేడలు
కడతారనీ కాదు

వాళ్ళేదో సిరిమంతులయి ఊరిని
దత్తత తీసుకొంటారని కాదు

కానీ వాళ్ళింక రారని  సిమెంటు కాంక్రీటు
కింద మాంసపు ముద్దలయ్యారని తెలవక

ఆ ఇంటి గుమ్మం రెండు కళ్ళు తెరచుకొని
ముంగాళ్ళ మధ్యలో తల పెట్టుకొని ఎదురు చూస్తోంది!!

(నానక్ రాంగూడలో కూలిన ఉత్తరాంధ్ర  వలస బతుకులకు కన్నీటితో)

Thursday, October 20, 2016

మరల కథ పాతదే!


వింటావా!
ఇంటికి చేరుతున్న వేళ దారిలో
గూడు నుండి జారి రెక్క విరిగిన పక్షి ఒకటి
చేతిలో పడింది
సున్నితమైన తన దేహం నా రాతి వేళ్ళ మధ్య
బాధగా మూలిగింది
ఒక దు:ఖాశృవు జారి తన రెక్కలను తడిపింది
ఒక మాట చెప్పనా
మరల మరల వెంటాడే
వేటగాడెవడో పొంచి వుండి చల్లిన
బియ్యపు గింజలు ఎప్పుడూ
గొంతుకడ్డం పడతాయి కదా?
కంటిలో పడిన ఇసుక రేణువు
గరగరలాడుతూ మసకబారింది పొద్దు
పిల్లలనెత్తుకు పోతున్న దొరలు తిరుగుతున్నారంట
తెలవారితే ఆ మడిచెక్కనెవరో తవ్వుకుపోతున్నారంట
ఉలికిపడకు ఇప్పుడంతా ఎవరి నిద్రలో వారు నటిస్తారంట
కలలు ఎవరి రెటినాపైనా ప్రతిఫలించని తీరు
కాసేపిలా ఒదిగి నిదురపో
రేపు ఈ కథ పాతదవుతుందిలే!!

Wednesday, October 12, 2016

కరిగేనా??

ఒకసారి మాటాడుకుందాం
నువ్ నీలా నేను నాలా


ఈ చెరగని గీతల మధ్య
ఒకింత ఒరిపిడి రాజుతూ


గుండె దాటని మాటని
గొంతు పెగులుతుందా? 


కొన్ని ప్రశ్నలు అలాగే
కొక్కెంలా వేలాడుతూ వెక్కిరిస్తూ


ఇసుకలా గరకుగానో కరకుగానో
తగులుతూ అడ్డంగా ఏదో 


ఎదురెదురుగా నిలిచిన
రాతితనం కరిగేనా? 


ఎన్ని
చినుకులు
రాలినా!!


(26/09/2016-7.54pm)

ముద్ర..

నిర్వచించలేని
క్షణాలేవో
ఒదిగి
ఒంటరిగా
ఆవిరికావడం
విరామమా?
విషాదమా?

ఒక
నిశాని
నిశిరాతిరి
ఇలా ముద్రగా! 

రాత్రిని
ఎగరేసుకుపోయే
మేఘమేదో
కమ్ముకుంటూ!

నువ్వంటావు
ఉదయం
వుందా అని?

ఒడ్డున
వొరుసుకు
పోతున్న
ఇసుక
గూడు
చూడు

వెచ్చని
బిందువు
తాకుతూ!!

Thursday, August 25, 2016

సారంగలో నా కవిత "ఎరువు"

 satya2
వంచిన నడుం ఎత్తకుండానే
కమ్మిన మబ్బుకుండ ఒట్టిపోయి
నాటిన నారు నీరిగిరిన మడిలొ
విలవిలలాడుతుంటే
నెత్తురు చిమ్మిన కళ్లు!

వానా వానా వస్తావా
ఈ నేల దాహం తీర్చుతావా!

ఆశలన్ని మొగిలికి చేరి
ఆవిరింకిన కనులలోకి
కాసింత తడి చేరుతుందా!

వాడు నలుదిక్కులా వేసిన
కార్పెట్ బాంబింగ్ పొరల పొరలుగా
బద్ధలై పచ్చదనంతో పాటు పసిపాపలను
హరించి ఇప్పడీ హరిత వనం కోతలు కోస్తున్నాడు!

నేలతల్లి నవ్వులు విరబూసేలా
నువ్వూ నేను కలిసి
ఓ మొక్క నాటుదాం
ఎరువుగా వాడినే పాతుదాం!!

Sunday, August 14, 2016

ఎవరో...


 ఒకరెవరో ఏమవుతారో
అలా ఒకసారి కరచాలనమిస్తారు
ఒక మాట కలుపుతారు
మరల మరల
కలుసుకోవాలని
కలబోసుకోవాలని
వెన్నాడుతూ ఉంటుంది!

అయినా
మరల ఒక కలయిక
కలగానే మిగిలి
ఒక రాతిరిని కొన ఊపిరిగా
రెక్కలూడిన తూనీగలా
మిగిలిపోనిస్తుంది కదా!

ఒక ఆశ వెన్నాడుతూ
నీ గుండె జోలెలో
ఖాళీగా వెక్కిరిస్తూ
వెను తిరిగి చూస్తే
ఒక ముక్కలైన స్వప్నమేదో
పగిలిన అద్దంలో!!

Monday, July 18, 2016

అపరిచితం


వాన వెలసిన వేళ ఒక చీకటి గోడపై
గోటితో చెక్కుతూ

కాగితప్పడవనొకదాన్ని గుప్పిట
జారవిడుస్తున్న సమయంలో

రెక్క తెగి రాలిన భోగన్ విల్లియా
పూరేకొకటి కొట్టుకు పోతున్నప్పుడు

నువ్వంటావు
అలా ఓ కొబ్బరాకులా అల్లుకోనీ అని

ఏముందక్కడ వడలిపోయి అలసిన
ఓ రాతిపొర తప్ప

భ్రమ కాదా ఇది
ఒక మాయజలతారు ముసుగు వేసుకున్న
తడి ఇగిరిన తాటాకు పందిరి కదా

నీడలేవో ముసురుకుంటూ
చివరి శ్వాస తీసుకుంటు ప్రమిదనొదిలిన
దీపం ముందు విరిగిన వెలుగు రేఖలా!!

కలల నావిక

నెలవంక చిగురున
బొట్లు బొట్లుగా
నెత్తుటి చినుకులు
రాలుతూ

తనను తాను
పేల్చుకున్న గుండె
విస్ఫోటనం గరకుగా
తెగుతూ

నువ్వొక రెక్క 
తెగిన పావురాయివే 
తనొక కలల
నావిక కదా?

కొన్ని క్షణాలు
గొంతు తెగి
అమాయకంగా
దోసిలిలో ఎర్రమల్లెలతో

(తరిషి స్మృతిలో)

పోలిక

నువ్వొక లేత ఆకును తాకుతూ
పరవశిస్తూ వుంటావు

పారే నీటి పాయను అరచేతితో తాకుతూ
తన్మయత్వం పొందుతావు

వెచ్చని నుదుటిపై చేతితో తాకుతూ 
బాధగా చూస్తావు

చల్లబడుతున్న అరిపాదాలను తాకుతూ
ఒక దు:ఖపు బిందువౌతావు

సరే
ఈ ముగింపు రోజున కాసిన్ని
నవ్వులను రెప్పల మూటకట్టి
ప్రాణమవుతావా!!

ఒరిపిడి



ఇలా నడకను బంధించి
మాటను నియంత్రించి

నిన్ను నీ నుండి 

దూరం చేస్తూ

వున్న నాలుగ్గోడలనే

సముద్రంలా మార్చి

నిన్ను నువ్ మోసం 
చేసుకుంటూ

ఇసుకలో కుంగిపోతూ 

ఇగిరిపోతూ

ఒంటరిగా కాలిపోతూ

ఆత్మ కమురువాసనేస్తుంటే

నువ్వు మేకప్ నవ్వు

విసురుతూ సంకెల 

ఒరిపిడిని మాయజేస్తూ 

మూలుగుతూ గారడి చేస్తావా???

రాతి స్పర్శ


రాయిని ఒరుసుకుంటూ జారే 
ప్రవాహ గానం


ఆ నున్నటి రాతి స్పర్శ

ఈ వెదురుపొదను తాకుతూ చేరే
గాలి పాట


నిన్నటి గాయాన్ని రాజేస్తూ
ఆకు దోనెలో తడిగా..

Sunday, June 5, 2016

చిగురు..

కదలిక లేనితనం ఒకటి వెంబడిస్తూ
నీలోని చర్యా ప్రతి చర్యలను నియంత్రిస్తుంది

అటూ ఇటూ ఒక కనబడని ఇనుపతెర
పరచుకొని ఒరుస్తూ గాయపరుస్తుంది

గడ్డకట్టిన హృదయం వెచ్చని అశృవుగా
బొట్లు బొట్లుగా రాలుతుంది

నువ్వంటావు ఈ మాయ తెర
చినుగుతుందా అని

విత్తిన ఆ గింజ పగిలి ఎర్ర చిగురు
తొడగక మానదు కదా?

కాసేపిలా ఒత్తిగిలి ఈ మట్టివాసన
గుండెల్నిండా తీసుకోనీ!!

యశోధరను..

ఈ తెలవారని రేయినిలా
నివురులా ఓ కఫన్ కప్పుకొని

నువ్వలా నిశ్శబ్దంగా నడుచుకుంటూ
పోతూ చివరిగా తాకిన నీ వేలి చివరి
తడి ఇంకా ఆరనే లేదు

మరో వైశాఖి నన్ను వెక్కిరిస్తూ
అలల కల్లోలంలో మిణుగురులా దోబూచులాడుతూ

నేనిలా
ఓ తెగిపడిన రావి ఆకులా

రహదారి దుమ్ములో
విరిగిన భిక్షా పాత్రలా

చెదరిన కలలో నీ రాకకై
ఈ ఎండమావి తీరాన
ఇసుక సంద్రంలో ఓ రేణువుగా చెరిగిపోతూ!

నీ
యశోధరను..

ఈ గోడమీద..

మీ పేర్లు
ఒక్కొక్కటి
రాస్తూ

కొన్ని
నెత్తుటి చుక్కల
మధ్య


బాలింతరపు
వాసన

అవును
మిమ్మల్ని
మరిచిపోనివ్వని


ఆకు సవ్వడి
గుండెనలా
ఒత్తిపడుతూ!!

కాసింత నిదురపో


ఆ గరిక పూలనలా తాకకు 
నేల రాలనీ


ఆ మేక పిల్లనలా ఎత్తుకోకు
ఎగిరి దుంకనీ

ఆ ఎర్రని చిగురును తుంచకు
మరికాస్తా ఎదగనీ

ఆ రాతితో మాట కలపకు
మౌనాన్ని అనుభవించనీ

కాసింత గోడవారకు ఒత్తిగిల్లనీ
రెప్పల పడవలో ఈదని!

నివురు..

కొన్ని సాయంత్రాలకు నల్లని ఆకాశపు కొక్కేనికి
ఒంటరి వెన్నెల ఉరిపోసుకుంటుంది

అలముకొన్న సదురు నుండి ఆత్మ
వేరుపడక పొక్కిలిగా పిగిలి పోయింది

నెత్తుటి ధారలన్నీ సిరాగా మారి
చరిత్రను పేజీలలో మడతపెట్టాయి

యింత నమ్మకాన్ని పంచిన
ఉదయాలేవీ నీ కనుపాపలు చేరలేదు

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ
నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది

తూరుపింకా తెలవారక నీ పేరు
తలుస్తూ పొలమారుతొంది

కోందు బాలుడొకడు గొడ్డలి నూరుతూ
నియాంగిరీ సానువులలో సాగిపోతున్నాడు

(కామ్రేడ్ సత్నాం స్మృతిలో)

కానుగపూల పరిమళం...


కొన్ని సాయంత్రాలు దేహం కోల్పోయిన
ఆత్మను మోసుకొస్తుంది


అడుగుల పరిధి కుంచించుకొని
ఒక మాత్ర అందని దూరంలో విసిరేయబడతావు

పహరా చుట్టూ కంచె పెరుగుతూ
నడకను నియంత్రిస్తుంది

నీలోని ప్రతి అణువును మలేరియా తిని
మెదడుకు పాకి కళ్ళను పైకెగదోస్తుంది

నిట్ట నిలువుగా వెన్నును విరిచి
కాళ్ళను చేతులను హరిస్తుంది

నీ నుదుటి మీద వెన్నెల ఓ
దు:ఖపు ముద్దుగా మెరిసి కుంగిపోతుంది

నువ్వంటావు చివరిగా ఈ ఝెండా
భుజం మార్చుకుంటుందా అని

రవీ నువ్ నడిచినంత మేరా పరచుకున్న
ఈ కానుగ పూల పరిమళం అద్దుకుని

అటు చివర ఆ బాలుడు విల్లునలా
గురిచూస్తూ విసురుగా వస్తున్నాడు...

(మలేరియా కబళించిన కామ్రేడ్ సి.సి.కమాండర్ రవి స్మృతిలో)

Friday, April 15, 2016

నీళ్ళు....


కడవల కొద్దీ నీళ్ళు
కలలో కళ్ళలో

నదిలో పాదాలు
మండుతూ ఇసుకలో

గిర్రున తిరుగుతూ
నేల రాలిన కాకి

ఎవరి కంట్లోను
తడిలేనితనం

గుండె ఆవిరై 
నెత్తురు నల్లని మరకగా

నాచు బారిన ఈ 
గోడను వేలితో గీస్తూ

నీళ్ళింకిన మొదలుతో
ఆకు రాలిన బూరుగుమాను

దేహం ఉష్ణ మండల కాసారం

రా
లి
పూవొకటి తారుపై మరుగుతూ

ము
లు
ఉబ్బిన అనాధ రహదారి పక్కన

ఒక తడి మాటను
చిలికి పో!

రాత్రి నీకిన్ని
నీళ్ళు దానం చేస్తుంది...

దాహంతో.......


ఎదురుగా సగం విరిగిన కూజాలోంచి
కొద్దిగా నీళ్ళు ఒంపుకుని
కాసిన్ని గొంతులో పోసుకుని
అలా నీ కనురెప్పలపై చల్లి

మిగిలిన
ఆ కాసిన్ని ఈ మూల బోగన్ విల్లియాపై
చిలికిన ఆ అరచేయినలా
నుదుటిపై వేసుకుని

నేలపై అలా ఒరిగి సేద దీరే ఈ 
మధ్యాహ్నం నువ్వలా
ఒంటరిగా ఎండ ధనరులో 
ఆ చువ్వల నీడల మాటున
దాహంతో ఇగిరిన మందారంలా
వడలి ముడుచుకుని సన్నగా మూలుగుతూ

కంపిస్తున్న దేహంతో....

Friday, April 1, 2016

ఇప్పటికి ఇంతే..

పదే పదే నువ్వలా అడుగుతూనే వుంటావు
ఈ ప్రమిద కింద నీడ దాటి రాలేవా అని

ఆ గాలికి ఎగిరిపోయిన గడ్డి కప్పు అటూ ఇటూ
చెదరి

మొన్నటి వానకు నానిన మట్టిగోడలుపై చారలుగా
మిగిలిన క్రీనీడలు

విరిగిన కంచెను ఆనుకొని ఎరుపు కాగితం పూల
మొక్క వంగిన కొమ్మలు

ఈ ఒంటరి ఆకాశం వీడిన వెన్నెల కాలుతున్న దేహపు కమురు
ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలియని ఓ 
అపస్మారకతలో చేజారిన కుంచె

ఇప్పటికి ఇంతే 
ఆ బాలుడు లేచి నీటిలోకి ఓ రాయిని విసిరాడు

రావి చెట్టు నీడ చెదిరింది 
పాయలుగా.....

Dreams never die...


ఆకాశంలో అలుపు రాని రెక్కలతో 
శూన్యాన్ని ఈదుతూ పక్షులు గుంపుగా

ఈ రాతి నేలపై ఓ నదీ పాయ ఉరుకుతూ
కరకుదనాన్ని కరిగించలేక ఇగురుతూ

కొండ పాదం నుండి ఎర్రగా పోడు కాలుతూ
తనని తాను దహించలేక నిప్పులుగా కురుస్తూ

నువ్వడుగుతావు
స్వప్నాలకు చావుందా? అని

లేదు లేదు
అవి భుజం మార్చుకుంటాయంతే!!

Friday, March 11, 2016

Song at the window


అలా ఏ మూల నుండో ఆ కిటికీ చువ్వనానుకొని
ఒక్కో బొట్టుగా జారుతు

తన చిన్ని ముక్కుతో ఓ పిచ్చుక జారుతున్న 
నీటి బొట్టును అందుకుంటూ తడిగా మెరుస్తూ

తన కాలి గురుతులు ఒక్కొక్కటి అద్దంపై 
అచ్చులుగా మారుతూ ఆవిరవుతూ

గదిలో దేహమంతా జ్వరం వాసన అలముకొని
ఒంటరిగా మూలుగుతూ

గాలికి లయగా కొట్టుకుంటున్న కిటికీ తలుపు 
మూతపడుతున్న రెప్పలపై జల్లులుగా

కదలని గడియారం ముళ్ళు గోడపై 
నగ్నంగా వేలాడుతూ 

ఒక్కోసారి ఇలాగే నిశ్చేతనంగా సమయం
నియంతలా జైలు గదిలో కూలబడుతూ..

Saturday, March 5, 2016

ఆకురాలే కాలం....

ఆకురాలే కాలం

మొదలు ఎండబారి
నేలపై నెత్తురింకుతోంది

వాడొక్కసారిగా విరుచుకు
పడుతున్నాడు

పక్షులు గూటికి చేరకముందే
అలసిన రెక్కలలో గురి చూస్తూ

కాసింత కూడదీసుకోనీ
నేలనింత చెమ్మగిల్లనీ

నీ అరిపాదం నుండి
నడినెత్తి వరకు చీల్చుకు వస్తాం

రన్ బెండ్ రన్
రిట్రీట్
టేక్ క్రాలింగ్ పొజిషన్

వార్ ఫర్ పీస్ నెవర్ ఎండ్
లెటజ్ ఎక్సుపోజ్ హూ ఈజ్ హూ
అండ్ హూ ఈజ్ అన్ అదర్ ఎండ్
నో ఫర్ ట్రంప్ అండ్ నేటివ్ ట్రంప్

లాంగ్ మార్చ్ లాంగ్ మార్చ్..

ఈ రాతిరి....

ఈ రాత్రి
ఒదిగిన కొన్ని ఖాళీల మధ్య
ఒక నిర్లిప్త ఆకాశం పరచుకుంది!

ఆ గది మూల
ఎండిన నీటి కడవపై
సుద్ద ముక్కతో ఏవో గీతలు అలికినట్టుగా!

ఈ గోడకు వేలాడుతున్న
అద్దపు పగుళ్ల మధ్య అతికీ అతకని
సాలీడు గూడు చిట్లిపోతూంది!

ఆ విరిగిన కిటికీ
తలుపుపై పెన్సిల్తో ఓ పేరు
అస్పష్టంగా చెరిగిపోతూ!

ఈ ఐమూల గుంజకు
వేలాడుతున్న చొక్కా జేబులోంచి
గాలికి ఎగిరిన ఓ కాగితపు పూవు!

ఈ రాతిరి
నెత్తుటి ముద్దగా మారిన వెన్నెల
ఆ వంతెన చివర దృశ్యమౌతూ!!

(28th feb. 2016)

Sunday, February 28, 2016

సరే!!


నువ్వెప్పుడూ
ఆ సుదూర తీరాల
ఎగసిన అలగా
గర్భంలో తిరిగి చేరతావు...



నేనే
ఈ మామిడి పూతలా
మంచు కురిసే
వేళ
రాలిపోతాను!


రెండు హృదయాల
సవ్వడీ
మౌనంగా ముగిసే క్షణాన


ఓ భాష్ప గోళం
బద్ధలవుతూ!!

యామినిలో...


ఈ నిశ్చల యామినిలో
అలా  రాలుతూన్న
రావి ఆకు 
ఈనెలఫై మెరిసిన 
దుఃఖ రేణువు

దే
నా
???

యశోధరా
ఈ కాలుతున్న ఒంటరి చీకటి


నీ
పా
దా


ముందు
భిక్షా పాత్ర నిండుగా!!

కొందరంతే....

కొందరంతే
త్వరగా వెళ్ళిపోతారు

తమ పనేదో ముగించేసినట్లుగా
తామివ్వాల్సినదేదో ఇచ్చేసినట్లుగా
చెప్పాల్సినదేదో చెప్పేసినట్లుగా

కొందరంతే
నిర్మొహమాటంగా
త్వరగా వెళ్ళిపోతారు

ఓ అలలా
ఓ మెరుపు కలలా
వేగుచుక్కలా
ఉల్కాపాతంలా
మబ్బుతునకలోని వాన చినుకులా
అలా తాకీ తాకనట్టుగా

కొందరంతే
నిర్భయంగా
త్వరగా వెళ్ళిపోతారు

కొన్ని నవ్వులూ
కొన్ని దు:ఖాలూ
కొన్ని కరచాలనాలూ
ఇంకొన్బి ఆలింగనాలూ
ఓ ఫోటో ఫ్రేంలో మిగిల్చి
నిన్నూ నన్నూ
విసిరి కొట్టి చెప్పా పెట్టాకుండా

కొందరంతే
నిర్దయగా
త్వరగా వెళ్ళిపోతారు...

ఏం రాయను

కాలమిక్కడ స్నేహంగానే గుండెల్లో మంచు కత్తిని
దించుతూ
పొగరుగా నవ్వతూ ఉంటే

చీకటి చొక్కాలో దాగిన ఆత్మ ఒక్కసారిగా
జారిపోతూ
వెన్నుపోటు పొడుస్తూ ఉంటే

నీ కాళ్ళు నీ గమ్యానికి దూరంగా 
జరుగుతూ
ఒంటరిగా విడిచి పోతూ ఉంటే

కాలుతూ రాలిపడ్డ ఉల్క ఏదో 
మెరుస్తూ
నేల మాళిగలోకి చేరిపోతూ ఉంటే

ఏం 
రా
ను

కొన్ని దేహాలకు ఆత్మలు లేవనా? 
నువ్ నువ్వు కాదనా?

ఊరుకో...

అలా ఒక్కసారిగా ఎగసిపాడుతున్న

దు:ఖపు అలను ఒడిసిపట్టి
కాసేపు నిదానించు

గుండెకు దగ్గరగా హత్తుకున్న నీ మోకాళ్ళు
కాస్తా ఊరటనిస్తాయి

ఈ అలికిన మట్టి గోడనానుకొని కాసింత
దమ్ము తీర్చుకో

గాయమైన చోట ఒకసారి నీ వేలితో
నిమురుకో

యుద్ధానికి యుద్దానికి నడుమ
కాసింత ఊపిరి తీసుకొ

ఆ పచ్చని నేల నిన్నలా ఆదరంగా
అక్కున చేర్చుకుని లేపనమవుతుంది

కాసేపు

రు
కో
గాయం సహజమే కదా
మనిషిగా నిలబడాలనుకుంటే...

పచ్చబొట్టు....

కొన్ని సాయంత్రాలకు నవ్వులన్నీ గుత్తుగా 
కోయబడి ఎన్నెల కొడవలికి ఉరితీయబడతాయి

ఆకశాన అలికిన ఈ గోధూళి ఎరుపు జీరల
మాటున ఓ కన్నీటి రేఖ ఇగిరిపోతూ

కాలిన పేగు వాసన నట్టింటి దూలాన వేలాడుతూ
బిక్కచచ్చిన బేల మొఖంపై జవాబు లేని ప్రశ్న

చినిగిన బతుకు పేజీపై నువ్వొక
నీలి సంతకం చేసి విసిరేసి పోయావు

రంగులద్దలేని నీ నలుపు తెలుపుల వర్ణచిత్రం
మా అంతరాత్మ మీద చెరిగిపోని పచ్చబొట్టు...

కొన్ని సాయంత్రాలు...

కొన్ని సాయంత్రాలు తల నుండి మొండెంను వేరు చేస్తాయి
తొడిమ నుండి ఆకు వేరుపడినట్టుగా

మూగగా దు:ఖించే కొన్ని గొర్రె పిల్లలు 
తల్లి నుండి దూరంగా బంధించబడ్డట్టు

ఎగురవేయాల్సిన గాలి పటం దారం నుండి 
వేరుపడి తోక తెగి రైలు కింద నలిగినట్టు

నిన్నటి భోగి మంటలు నేడు నివురు గప్పిన 
నిప్పులా చిటపట మంటూ ఆరిపోతున్నట్టు

నువ్వంటావు ఆయనెందుకలా ఒక్కసారిగా
తెగిపోయి తన్ను తాను ముక్కలు చేసుకున్నాడని

అవును 
ముక్కలు చేస్తున్నది ఏదో తెలిసీ తెలియనట్టుగా
ఈ దారప్పోగులను ముడివేస్తూ విఫలమవుతున్నట్టు

(రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న మిత్రుని స్మృతిలో)

Jan 15 2016 in memory of CK 

కాస్తా ముగించరూ...

కాస్తా ముగించరూ

ఈ నిరామయ నీరవ నిశ్శబ్ద వేళ
ఒక ఆదిమ సంగీతమేదో
దేహాన్ని అతిక్రమించి లోలోపల
అనాత్మనాక్రమించిన వేళ

పనస ఆకు చివర మంచు బిందువొకటి
కరుగుతూ నేలను తాకుతున్న వేళ

కా
స్తా

ము
గిం
     రూ...!!
(Becoming innocence)

Saturday, January 16, 2016

చింత పువ్వు...


నేనలా ఆ కొవ్వొత్తి ఓరగా 
పొక్కులు పొక్కులుగా జారుతు
ఘనీభవిస్తున్న మైనంలా

ను
వ్వ
లా
నిశ్చలంగా ఉలి శ్రమిస్తున్న 
రాయిలా

ఈ హిమమై వణుకుతున్న
రేయి
అరచేతులు చల్లబడుతు

ఆకులేవో మౌనంగా
రాలిపోతూ
తొడిమ చివర
జారుతున్న నీటిబొట్టులా

వెన్నెల క్రీనీడలో
చింత పువ్వులా మెరుస్తూ
ఒక మిణుగురు

కొన్ని క్షణాల ఒడంబడికలా
దేహమంతా ఒకపరి
జలదరిస్తూ

ఆ అలికిన గోడపై ఓ 
నీడ కదలాడి చేయంచున
తాకుతూ

నే
ని
లా
గాలికి ఎగురుతున్న ఓ
పేజీలా అటూ ఇటూ
ఠప్ మని
నిశ్శబ్దాన్ని చెరుపుతూ...!
Related Posts Plugin for WordPress, Blogger...